తొలి త్రీడీ సినిమా!

కళ్లజోడు పెట్టుకుని చూసే త్రీడీ సినిమాలంటే అదో ఆకర్షణ. అందులోని దృశ్యాల లోతు, వాస్తవికతలే అందుకు కారణం. మరి ప్రపంచంలోనే తొలి త్రీడీ సినిమా ఏంటో తెలుసా? దాని పేరు ‘ద పవర్‌ ఆఫ్‌ లవ్‌’. ఇదొక నిశ్శబ్ద చలన చిత్రం. 1922 సెప్టెంబర్‌ 27న విడుదలైంది. అంటే 96 ఏళ్ల క్రితమే ఈ సాంకేతికతను ఉపయోగించారన్నమాట. ఆకుపచ్చ, ఎరుపు రంగుల్లో వేర్వేరు అద్దాలు ఉండే కళ్లజోడును ఈ సినిమా చూడ్డానికి అందజేశారు. ఈ సినిమాలో మరో విచిత్రం ఏమిటంటే ఈ సినిమాకు రెండు ముగింపులు ఇచ్చారు. ఒకటి సుఖాంతం కాగా, రెండోది విషాదాంతం. కళ్లజోడు పెట్టుకున్న ప్రేక్షకులు ముగింపు సన్నివేశాలను ఒక కంటితో చూస్తే సుఖాంతం, మరో కంటితో మాత్రమే చూస్తే విషాదాంతంలా కనిపించేలా ఏర్పాటు చేశారు. అయితే ఈ త్రీడీ సినిమా అప్పటి ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేదు. తర్వాత ఇదే చిత్రాన్ని ‘ఫర్‌బిడెన్‌ లవర్‌’గా టూడీలో విడుదల చేశారు.





Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.