విభిన్న పాత్రలు చేయాలి.. రచయితగా మెప్పించాలి!!
‘‘ప్రతి చిత్రంలోనూ హాస్య నటుడిగానే కనిపించాలని నేను అనుకోవడం లేదు. అలా చేస్తే కొన్నాళ్లకు నా సినీకెరీర్‌ నాకే బోర్‌ అనిపిస్తుంది. అందుకే అన్ని రకాల పాత్రలు చేయాలనుకుంటున్నా’’ అన్నారు అభినవ్‌ గోమతం. ‘ఈ నగరానికి ఏమైంది’, ‘సీత’ వంటి చిత్రాలతో హాస్యనటుడిగా మంచి గుర్తింపు పొందారు. ఇప్పుడు ‘మీకు మాత్రమే చెప్తా’ చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించబోతున్నారు. తరుణ్‌ భాస్కర్‌ కథానాయకుడిగా నటిస్తోన్న చిత్రమిది. షమ్మీర్‌ సుల్తాన్‌ దర్శకత్వం వహించారు. విజయ్‌ దేవరకొండ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. నవంబర్‌ 1న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో సోమవారం విలేకర్లతో ముచ్చటించారు అభినవ్‌.


* ‘‘ఈ చిత్రానికి తొలుత ‘ఎవ్వరికీ చెప్పొద్దు’ అనే టైటిల్‌ పెట్టుకున్నాం. కానీ, అదే పేరుతో అప్పటికే ఓ చిత్రం విడుదలకు సిద్ధమైంది. దాంతో ఆ పేరునే మరొక రకంగా చెప్తే ఎలా ఉంటుంది? అనే ఆలోచన నుంచి ‘మీకు మాత్రమే చెప్తా’ అనే టైటిల్‌ వచ్చింది. ఈ డైలాగ్‌ని చిత్రంలో ఎక్కువగా నేనే చెప్తుంటా. షమ్మీర్, అర్జున్‌ ఈ కథను ఎంతో చక్కగా రాసుకున్నారు. ప్రస్తుతం మన జీవితాల్లో సెల్‌ఫోన్‌ ఎలాంటి గొడడవలు చేస్తుందో తెలిసిందే. ఈ కథ కూడా అలాంటి ఓ అంశం చుట్టూనే తిరుగుతుంటుంది. అలాగని ఇది సెల్‌ఫోన్‌పై ఓ డాక్యుమెంటరీలా ఉండదు. చాలా వినోదాత్మకంగా ఉంటుంది. నిజానికి ట్రైలర్‌లో చూపించిన విషయం తక్కువే. సినిమాలో చాలా ఆసక్తికర విషయాలున్నాయి. తరుణ్, నేను ఇందులో టీఆర్పీల కోసం ప్రోగ్రామ్స్‌ చేసే వీడియో జాకీల్లా కనిపిస్తాం. అలా మేమిద్దరం బెస్ట్‌ ఫ్రెండ్స్‌ అవుతాం. తరుణ్‌తో పాటే నా పాత్ర సినిమా మొత్తం ప్రయాణిస్తుంటుంది’’.

* ‘‘నిజానికి ఈ కథను షమ్మీర్‌ విజయ్‌తోనే చేయాలనుకున్నారు. తను చెన్నైలో అనేక సినిమా కష్టాలు అనుభవించి వచ్చారు. ‘అర్జున్‌ రెడ్డి’ విడుదలకు ముందే విజయ్‌కు ఈ కథ చెప్పారు. తనకీ ఈ కథ నచ్చినప్పటికీ కొన్ని కారణాల వల్ల సినిమా చేయలేకపోవచ్చు.. ఒకవేళ నేను నటించకపోయినా కచ్చితంగా ప్రొడ్యూస్‌ చేస్తానని షమ్మీర్‌కు మాటిచ్చారు విజయ్‌. ఆ మాట ప్రకారమే ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించారు. తరుణ్‌ కథానాయకుడనగానే నేను పెద్దగా సర్‌ప్రైజ్‌ ఏం అవలేదు. తన దర్శకత్వంలో ‘ఈ నగరానికి ఏమైంది’ చేశా. ఆ సినిమా చిత్రీకరణ సమయంలో తరుణ్‌ అందరినీ అనుకరిస్తూ.. సరదాగా ఆటపట్టిస్తుండేవారు. అప్పుడే తనలోని నటనా కళ మాకు తెలిసింది. తర్వాత ‘ఫలక్‌నుమా దాస్‌’లో చేశారు. నిజానికి ఆ పాత్రను చేయడానికి తను తొలుత ఇష్టపడలేదు. విశ్వక్‌ సేనే పట్టుబట్టి ఒప్పించాడు. ఈ కథ మాత్రం తరుణ్‌కు సరిగ్గా సరిపోయే కథే. మరో విషయం ఏంటంటే తరుణ్‌కు ప్రతినాయక ఛాయలున్న పాత్రల్లోనూ నటించాలనుందని ఓసారి చెప్పారు’’.

* ‘‘ఈ కథలో లాగా నేనెప్పుడూ సెల్‌ఫోన్‌తో పెద్దగా ఇబ్బందులు ఎదుర్కొన్నది లేదు. నిజానికి నా ఫోన్‌లో అంత పెద్ద రహస్యాలు కూడా ఏం ఉండవు. నిజ జీవితంలో ప్రేమలో ఓసారి ఓడిపోయా. తరుణ్‌తో ‘ఈ నగరానికి ఏమైంది’ చేశాక.. తేజ దర్శకత్వంలో ‘సీత’ చేశా. ఆ సినిమా చిత్రీకరణ కాస్త ఆలస్యమైంది. దీని వల్లే ‘మజిలీ’, ‘డియర్‌ కామ్రేడ్‌’ చిత్రాల్లో నటించే అవకాశం కోల్పోయా. నిజానికి ఈ చిత్రం కూడా మిస్‌ అవుతుందనుకున్నా. విజయ్‌ వాళ్ల నాన్న వర్థన్‌ సర్‌ నా కోసం సినిమాను ఆపి మరీ ఈ పాత్ర చేయించారు’’.

* ‘‘నేను పుట్టి పెరిగింది హైదరాబాద్‌లోనే. నాన్న వృత్తిరిత్యా ఎయిర్‌ ఫోర్స్‌లో చేయడంతో చిన్నతనంలో కొన్నాళ్లు గుజరాత్, బూర్జ్‌లలో ఉన్నాం. ఆయన పదవి విరమణ తర్వాత మళ్లీ ఇక్కడికి వచ్చేశాం. చిన్నప్పటి నుంచీ నాకు నటనపై ఆసక్తి లేదు. కళాశాల స్థాయికి వచ్చాకే సినిమాలపై ఆకర్షణ పెరిగింది. ఇంజినీరింగ్‌ మూడో సంవత్సరంలో ఉన్నప్పుడు సీనియర్‌ బలవంతం మీద ఓ మైమ్‌లో నటించా. దానికి రెండో బహుమతి వచ్చింది. అప్పుడే నాలోనూ ఓ నటుడు ఉన్నాడనిపించింది. తర్వాత కొన్నాళ్లు డెల్‌లో ఉద్యోగం చేసినా అలా ఒక్క దగ్గర కూర్చోని చేయడంలో కొత్తదనం లేదనిపించింది. దీంతో వినోదం కోసం సినిమాల వైపు అడుగుపెట్టా. దర్శకత్వంపై ఆసక్తి ఉంది కానీ, దాని కన్నా ముందు రచయితగా పేరు తెచ్చుకోవాలనుంటుంది. అన్ని రకాల పాత్రలూ చేయాలనుంది. ప్రస్తుతం జయంత్‌.సి.పరాన్జీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నా. ట్రైయాంగిల్‌ లవ్‌స్టోరీ. ముగ్గురు ప్రధాన పాత్రల్లో నాదీ ఒకటి. సుశాంత్‌ హీరోగా తెరకెక్కుతోన్న కొత్త చిత్రంలో ప్రతినాయక ఛాయలున్న పాత్రను, నితిన్‌ ‘రంగ్‌ దే’లో కీలక పాత్రలో నటిస్తున్నా. దీంతో పాటు ‘ఈ నగరానికి ఏమైంది’కి సీక్వెల్‌గా చేస్తున్న వెబ్‌సిరీస్‌లోనూ నటిస్తున్నా’’.


- మందలపర్తి రాజేశ్‌ శర్మ, ఈనాడు డిజిటల్‌


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.