దోస్తీకి నజరానా ... జంజీర్
అదృష్టం తలుపు తడితే ఒక్క సినిమా చాలు సూపర్ స్టార్ స్థాయి అందుకోవడానికి. అమితాబ్ బచ్చన్‌కు  ఆ అదృష్టాన్ని అందించిన సినిమా ప్రకాష్ మెహరా నిర్మించిన ‘జంజీర్’. రచయితలుగా సలీం-జావేద్‌లను, యాంగ్రీ యంగ్ మ్యాన్‌గా అమితాబ్ బచ్చన్‌ని  సమున్నత స్థాయిలో నిలబెట్టిన ఈ సినిమా ఇతర భాషా చిత్రాలకు మార్గదర్శకమై నిలిచింది. తెలుగులో ఎస్.డి.లాల్ దర్శకత్వంలో ఎన్.టి.రామారావు, లత జంటగా నటించిన ‘నిప్పులాంటి మనిషి’ సినిమా ‘జంజీర్’ చలవే! అయితే ఈ సినిమాలో అవకాశం అమితాబ్ బచ్చన్‌కు అంత సులభంగా దక్కలేదు. ఆ పూర్వాపరాలను విశదీకరిస్తే  ఎన్నో విషయాలు అవగతమౌతాయి.సలీం-జావేద్‌లు ‘జంజీర్’ చిత్రకథను రూపొందించినప్పుడు ప్రేమ కథలు, సెంటిమెంటు కథలతో సినిమాలు వస్తూ వుండేవి. ‘జంజీర్’ చిత్రం ఒక విభిన్నమైన కథతో రూపొండం వలన ప్రేక్షకులకు కొత్తగా అనిపించి బాగా ఆదరించారు. ఈ చిత్రం ద్వారా లాభపడింది అమితాబ్ బచ్చన్ కాగా, అదృష్టాన్ని వెనక్కు నెట్టుకుంది ధర్మేంద్ర. అది ఎలాగంటే ... సలీం-జావేద్ రూపొందించిన ‘జంజీర్’ సినిమా కథ హక్కులు కొనుక్కున్నవాడు ధర్మేంద్ర! దర్శక నిర్మాత ప్రకాష్ మెహరా అప్పట్లో రెండు సినిమాల నిర్మాణానికి హక్కులు పొంది వున్నాడు. వాటిలో మొదటిది ‘సమాధి’ చిత్ర కథ కాగా రెండవది ‘కహానీ కిస్మత్ కి’ సినిమా కథ. ‘సమాధి’ (1972) చిత్రం సంగం ఆర్ట్స్ పతాకం క్రింద ప్రకాష్ మెహరా దర్శకత్వంలో విడుదలవగా అందులో ధర్మేంద్ర ద్విపాత్రాభినయం (తండ్రి, కుమారుడు) చేశాడు.... అది వేరే సంగతి. ‘సమాధి’, ‘కహానీ కిస్మత్ కి’ సినిమా కథల్లో ధర్మేంద్రకు రెండవది నచ్చడంతో ప్రకాష్ మెహరాను ఒక కోరిక కోరాడు. అర్జున్ హింగోరాని ధర్మేంద్రకు గాడ్ ఫాదర్ వంటివాడు. ఆ చిత్రకథను అర్జున్ హింగోరానికి ఇస్తే అందులో తను నటించి గురుదక్షిణగా గాడ్ ఫాదర్ కు ఇస్తానని ప్రతిపాదించాడు. ప్రకాష్ అందుకు సరేనంటూ ఒక ప్రతిపాదన ధర్మేంద్ర ముందు వుంచాడు. ధర్మేంద్ర వద్ద కథా హక్కులు వున్న ‘జంజీర్’ చిత్రంలో తన దర్శకత్వంలో ధర్మేంద్ర నటించాలని, అంతేకాదు... ఆ చిత్ర నిర్మాణంలో పెట్టుబడి పెట్టాలని ఆ ప్రతిపాదన సారాంశం. ధర్మేంద్ర అందుకు ‘’సరే’’నన్నాడు. ‘సమాధి’, ‘జంజీర్’ చిత్రాలలో నటించేందుకు ఒప్పందం కుదిరిన వెంటనే ప్రకాష్ మెహరా ధర్మేంద్రకు అడ్వాన్సు కూడా చెల్లించాడు. ‘జంజీర్’ లో కథనాయికగా నటించేందుకు ముంతాజ్‌ను ఎంపిక చేశారు. ప్రకాష్ మెహరా ఆలస్యం చేయకుండా పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ‘జంజీర్ ‘చిత్రాన్ని మొదలు పెడుతున్నట్టు, ఆ చిత్ర విశేషాలను వెల్లడించాడు. ఆ ప్రెస్ మీట్ సంగతి తెలిసి ధర్మేంద్ర ప్రకాష్ మెహరాను కలిశాడు. ఆరేడు నెలల్లో సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నట్లు మెహరా మాటల సందర్భంలో ధర్మేంద్రకు వెల్లడించారు. ‘’ఇంత త్వరగా ‘జంజీర్’ చిత్ర నిర్మాణం చేపడుతున్నట్లు నాకు మాటమాత్రమైనా చెప్పలేదు. నా సోదరుడు వీరేంద్ర సింగ్ డియోల్‌ని హీరోగా పెట్టి ‘ధరమ్ జీత్’ సినిమా ప్లాన్ చేస్తున్నాను. ఆ సినిమా సగమైనా పూర్తి కాకముందే ‘జంజీర్’లో నటించడం సాధ్యం కాదు’’ అని చెప్పడంతో ప్రకాష్ మెహరా నోటిలోపచ్చి వెలక్కాయ పడినట్లయింది. ఇద్దరూ సమీక్షించుకున్న తరువాత ధర్మేంద్ర ‘జంజీర్’ ప్రాజక్టు నుంచి తప్పుకోవడానికి ‘’సరే’’ అన్నాడు. ప్రకాష్ మెహరా మాత్రం ‘జంజీర్’ చిత్రాన్ని వెంటనే మొదలు పెట్టాలని దేవానంద్‌ను సంప్రదించాడు. దేవానంద్ కథ బాగుందని మెచ్చుకుంటూనే ఈ సినిమాలో హీరోకు ఒక్క పాట కూడా లేకుంటే బాగుండదని, కథను కొంత మార్చితే తను పెట్టుబడి కూడా పెట్టి ‘నవకేతన్’ బ్యానర్ మీదే సినిమా తీద్దామని ప్రతిపాదించాడు. ప్రకాష్ మెహరా సందిగ్ధంలో పడిపోయాడు. అసలు ‘జంజీర్’ కథలో ఆసాంతం హీరో యాంగ్రీ యంగ్ మ్యాన్. ఆగ్రహం, పగ కట్టలు తెంచుకొనే పాత్ర. అటువంటి పాత్రకు పాటలు పెట్టడం అసంభవం కాబట్టి దేవానంద్ ప్రతిపాదనకు ఒప్పుకోలేదు. దాంతో దేవానంద్ తప్పుకున్నాడు. తరువాత రాజకుమార్‌ని బుక్ చేద్దామని అనుకొని, అతను మద్రాసులో షూటింగులో వుండడంతో అక్కడకు వెళ్ళి రాజకుమార్‌ని సంప్రదించారు. కథ విని రాజకుమార్ తప్పకుండా నటిస్తానని చెబుతూ, ప్రస్తుతం మద్రాసులో సినిమా షూటింగు జరుగుతోంది కాబట్టి ‘జంజీర్’ చిత్ర నిర్మాణాన్ని మద్రాస్‌లో ప్లాన్ చేసుకోమని, అలా అయితే కాల్ షీట్లు ఎన్నయినా ఇవ్వగలనని చెప్పడంతో ప్రకాష్ మెహరా మరలా ఆలోచనలో పడ్డారు. ‘జంజీర్’ చిత్ర కథ అంతా బొంబాయి నగర నేపథ్యంలో జరుగుతుంది కనుక మ,ద్రాసులో షూట్ చెయ్యడం సాధ్యం కాదని ప్రకాష్ మెహరా చెప్పడంతో రాజకుమార్ కూడా తప్పుకున్నాడు. బొంబాయి తిరిగివచ్చిన ప్రకాష్ మెహరాను నటుడు ప్రాణ్ కలిసి ‘’ఒకసారి బాంబే టు గోవా’’ సినిమా చూడండి. ఆ సినిమాలో అమితాబ్ బచ్చన్ నటన అమోఘం. బహుశా ‘జంజీర్’ సినిమాలోని హీరో పాత్రకు అతడు పనికిరావచ్చు’’ అంటూ సలహా ఇచ్చారు. ప్రకాష్ మెహరా సలీం-జావేద్ లతో కలిసి ఆ సినిమా చూశారు. అందులో అమితాబ్-శత్రుఘ్నసిన్హాల మధ్య జరిగే పోరాట సన్నివేశాలు ముగ్గురికీ ఎంతగానో నచ్చాయి.ప్రకాష్ మెహరా అమితాబ్ బచ్చన్‌ని కలిసి ‘జంజీర్’ కథను వినిపించి, అతని అంగీకారంతో అగ్రిమెంటు రాయించారు. అయితే ఈ సమస్య ఇంతటితో ఒక కొలిక్కి రాలేదు. కథానాయికగా అనుకున్న ముంతాజ్ పేచీ పెట్టింది. ఆమెకు ధర్మేంద్ర, రాజకుమార్ ఇద్దరిలో ఎవరితోనైనా నటించేందుకు అభ్యంతరం లేదు కానీ కొత్త నటుడైన అమితాబ్ బచ్చన్‌తో నటించేందుకు మొగ్గు చూపలేదు. కాల్షీట్ల సమస్య ఉందంటూ తప్పుకుంది. ఈ విషయం అమితాబ్ బచ్చన్‌ని బాధించింది. అప్పుడు జయభాదురిని హెరోయిన్‌గా  తీసుకుందామని అమితాబ్ ప్రతిపాదించగా ప్రకాష్ మెహరా అంగీకారం తెలిపి సినిమా నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ప్రాణ్ ఆ చిత్రంలో మరొక ప్రధానమైన పఠాన్ పాత్రను పోషించేందుకు ముందుకొచ్చారు. అదే సమయంలో మనోజ్ కుమార్ ‘షోర్’ సినిమా తీస్తూ అందులో ప్రాణ్‌కు మంచి పాత్రను ఇవ్వజూపినా, ప్రకాష్ మెహరాకు మాట ఇచ్చి వుండడంతో, మనోజ్ కుమార్ సినిమా వదలుకొని ‘జంజీర్’ చిత్రంలో నటించేందుకు నిర్ణయించుకున్నారు (‘షోర్’ చిత్రంలో ప్రాణ్‌కు ఇవ్వజూపిన పాత్రను ప్రేమ్ నాథ్ పోషించారు). ‘జంజీర్’ సినిమా షూటింగ్ మొదలైంది. ప్రకాష్ మెహరాను అమితాబ్ ఎంతో గౌరవంగా ‘’సార్’’ అని సంబోధించేవారు.. ‘’ఈ సినిమా తరువాత నా భవిష్యత్తు ఎలావుంటుందోనని భయంగా వుంది’’ అని అమితాబ్ అంటూవుంటే ‘’ఈ సినిమా విడుదలకానీ.  తరువాత నువ్వు మనదేశపు ఉత్తమ నటుడివి అవుతావు’’ అని ఆశీర్వదించేవారు. ‘జంజీర్’ చిత్రం 1973 మే నెల 11వ తేదీన విడుదలైంది. బొంబాయి గెయిటీ థియేటర్‌లో మొదటి మూడు రోజులు హౌస్ ఫుల్ కాలేదు. అయిదవరోజు నుంచి థియేటర్ ముందు సినిమాకోసం ప్రేక్షకులు పెద్దపెద్ద క్యూలు కట్టారు. సినిమా సూపర్ హిట్టయింది. అమితాబ్‌ను సూపర్ స్టార్ చేసింది. నాలుగు ఫిలింఫేర్ బహుమతులు గెలుచుకోవడమే కాకుండా మరొక ఆరు విభాగాలలో నామినేషన్ దక్కించు కొని చరిత్ర సృష్టించింది ఈ ‘జంజీర్’. రంజాన్ పవిత్ర మాసంలో అమితాబ్‌కు అల్లా ప్రసాదించిన బంగారు భవిష్యత్తు ‘జంజీర్’.- ఆచారం షణ్ముఖాచారి 


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.