ఆ ఇద్దరితో షూటింగ్‌ సరదాగా ఉంటుంది

‘సమ్మోహనం’ చిత్రంలో సమీరగా...‘అంతరిక్షం..’లో రియాగా తెలుగు ప్రేక్షకుల్ని అలరించిన అందం అదితీరావ్‌ హైదరి. బాలీవుడ్‌లో కెరీర్‌ ప్రారంభించిన ఈ హైదరాబాదీ అమ్మాయి పలు దక్షిణాది చిత్రాల్లోనూ సందడి చేస్తోంది. నాని, సుధీర్‌బాబు ప్రధాన పాత్రల్లో నటించిన ‘వి’లో నాయికగా నటించింది. ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ భామ నటించిన మలయాళ చిత్రం ‘సూఫియమ్‌ సుజాతయుమ్‌’ ఇటీవలే ఓటీటీ వేదిక ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా అదితి చెబుతున్న కబుర్లివీ..



 ‘‘నాకు థియేటర్లో సినిమా చూడటమే ఇష్టం. నా సినిమాలు థియేటర్లో విడుదలైతేనే ఆనందం. థియేటర్‌ అంటే ఓ మ్యాజిక్‌. అదే సమయంలో కొన్ని చిత్రాలకు ఓటీటీలు చక్కటి వేదికలు. నేను నటించిన ‘సూఫియమ్‌ సుజాతయుమ్‌’ థియేటర్‌ కోసమే సిద్ధం చేసిన సినిమా. ప్రస్తుతం ఏర్పడిన విపత్కర పరిస్థితుల కారణంగా ఓటీటీలో విడుదల చేయక తప్పలేదు. మొదట్లో ఓటీటీలో విడుదల అంటే నాకు నచ్చలేదు. కానీ మా చిత్రం ఇంతమందికి చేరువయ్యాకా నాకు విషయం అర్థమైంది’’


 ‘‘వి’ చిత్రం గురించి నేను ఇప్పుడే ఏమీ మాట్లాడను. ఈ చిత్రంలో నా పాత్ర గురించి కూడా ఏమీ చెప్పను. ఇదో థ్రిల్లర్‌ సినిమా కాబట్టి ఏది మాట్లాడినా ప్రేక్షకులకు ఆ థ్రిల్‌ పోతుంది.’’



 ‘‘నేను ‘ది గర్ల్‌ ఆన్‌ ది ట్రైన్‌’ చిత్రంలో పరిణితీ చోప్రా, కృతి కుల్హరితో కలిసి నటిస్తున్నాను. ఈ ఇద్దరితో కలిసి షూటింగ్‌లో పాల్గొనడం చాలా సరదాగా ఉండేది. దర్శకుడు రిబూదాస్‌ గుప్తా గత చిత్రాలు నేను చూశాను. ఈ చిత్రాన్ని అంతకంటే చక్కగా తీశారు.’’



 ‘‘దుల్కర్‌ సల్మాన్‌తో కలిసి ‘హే సినామికా’ అనే తమిళ చిత్రం చేస్తున్నాను. ఆ తర్వాత విజయ్‌ సేతుపతితో ‘తుగ్లక్‌ దర్బార్‌’లో నటించాల్సి ఉంది. ఈ సినిమా చిత్రీకరణ మొదలైనా నేను ఇంకా సెట్లోకి అడుగుపెట్టలేదు. వీటితో పాటు ఓ తెలుగు చిత్రం, ఓ హిందీ చిత్రమూ ఒప్పుకొన్నాను.




Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.