రూపాయికి రెండు రూపాయిలొచ్చాయి..
‘‘కల్యాణ్‌రామ్‌ కెరీర్‌లో వసూళ్ల పరంగా నంబర్‌ వన్‌ సినిమా ‘పటాస్‌’. అదొక వాణిజ్య ప్రధానమైన సినిమా. ‘118’... ఓ కొత్త జోనర్‌ కథ. ఇందులో రిస్క్‌ ఉంటుంది. కల్యాణ్‌రామ్‌ మరోమారు రిస్క్‌ చేసి విజయాన్ని నిలబెట్టుకొన్నారనే పేరును తీసుకొచ్చిందీ చిత్రం. నిర్మాతగా నేను రూపాయి పెడితే, రెండు రూపాయలొచ్చింది’’.


*
‘‘కల్యాణ్‌రామ్‌ కథానాయకుడిగా నటించిన ‘నా నువ్వే’కి నేను సమర్పకుడిని. కానీ అది ఆశించిన స్థాయిలో ఆడలేదు. అది మాలో కసిని పెంచింది. ఆ సినిమా చిత్రీకరణ జరుగుతున్న సమయంలోనే ఈ కథని చెప్పాడు దర్శకుడు గుహన్‌. ఎక్కువ ఖర్చవుతుందని తెలిసినా... మంచి సినిమా చేయాలని ప్రయత్నించాం, విజయం సాధించాం. ఈ కథని కల్యాణ్‌రామ్‌ ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌లో చేయాలనుకొన్నారు. కానీ ఇలాంటి కథ నా బ్యానర్‌లో
చేసుకుంటే బాగుంటుందని నేనే ఆయన్ని అడిగి తీసుకున్నా. థ్రిల్లర్‌ కథలు, కొత్త తరహా ప్రయత్నాలంటే నాకు ఇష్టం. ప్రస్తుతం కీర్తిసురేష్‌ ప్రధాన పాత్రధారిగా నిర్మిస్తున్న సినిమా కూడా కొత్త రకమైన కథే. అలా ఈ ఏడాది ఇంకో రెండు సినిమాలు చేస్తున్నాం’’.

*
‘‘దర్శకుడు కె.వి.గుహన్‌ కథ చెప్పింది చెప్పినట్టు తీస్తాడని నమ్మకముంది. ప్రయోగం చేస్తున్నట్టు మాకు ఎప్పుడూ అనిపించలేదు. నందమూరి కుటుంబంపై ఉన్న అభిమానంతోనే నాకు ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌లతో అనుబంధం ఏర్పడింది. నేనేం చేసినా ఎన్టీఆర్‌ సలహాలు తీసుకుంటుంటా. ఆయన ‘118’ని చూసి చాలా బాగుందని మెచ్చుకున్నారు. ఆయనిచ్చిన ప్రోత్సాహంతోనే దిల్‌రాజు, శిరీష్‌లకి చూపించా’’.

*
‘‘నిర్మాతని అవుతానని ఎప్పుడూ అనుకోలేదు. పాత్రికేయుడిగా కెరీర్‌ని ప్రారంభించా. సినిమాలకి సమీక్షలు రాసేవాణ్ని. కానీ నా సినిమాలకు వచ్చిన సమీక్షలపై నేనెప్పుడూ బాధపడలేదు. ‘118’లో విరామ సన్నివేశాలు నేనిచ్చిన సలహాలతోనే తీశారు దర్శకుడు. అంతవరకే తప్ప దర్శకత్వం చేసే ఆలోచన లేదు. ప్రస్తుతం ఒక అగ్ర కథానాయకుడితో సినిమా నిర్మించే ప్రయత్నంలో ఉన్నా. దర్శకుడు హరీష్‌శంకర్‌, నేను కలిసి కొన్ని సినిమాలు నిర్మిస్తాం’’.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.