40వ దశకంలో హిందీ సినిమాలను ఒక ఊపు ఊపిన అందాల హీరో శ్యామ్ (అసలు పేరు సుందర్ శ్యామ్ చద్దా). సినిమా షూటింగ్లో పాల్గొంటున్న సమయంలో అకాల మరణం చెందడం దురదృష్టకరం. 1951లో బిభూతి మిత్రా దర్శకత్వంలో వహించిన సూపర్‌హిట్ చిత్రం ‘షబిస్తాన్’ లో నటిస్తుండగా ప్రమాదవశాత్తూ పరిగెడుతున్న గుర్రం మీద నుంచి కిందపడి శ్యామ్ అక్కడికక్కడే మరణించాడు. తర్వాత డూప్‌ను పెట్టి లాంగ్ షాట్లతో సినిమా పూర్తి చేసి విడుదల చేస్తే సూపర్ హిట్ అయింది. శ్యామ్ 1942లో హిందీ సినీ రంగ ప్రవేశం చేశారు. శ్యామ్ నటించిన చిత్రాల్లో నిగర్ సుల్తానా సరసన నటించిన ‘బజార్’ సినిమాకు మంచి పేరు వచ్చింది. ‘ముజ్‌బూర్’, ‘దిల్లగి’, ‘కనీజ్’, ‘పతంగా’ ‘చాందినీరాత్’, ‘మీనా బజార్’, ‘సమాధి’ సినిమాల్లో శ్యామ్ మెప్పించినవిగా గుర్తింపు పొందాయి. రావల్పిండిలో జన్మించిన శ్యామ్ తొలుత బాంబే టాకీస్ వారు నిర్వహించిన స్క్రీన్ టెస్ట్‌లో విఫలమయ్యాడు. తర్వాత పంజాబీ చిత్రం ‘గొవాండి’లో హీరోగా నటించాడు. సినిమాల్లో నటించడం శ్యామ్ తండ్రికి సుతరామూ ఇష్టం వుండేది కాదు. అయితే మేనమామ తారాచంద్ చడ్డా ప్రోత్సాహంతో హిందీ చిత్రరంగంలో స్థిరపడ్డాడు. 1944లో వాజ్ అహ్మద్ నిర్మించిన ‘మన్ కీ జీత్’లో నీనా సరసన, ‘రూమ్ నంబర్ 9’లో గీతా నిజామి సరసన నటించాక, 1948లో సొంత చిత్రం ‘మజ్బూర్’ను నిర్మించాడు. అందులో మునావర్ సుల్తానా హీరోయిన్గా నటించింది. ఫిలిం ఇండియా మ్యాగజైన్ సంపాదకుడు బాబురావు పటేల్ శ్యామ్ దర్శకత్వ ప్రతిభను పొగడటం ఆ రోజుల్లో సినీ పండితులు గొప్పగా చెప్పుకున్నారు. దిల్లగి సినిమాలో సురయ్యా సరసన శ్యామ్ నటించాడు. ఆ రోజుల్లో దిల్లగి సినిమాలో శ్యామ్, సురయ్యాల మీద చిత్రీకరించిన ‘తు మేరా చాంద్ మై తేరీ చాందినీ’ పాట అందరి నోళ్లలో నానుతూ ఉండేది. పాత తరం వారికి ఈ పాట నేటికీ గుర్తే. శ్యామ్, సురయ్యాను హిట్ పెయిర్ అని పిలిచేవారు. ఈ సినిమా తరువాత వారిద్దరి కాంబినేషన్లో ‘నాచ్’, ‘చార్ దిన్’ సినిమాలు వచ్చాయి. శ్యామ్ అలనాటి హీరోయిన్లు నసీం బాను, నర్గీస్, మీనా షోరే, రెహానాతో నటించి మంచి హిట్ సినిమాలను ప్రేక్షకులకు అందింది అలరించాడు.
