సూర్యకాంతం పకోడీ ప్ర‘కోపం’!
‘‘పాత్రల ప్రభావం నటుల మీద పడుతుందా?’’ అని అడిగాతే, కొందరి మీద పడుతుంది. విలన్‌ పాత్రలు ధరించే వాళ్లు బయటకూడా - అలా క్రూరంగా ప్రవర్తిస్తారా? ప్రవర్తించిన వాళ్లున్నారు - అందరూ కాదు. ముఖ్యంగా చిత్తూరు నాగయ్య - పోతన పాత్ర చేసిన తర్వాత, రామభక్తులయిపోయారు పూర్తిగా. వేమన పాత్రతో సాధు వర్తనం అలవాటు చేసుకున్నారు. ‘‘అంతకుముందు నాకు బాగా కోపం వుండేది. తరువాత తగ్గిపోయింది’’ అని చెప్పారు నాగయ్య. హీరోలు హీరోయిన్లని ప్రేమిస్తారు చిత్రాల్లో. బయట కూడా వాళ్లు ప్రేమించిన ఉదంతాలున్నాయి. సూర్యకాంతం గయ్యాళి పాత్రధారి. మనసు మంచిదే అయినా, బయట కూడా ఒకోసారి కోపం వచ్చి ‘గయ్యాళి’గా అరిచేవారు. ఒకసారి షూటింగ్‌ కోసం హైద్రాబాదు వచ్చి సారధి స్టూడియోలో వున్న కాంటీన్‌లో - సాయంకాలం పకోడి చెయ్యమన్నారు. తీరా, సాయంకాలం రాగా, ‘‘అందరికీ పకోడి తీసుకురా’’ అని ఆమె, ప్రొడక్షన్‌ వాళ్లకి చెబితే, అతగాడు వెళ్లి ‘‘పకోడి చెయ్యలేదమ్మా - బజ్జీ చేశాట్ట’’ అని చెప్పారు. ఇక చూడాలి, ఆమె ప్రతాపం! ఆ కాంటీన్‌ అధికారిమీద - తాటిచెట్టు ప్రమాణంలో లేచారు. ‘‘చెప్పినప్పుడు చేస్తానని ఎందుకన్నావు? చెయ్యలేకపోతే నాకొచ్చి చెప్పాలా లేదా? నీ యిష్టం వచ్చినట్టు నువ్వు చెయ్యడం ఏమిటి? ఈ బజ్జీలు నేను చెయ్యమనలేదు. నేను డబ్బు ఇవ్వను. నీ యిష్టం వచ్చినవాడికి చెప్పుకో, మరీ మాట్లాడావంటే, పెద్దవాళ్లతో చెప్పి నీ క్యాంటీన్‌ ఎత్తించేయగలను’’ అని - విశ్వరూపం చూపించేసరికి - కాంటీన్‌ అధికారి కాళ్లమీద పడ్డాడు.


- రావి కొండలరావు


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.