ఆ చిత్రాలకు ఫిల్మ్‌ఫేర్‌ రావాలని బలంగా కోరుకున్నా!

తనకు 70ఏళ్లు వచ్చినా అమితాబ్‌ బచ్చన్‌లా నటించాలని ఉందని అంటున్నారు 'స్టైలిష్‌ స్టార్‌' అల్లు అర్జున్‌. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన 'అల వైకుంఠపురములో..' చిత్రం విజయంతో జోరు మీదున్నారు బన్ని. ప్రస్తుతం సుకుమార్‌ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నారు. సింహాచలం అడవుల నేపథ్యంలో సాగే మాఫియా కథతో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు సమాచారం. కాగా, ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

ప్రతిసారీ ఒత్తిడిని పెంచుకుంటూ పనిచేయడం సరైనదేనంటారా?
అల్లు అర్జున్‌: కచ్చితంగా. నా ప్రతి సినిమా కోసం సర్వశక్తులు ఒడ్డుతా. ఇంతకుముందు చేసిన నటన కంటే ఉత్తమంగా చేయాలనుకుంటా. నేను ఎంతవరకూ చేయగలనో అంతవరకూ తప్పకుండా ప్రయత్నిస్తా. ఒత్తిడి తీసుకోవడం కూడా ఒక రకమైన సంతోషమే. రోజంతా కష్టపడి పనిచేస్తే, ఒక నటుడిగా ఆత్మ సంతృప్తి ఉంటుంది.

మీరు నటుడు అవుతానని ఎప్పుడైనా అనుకున్నారా?
అల్లు అర్జున్‌: మొదట్లో యానిమేటర్‌ కావాలని ఉండేది. కొద్దిరోజులకే దానిపై ఆసక్తి పోయింది. మనం సినిమా నేపథ్యం ఉన్న కుటుంబంలో ఉన్నప్పుడు ఆ ఇంటి వాతావరణ ప్రభావం తప్పకుండా మనపై పడుతుంది. ఎక్కడికి వెళ్లి, ఎటు తిరిగొచ్చినా, మళ్లీ సినిమాలకే వచ్చేస్తారు. నా పరిస్థితి కూడా అదే.

మీ కుటుంబం నుంచే మీకు పోటీ ఉంటుందని అనుకున్నారా?
అల్లు అర్జున్‌: ఎప్పుడూ ఉండదు. ఇక్కడ ఎవరి జర్నీ వాళ్లది. బయట నుంచి చూస్తే, పోటీ ఉన్నట్లు కనిపిస్తుంది. అందరం కలిసే రేసులో ఉంటాం. కానీ, ఎవరికి వాళ్లే తమ సామర్థ్యాన్ని పెంచుకుంటూ పరిగెత్తాలి.

హిందీలోనూ మీకు అభిమానులు భారీగానే ఉన్నారు. బాలీవుడ్‌లో నేరుగా సినిమా చేసే ఆలోచన ఏదైనా ఉందా?
అల్లు అర్జున్‌: హిందీ సినిమాల్లో నటించాలని నాకూ ఉంది. ప్రాంతాన్ని బట్టి సంప్రదాయాలు, సంస్కృతులు వేరుగా ఉన్నా, సినిమా అనేది యూనివర్సల్‌ లాంగ్వేజ్. సినిమాలో బలమైన కంటెంట్‌ ఉంటే తప్పకుండా ప్రతి గుండెను తాకుతుంది. సరైన దర్శక-నిర్మాతలు, మంచి స్క్రిప్ట్‌ ఉంటే తప్పకుండా చేస్తా. కొన్ని ఆఫర్లు వచ్చినా నా అంచనాలకు సరిపోయేలా లేవు. బహుశా అనేక విషయాలపై నేను కసరత్తులు చేయాలేమో.

* గత కొన్నేళ్లు తెలుగు సినిమా స్థాయి ఎలా పెరిగింది?

అల్లు అర్జున్‌:  ప్రతి చిత్ర పరిశ్రమలోనూ రెండు రకాల సినిమాలు వస్తుంటాయి. దశాబ్దకాలంగా చూసుకుంటే, తెలుగు సినిమా స్థాయి పెరిగింది. ఇందుకు సరైన ఉదాహరణ.. 'మహానటి'. ఇది ప్రత్యేక కమర్షియల్‌ సినిమా కాదు. కానీ, మూడు జాతీయ అవార్డులు వచ్చాయి. 'బాహుబలి' కమర్షియల్‌ చిత్రమైనా అద్భుతమైన కంటెంట్‌ ఉంది. తెలుగు సినిమా స్థాయిని పెంచిన చిత్రాలివి.

* మిమ్మల్ని చూసేందుకు వచ్చే మీ అభిమానులను అదుపు చేయడం సాధ్యం కాదు. దీన్ని మీరెలా భావిస్తారు?

అల్లు అర్జున్‌: గత పదిహేనేళ్లుగా ఇలాంటి అనుభవాలు ఎదురవుతూనే ఉన్నాయి. నటులుగా పగలూ రాత్రి కష్టపడతాం. అన్నీ వదులుకుని కష్టపడి నటిస్తున్నందుకు మాపై వారు చూపే అభిమానం ఎప్పటికీ మర్చిపోలేనది. మీరు దాన్ని పిచ్చి అనుకున్నా. దాన్ని మాపై వారు చూపిస్తున్న ప్రేమగానే భావిస్తాం.

* మీ అభిమానుల నుంచి ఇటీవల ఏదైనా క్రేజీ అనుభవం ఎదురైందా?

అల్లు అర్జున్‌: కేవలం నన్ను చూసేందుకే ఇటీవల మిడిల్‌ ఈస్ట్‌ నుంచి కొందరు అభిమానులు వచ్చారు. నా కోసం రెండు రోజులు వేచి చూశారు. మా వాళ్లు విషయం నాకు చెప్పడంతో ఆ అభిమానులను టీకి ఆహ్వానించా. వాళ్లు సేకరించిన నా ఫొటోలు, వీడియోలు చూపించారు. భాష అర్థం కాకపోయినా వాళ్లు నా సినిమాలు చూస్తారట. వాళ్లు ఈ విషయాలు చెబుతుంటే భలేగా అనిపించింది. ఆ అనుభూతిని ఎప్పటికీ మర్చిపోలేను.


* మీరంటే ఇష్టపడే మహిళా అభిమానులను ఎలా హ్యాండిల్‌ చేస్తారు?

అల్లు అర్జున్‌: ఈ విషయంలో నా భార్య(స్నేహారెడ్డి)చాలా స్క్రిక్ట్‌గా ఉంటుంది. నా మహిళా అభిమానులు నా వైవాహిక జీవితాన్ని ఇబ్బంది పెట్టరని అనుకుంటున్నా. నాకు పెళ్లై, ఇద్దరు పిల్లలున్నారని వాళ్లకు తెలుసు. 'మీ మహిళా అభిమానులను నన్ను కలవమనండి. మీరెలా ఉంటారో చెబుతాను' అని నా భార్య అంటుంది.

* ఇటీవల మీ పాప అర్హ వేసిన దోశ స్టెప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. మీడియాలో మీ పిల్లలు ఫేమస్‌ అవడం పట్ల మీరేమనుకుంటున్నారు?

అల్లు అర్జున్‌: ఒకవేళ వాళ్లు ఆ వీడియో షేర్‌ చేసినా, చేయకపోయినా నా పిల్లలు ఎప్పుడూ మీడియాలో ఉంటారు. ఎందుకంటే వాళ్లు ఉన్న పరిస్థితులు అలాంటివి. నా జీవితంలో ప్రతి విషయాన్ని వీడియో తీసి సోషల్‌మీడియాలో పంచుకోలేను. కొన్ని మాత్రమే అలా పంచుకుంటా.

* మీరు ఒక సినిమా ఒప్పుకొన్నప్పుడు మీ పిల్లలను కూడా దృష్టిలో పెట్టుకుని సంతకం పెడతారా?

అల్లు అర్జున్‌: కేవలం నా పిల్లలే కాదు, సమాజం పట్ల నాకు బాధ్యత ఉంది. నేను ఏం చేసినా, నా పిల్లలపైనే కాదు, యువతపైనా ప్రభావం చూపుతుంది. తెరపై నేను సరదాగా కనిపించినా, అది నిజ జీవితంలో అలా ప్రవర్తించను. ప్రతిరోజూ షూటింగ్‌ ఎలా జరిగిందో నా పిల్లలకు చెబుతా. నా సినిమాల గురించి వాళ్లకు వివరిస్తా.* సోషల్‌మీడియాలో మీరు బాగా ఫేమస్‌? దానిపై మీ అభిప్రాయం ఏంటి?

అల్లు అర్జున్‌: సామాజిక మాధ్యమాలను మనం ఎలా వినియోగించుకుంటున్నామనే దానిపై అది ఆధారపడి ఉంటుంది. మంచి విషయాలను పంచుకునేందుకు ఇంతకుమించిన మాధ్యమం మరొకటి లేదు. నేను చాలా పాజిటివ్‌గా ఆలోచిస్తా. వివాదాల జోలికి పోను. ఇన్‌స్టాగ్రామ్‌, పింట్రెస్ట్‌లలో ఎక్కువగా ఉంటా. టిక్‌టాక్‌ జోలికి పోను. నాకు ఫొటోలు అంటే ఇష్టం.


* ఇప్పటివరకూ మీరు ఐదు ఫిల్మ్‌ఫేర్‌లు గెలుచుకున్నారు. అవార్డుల పట్ల మీ అభిప్రాయం ఏంటి?

అల్లు అర్జున్‌:  'పరుగు' చిత్రానికి నాకు తొలి ఫిల్మ్‌ఫేర్‌ వచ్చింది. నేను ఆశ్చర్యపోయా. ఆ తర్వాత 'వేదం'. 'రేసుగుర్రం' చిత్రానికి ఫిల్మ్‌ఫేర్‌ రావాలని బలంగా కోరుకున్నా. అవార్డులు మంచిదే. అయితే, అవి సరైన వ్యక్తికి రావడం నాకు సంతోషాన్ని ఇస్తుంది. 'అర్జున్‌రెడ్డి'లో నటనకు గానూ విజయ్‌ దేవరకొండకు, 'జై లవకుశ'లో ఎన్టీఆర్‌కు అవార్డు రావడం ఆనందం కలిగించింది.


* రకుల్‌, పూజాహెగ్డేలతో పనిచేయడం ఎలా అనిపించింది?
అల్లు అర్జున్‌: ప్రతి ఒక్కరికీ వాళ్లకంటూ ప్రత్యేకమైన శక్తిసామర్థ్యాలు ఉంటాయి. పల్లెటూరి అమ్మాయిల పాత్రల్లో దక్షిణాది తారలు బాగుంటారు. అలాంటి పాత్రలే వారిని వరిస్తున్నాయి. బాలీవుడ్‌ నటీమణులు గ్లామర్‌ పాత్రల్లో అదరగొడుతున్నారు. ఎందుకంటే వాళ్లు పెరిగిన వాతావరణం అలాంటిది. అదే తెరపై కనపడుతుంది.

* మీ సోదరుడు అల్లు శిరీష్‌కు ఏమైనా సలహాలు ఇస్తుంటారా?
అల్లు అర్జున్‌: అవును ఇస్తుంటా. ఎలా మాట్లాడాలి? కొన్ని విషయాలను ఎలా వదిలేయాలి. ఏ పనైనా ఈజీగా ఎలా చేయాలి? చెబుతుంటా. అదే విధంగా తను కూడా నాకు కొన్ని సలహాలు ఇస్తాడు. ఒకరి ఆలోచనలు మరొకరం పంచుకుంటాం.

* మీ సినిమాల సక్సెస్‌ రేషియో చూసుకుంటే, బ్లాక్‌బస్టర్‌ రహస్యాన్ని మీరు తెలుసుకున్నట్లే అనిపిస్తోంది?
అల్లు అర్జున్‌: ఈ ప్రపంచంలో ఎవరికీ బ్లాక్‌బస్టర్ రహస్యం తెలియదు. మిమ్మల్ని మీరు నమ్ముకుని ధైర్యంగా వెళ్లడమే. కొన్నిసార్లు అది తప్పుకావచ్చు.. ఇంకొన్నిసార్లు సరైనది కావచ్చు. మన మనసు ఏది చెబితే దాన్ని ఫాలో అవడమే.

* నటుడిగా మీకు స్ఫూర్తి ఎవరు?
అల్లు అర్జున్‌: స్టార్‌డమ్‌ను సొంతం చేసుకోవడం చాలా కష్టం. ఇక్కడ ఎవరి ప్రయాణం వారిది. అమితాబ్‌ బచ్చన్‌గారు నాకు స్ఫూర్తి. నాకు 70 ఏళ్లు వస్తే ఆయనలా ఉండాలని కోరుకుంటున్నా. ఆ వయసులో యువ నటులతో పనిచేయడం సరదాగా అనిపిస్తుంది. ఒక నటుడిగా దొరికే అరుదైన గౌరవం అది.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.