పాడలేనన్న చిత్రంతోనే.. జాతీయ అవార్డు

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తన సినీ కెరీర్‌లో పాడిన పాటలన్నీ ఒకెత్తు.. ‘శంకరాభరణం’ చిత్రంలో ఆలపించిన పాటలు మరొకెత్తు. పాశ్చాత్య సంగీత పెను తుపానుకు తట్టుకోలేక శాస్త్రీయ సంగీతం తన ఉనికిని కోల్పోతున్న తరుణంలో ‘శంకరాభరణం’ పాటలు జనానికి శాస్త్రీయ సంగీతపు మధురిమలను రుచి చూపించింది. ఈ సినిమా తర్వాత ఎంతో మంది యువతీ యువకులు శాస్త్రీయ సంగీతం నేర్చుకోవడం ప్రారంభించారంటే.. ఈ సినిమా ఏస్థాయిలో సినీప్రియుల మదిపై చెరగని ముద్ర వేసిందో అర్థం చేసుకోవచ్చు. శాస్త్రీయ సంగీతం ప్రధానాంశంగా విశ్వనాథ్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం కోసం బాలసుబ్రహ్మణ్యంను గాయకుడిగా తీసుకొంటున్నప్పుడు చాలా మంది ముక్కున వేలేసుకున్నారు. ‘సంగీతం నేర్వని బాలుతో ఈ సినిమాలో పాటలు పాడిస్తున్నారంటే ఇక ఇది ఆడినట్టే’’ అని పెదవి విరిచారు. ‘‘ఇక బాలు పని అయిపోయినట్లే. మూటా ముల్లు సర్దుకోని నెల్లూరు కెళ్లి తండ్రిలాగే హరికథలు చెప్పుకోవాల్సిందే’’నని మరికొందరు అవహేళన చేశారు. కానీ వాస్తవమేంటంటే ఈ సినిమాకు ఎస్పీబీని అనుకున్నప్పుడు తాను కూడా ఈ చిత్రంలో పాటలు పాడేందుకు అంగీకరించలేదు. ‘నా వల్ల కాదు నన్నొదిలేయండి. ఇదసలే సంగీత ప్రధానమైన చిత్రం. దీన్ని సంగీతం పట్ల బాగా పట్టు ఉన్నవారితో పాడిస్తే బాగుంటుంది. నాలాంటి వ్యక్తితో పాడించొద్దు. ఒకవేళ ఈ అద్భుత కళాఖండానికి గాయకుడిగా నేను న్యాయం చెయ్యలేకపోతే.. నా గతి ఏం కావాలి. నేను ఆత్మహత్య చేసుకోవాల్సిందే’’ అని జారుకునే ప్రయత్నం చేశారు. కానీ, చిత్ర బృందం మొత్తం పట్టువదలని విక్రమార్కుల్లా బాలు వెంటే పడటంతో తప్పని పరిస్థితుల్లో ఈ చిత్రానికి పాడేందుకు అంగీకరించారు. అందరూ ఇచ్చిన సలహాలు, సూచనల మేరకు సులభంగా పాడేరీతిని ఆకలింపు చేసుకోని, గుండెల్లో గూడు కట్టుకొని ఉన్న భయాల్ని పటాపంచలు చేసి అద్భుతంగా పాటలు పాడి విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నారు బాలు. ఈ చిత్రంతో ఉత్తమ నేపథ్య గాయకుడిగా జాతీయ అవార్డుతో పాటు నంది పురస్కారాన్ని దక్కించుకున్నారు. అందుకే ‘శంకరాభరణం’ ప్రస్తావన ఎప్పుడొచ్చినా.. ‘‘సంగీతపరంగా, వాయిద్యపరంగా నాకు సహకరించిన వాళ్లందరికీ నేను జీవితాంతం రుణపడి ఉంటాను’’ అని వినయంతో కృతజ్ఞతలు తెలియజేస్తుంటారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం.

Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.