తమిళంలో యమ్జీఆర్‌తో

ఒక రోజు బాలు ఎ.వి.యం. స్టూడియోలో ఎల్లారీశ్వరితో యుగళగీతం పాడుతుండగా, షూటింగ్‌ గ్యాప్‌లో బయటకు వచ్చిన యమ్జీఆర్‌కు ఆ పాట వినిపించింది. అది తమిళంలో తను నటించిన ‘నీరుంనిరుప్పుం’ తెలుగు వర్షన్‌లోనిది కావడంతో యమ్జీఆర్‌ నిశితంగా పాట ఆలకించి మరుసటిరోజు బాలుని పిలిపించారు. తను తీయబోయే ‘అడిమైపెణ్‌’ భారీ చిత్రంలో ‘ఆయురం నిలవే వా’ పాటను బాలుచేత పాడించమని మహదేవన్‌కు చెప్పారు. విషయం కోదండపాణికి తెలిసి ఎంతో సంతోషించారు. మరో పదిరోజుల్లో పాట రికార్డింగు ఉందనగా బాలుకు టైఫాయిడ్‌ జ్వరం వచ్చింది. మరోవైపు ఈ పాట చిత్రీకరణ కోసం జైపూరులో 200 మంది జూనియర్‌ ఆర్టిస్టులతో షెడ్యూలు తయారైంది. బాలు అనారోగ్యం విషయం యమ్జీఆర్‌కు తెలిసింది. బాలు మాత్రం తనకు అవకాశం జారినట్లే భావించారు. ఈ పాటను వేరెవరితోనే పాడించేసి చిత్రీకరణ జరిపి ఉంటారని ఊహించారు. కానీ ఇరవై రోజులయ్యాక యమ్జీఆర్‌ మేనేజరు బాలుని కలిసి ‘‘రిహార్సల్‌కు రాగలవా’’ అని అడిగారు. అనుకున్న పాట పోతేపోయింది మరొకటి దక్కిందిలే అని సంతోషపడుతూ బాలు మహదేవన్‌ను కలిశారు. ‘‘అయిరం నిలవే వా’’ పాటను పుహళేంది బాలు చేత ప్రాక్టీసు చేయిస్తుంటే బాలు ఆశ్చర్యపోయారు. రెండ్రోజుల తర్వాత రికార్డింగు జరిగింది. బాలు సుశీలతో కలిసి ఆ పాట ఆలపిస్తుంటే కొందరు తొంగి తొంగి చూస్తూ బాలు పాడే విధానాన్ని గమనిస్తున్నారు. బాలుకు తర్వాత తెలిసింది.. వారంతా యమ్జీఆర్‌తో సినిమాలు తీసే నిర్మాతలని. పాట రికార్డింగు పూర్తయ్యాక యమ్జీఆర్‌ ప్రెస్‌మీట్‌ పెట్టి, బాలుని తన నిర్మాతలకు పరిచయం చేసి ‘‘ఈ అబ్బాయి బాగా పాడుతున్నాడు. నేను నటించే మీ చిత్రాలలో ఇతనిచేత ఒక్క పాటైనా పాడించండి’’ అంటూ నిర్మాతలను కోరారు. బాలు యమ్జీఆర్‌కు కృతజ్ఞతలు చెబుతూ ‘‘సారీ సర్‌! టైఫాయిడ్‌ జ్వరం నన్ను మంచం మీద పడేసింది. నా వలన మీ షూటింగుకు అంతరాయం కలిగింది’’ అంటే, యమ్జీఆర్‌ స్పందిస్తూ ‘‘ఈ పాట మూడు వారాల క్రితమే వేరే వారితో పాడించుకొని షూటింగు పూర్తి చేసేవాడినే. కానీ నువ్వు నాకు పాడుతున్నావని పదిమందికీ తెలిసింది. ఈ పరిస్థితుల్లో ఆ పాట వేరొకరు పాడితే, నీ పాట నచ్చలేదేమో అనే అపవాదు చోటు చేసుకుంటుంది. అది నీ భిష్యత్తుకు దెబ్బ. అందుకే షూటింగు వాయిదా వేశాను. ఆరోగ్యం జాగ్రత్త’’ అని భుజం తట్టారు. ఆ పాటకు బాలుకు ఉత్తమ గాయకుని బహుమతి లభించింది. విశేషమేమంటే ఈ సినిమాకు మహదేవన్‌ సంగీత కర్తయినా, ఎమ్మెస్‌.విశ్వనాథన్‌ మాత్రం తన సంగీత విభావరిలో బాలు చేత ఈ పాట తప్పక పాడించేవారు. అదీ బాలు ప్రజ్ఞ!Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.