తీరని సౌందర్య కల!!

మ‌హాన‌టి’ సావిత్రి త‌ర్వాత తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఆ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న న‌టీమ‌ణులు చాలా తక్కువ మంది ఉన్నారు. వారిలో సౌంద‌ర్యది ప్ర‌త్యేక స్థానం. టాలీవుడ్‌లోని అగ్ర క‌థానాయ‌కులంద‌రితోనూ ఆమె ఆడిపాడారు. కేవ‌లం గ్లామ‌ర్ పాత్ర‌లే కాదు.. క‌థానాయిక ప్రాధాన్యం ఉన్న చిత్రాల్లో న‌టించి మెప్పించారు. క‌థానాయ‌కుల‌కు దీటుగా ఆమె పాత్ర‌లు ఉండేవి. డాక్ట‌రు కావాల‌నుకున్న సౌంద‌ర్య.. అనుకోకుండా న‌టిగా మారి, చిత్ర ప‌రిశ్ర‌మ‌లో చెర‌గని ముద్ర‌వేశారు. అయితే, ద‌ర్శ‌క‌త్వం వ‌హించాల‌న్న క‌ల నెర‌వేర‌కుండానే ఆమె క‌న్నుమూశారు. ద‌ర్శ‌క‌త్వంపై త‌న‌కున్న ఇష్టాన్ని ఓ సంద‌ర్భంలో పంచుకున్నారు. ‘‘ద‌ర్శ‌క‌త్వం చేయాల‌న్న ఒక త‌ప‌న ఉంది. అది ఎప్పుడ‌వుతుందో తెలియ‌దు. కానీ, కచ్చితంగా ద‌ర్శ‌కురాలిని అవ్వాలని ఉంది. దర్శకత్వంలో ఉన్న సృజనాత్మకత, ఆత్మ సంతృప్తి ఏ నటుడు లేదా నటికైనా అల్టిమేట్‌ అవుతుంది. నిర్మాతగా కాస్త సంతృప్తి ఉన్నా, దర్శకత్వం చేస్తే అది ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఒక దర్శకుడు అద్భుతమైన పాత్రలను సృష్టిస్తాడు. అయితే, అందుకు మంచి కథ, టీమ్‌ ఉండాలి. నాకు దర్శకత్వం ఎందుకు చేయాలనిపిస్తుందంటే, నా మనసులో బోలెడన్ని ఆలోచనలు, స్క్రిప్ట్‌లు ఉన్నాయి. వాటికి నేనే దర్శకత్వం వహించాలి. ఎందుకంటే మన ఆలోచనలను మనకంటే బాగా ఎవరూ ప్రెజెంట్‌ చేయలేరు.’’ అని చెప్పుకొచ్చారు. తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ చిత్రాల్లో నటించిన సౌందర్య.. ‘ద్వీప’ అనే చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు. 2003లో ఉత్తమచిత్రంగా ‘ద్వీప’ జాతీయ అవార్డును సొంత చేసుకుంది.






Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.