దగాపడిన దానశీలి


ప్రముఖ నటుడు పద్మశ్రీ చిత్తూరు. వి.నాగయ్య చేతులకు ఎముకలుండేవి కావు. దయాగుణం, దానగుణం వారికి పుట్టుకతోనే వచ్చిన లక్షణాలు. నాగయ్య సినిమాలలో ప్రయత్నాలు చేస్తూ మద్రాసు జార్జి టౌన్‌లో వున్న సర్దార్‌ భవన్‌ హోటల్లో వుండేవారు. నాగయ్య తండ్రి చనిపోయాక జీవిత బీమా సొమ్ము పదివేల రూపాయలదాకా అతని చేతికి అందింది. ఆ సొమ్ముతో సినిమాలలో ప్రయత్నాలు చేస్తూ, ఇంటికి డబ్బు పంపుతూ వుండవచ్చుననేది నాగయ్య ఆలోచన. ఇదిలా వుండగా అదే హోటల్లో నాగయ్యకు రంగస్వామి పిళ్లై అనే ఒక వ్యక్తితో పరిచయమైంది. అతడు చాలా దర్జాగా కనిపించేవాడు. చేతి వేళ్ళనిండా ఉంగరాలు, చలవ చేసిన తెల్లని దుస్తులతో పెద్ద జమీందారులా కనిపిస్తూ బయటకు వెళ్ళి వస్తుండేవాడు. నాగయ్య అతనితో చనువు పెంచుకున్నారు. సిలోన్‌ దేశంలో వ్యాపారం చేస్తుంటానని తనను తాను పరిచయం చేసుకున్నాడు రంగస్వామి. నాగయ్య సినిమాలలో నటించే ప్రయత్నాలు చేస్తున్నట్లు రంగస్వామికి తెలిసింది. తనకు కూడా సినిమాలంటే చాలా ఇష్టమని, త్వరలోనే ఒక సినిమా నిర్మించబోతున్నానని, అందులో నాగయ్యకు అవకాశం కలిపిస్తానని రంగస్వామి గొప్పలు చెప్పాడు. నమ్మిన నాగయ్య రంగస్వామిని ఒకసారి నేషనల్‌ మూవీటోన్‌ స్టూడియోకు తీసుకెళ్లారు. అక్కడ నెల్లూరు నగరాజరావుకి రంగస్వామిని పరిచయం చేశారు. ఏదైనా మంచి కథను ఆలోచించమని నగరాజరావుతో రంగస్వామి అన్నారు. నగరాజరావు ఆలోచించి ‘నరనారాయణ’ నేపథ్యంలో సినిమా నిర్మిస్తే విజయవంతమౌతుందని సలహా ఇచ్చాడు. వీలయినంత త్వరగా సినిమా నిర్మాణం చేపడదామంటూనే తనవద్ద వున్న డబ్బంతా కోర్టు వ్యహారాలకు ఖర్చై పోయిందని నాగయ్యతో రంగస్వామి పిళ్లై చెప్పాడు. వెంటనే అమాయకపు నాగయ్య తనవద్ద పదివేలరూపాయలు ఉందని చెప్పడంతో ఆ సొమ్ముతో ఆఫీసు ఏర్పాటు చేశారు. మరో వారంలో కొలంబోకి వెళ్లి వెంటనే లక్షరూపాయలు పంపుతానని నమ్మబలికిన అతడు నాగయ్య దగ్గరున్న మరో ఆరువేల రూపాయలు తీసుకొని వెళ్లిపోయాడు. ఇక్కడ మద్రాసులో నాగయ్య నగరాజరావుతో కలిసి ఆఫీసులో స్క్రిప్టు పనులు చూసుకుంటున్నారు. ఇరవై రోజులు గడిచాయి. రంగస్వామి పిళ్లై నుంచి ఉత్తరం కూడా రాలేదు. రోజూ నాగయ్య మర్కాంటైల్‌ బ్యాంకుకు వెళ్ళి ఏదైనా డ్రాఫ్టు వచ్చిందేమో కనుక్కుంటూ వుండేవారు. రంగస్వామి సిలోన్‌లో పెద్ద వ్యాపారి అని నాగయ్య చెబుతుంటే బ్యాంక్‌ వాళ్లు నవ్వి, రంగస్వామి ఎవరు, డ్రాఫ్టు ఇక్కడకు ఎలా వస్తుంది అని అడగడంతో, తను మోసపోయానని నాగయ్యకు అర్ధమైంది. చివరకు ఆ రంగస్వామి ఘరానా మోసగాడని నాగయ్యకు తెలిసింది. తరువాత నాగయ్య దివాన్‌ బహదూర్‌ రంగనాథం గారిని కలిసి గోడు విన్నవించుకుంటే, అంతవరకూ అయిన అద్దె చెల్లించనవసరం లేదని, బంగాళా ఖాళీ చెయ్యవలసిందని చెప్పడంతో నాగయ్య కొంత వూపిరి పీల్చుకున్నారు. చేతుల్లో డబ్బు లేక నుంగంబక్కమ్‌లో ఒక చిన్న గదిలో నాగయ్య తలదాల్చుకోవలసి వచ్చింది. తిండి తిప్పలు లేక నీళ్లుతాగి పొట్ట నింపుకున్నారు. ఒక అణా జేబులో వుంటే శనక్కాయలు కొనుక్కొని ఆకలి తీర్చుకునేవారు. తరువాత బి.ఎన్‌.రెడ్డితో సాంగత్యం కుదరడం... సినిమాలలో నటించడం ధనవంతుడు కావడం, దానాలు చేయడం, విరాళాలు ఇవ్వడం, మోసాలకు గురికావడం, ఆస్తులు పోగొట్టుకోవడం మనకు తెలిసిన విషయమే. ముప్పై ఏళ్ళ సినిమా జీవితంలో నాగయ్య మిగిల్చుకున్నది అందరిచేతా ‘నాన్నగారూ’ అనిపించుకోవడమే!

- ఆచారం షణ్ముఖాచారిCopyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.