ఏడాదికి రెండు సినిమాలు చేస్తా!

‘వినోద ప్రధానమైన మరిన్ని కథల్లో నిన్ను చూడాలని చాలామంది చెప్పేవాళ్లు. ‘ఏబీసీడీ’ రూపంలో అందుకు తగ్గ కథే కుదిరింది. ఇందులో వినోదంతో పాటు భావోద్వేగాలు, స్నేహం, కుటుంబ అనుబంధాలుంటాయి’’ అన్నారు అల్లు శిరీష్‌. విభిన్నమైన కథలతో ప్రయాణం చేస్తున్న యువ కథానాయకుల్లో ఆయన ఒకరు. థ్రిల్‌ని పంచిన ‘ఒక్క క్షణం’ తర్వాత ఆయన నటించిన చిత్రం ‘ఏబీసీడీ’. ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా అల్లు శిరీష్‌ బుధవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు. ఆ విషయాలివీ...

తొలిసారి మీరు రీమేక్‌ సినిమా చేశారు. ఆ అనుభవం ఎలా ఉంది?
రీమేక్‌ చేయడం సులభం కానే కాదు. దర్శకుడు సంజీవ్‌ చాలా కష్టపడ్డారు. మాతృకలోని పదిహేను సన్నివేశాలకి మించి మేం ఇందులో వాడుకోలేదు. ఆ కథలోని ఆత్మని మాత్రమే తీసుకొన్నాం.

ఈ సినిమా చేయడానికి ప్రేరేపించిన విషయాలేంటి?
కథలో నన్ను నేను చూసుకొన్నా. ఈ సినిమా చూస్తున్నంతసేపూ మా నాన్నకీ, నాకూ మధ్య జరిగిన కొన్ని సంఘటనలు గుర్తొచ్చాయి. రామ్‌చరణ్‌ ‘నువ్వు ఈ సినిమా చేస్తే బాగుంటుంది’ అన్నారు. ఇంతలో నిర్మాత మధుర శ్రీధర్‌, దర్శకుడు సంజీవ్‌ వేరొక కథతో సంప్రదించారు. ఆ సందర్భంలో ‘ఏబీసీడీ’ రీమేక్‌ విషయం చర్చకొచ్చింది. అందరికీ నచ్చడంతో ‘ఏబీసీడీ’ సెట్స్‌పైకి వెళ్లింది.

ఈ సినిమా వేడుకలో పాల్గొన్న నాని ‘పిల్ల జమిందార్‌’ సినిమాని గుర్తు చేసుకొన్నారు.. కథేంటి?
అమెరికాలో డబ్బుతో బాగా గారాబంగా పెరిగిన అబ్బాయి చేతిలో రూ.ఐదు వేలు పెట్టి ఇండియాకి పంపించాక ఏం జరిగింది? ఇక్కడికొచ్చాక అతను జీవితం, డబ్బు విలువనీ ఎలా తెలుసుకొన్నాడన్నదే ఈ చిత్ర కథాంశం.

మంచి నటనంటే ఏంటో తెలుసుకొన్నా
‘‘కథానాయకుడిగా ఈ ఆరేళ్ల ప్రయాణం చాలా విషయాలు నేర్పింది. సీనియర్‌ నటులతో కలిసి పనిచేశా. వాళ్లు ఒక పాత్రలో ఎలా జీవిస్తారో తెలుసుకొన్నా. డీసెంట్‌ యాక్టర్‌, గుడ్‌ యాక్టర్‌కీ మధ్య వ్యత్యాసం గురించి ఓసారి దర్శకుడు సుకుమార్‌ని అడిగా. చెప్పింది చెప్పినట్టు చేసేవాళ్లు డీసెంట్‌ యాక్టర్స్‌ అయితే, అదనంగా జోడించి నటించేవాళ్లు గుడ్‌ యాక్టర్స్‌ అని చెప్పారు. తర్వాత చాలా మార్చుకున్నా. అవార్డు వేడుకలకి హోస్ట్‌గా వ్యవహరించడంతో సమయస్ఫూర్తి అంటే ఏంటో తెలిసొచ్చింది. ‘ఏబీసీడీ’లో నాకూ, భరత్‌కీ మధ్య సన్నివేశాల్లో టైమింగ్‌ బాగుంటుంది’’.

నిజ జీవితంలో డబ్బు విలువ ఎప్పుడు తెలిసొచ్చింది?
ముంబయికి చదువు కోసం వెళ్లినప్పుడు తెలిసొచ్చింది. నాన్న నా ఖర్చుల కోసం ప్రతి నెలా కొంత మొత్తం పంపించేవాళ్లు. దాంతోనే సర్దుకోవాల్సి వచ్చేది. అమెరికాలో ఉన్నప్పుడు కూడా ఇంటి అద్దె డబ్బుని పొదుపు చేయొచ్చని తెలిసినవాళ్ల ఇంట్లో ఉండేవాణ్ని. నాన్నని ఒకసారి స్పోర్ట్స్‌ కారు అడిగాను. ‘నేనివ్వాల్సినంత ఇస్తా, మిగిలింది నువ్వు సంపాదించి కొనుక్కో’ అన్నారు. దాంతో నేను పంతానికి పోయి నేనే సొంతంగా కొనుక్కుంటా అని చెప్పా. అప్పుడు తెలిసింది డబ్బు సంపాదించడం ఎంత కష్టమో.

ఈ సినిమాకి కొందరు దర్శకులు సాయం చేశారని దర్శకుడు చెప్పారు. వాళ్ల భాగస్వామ్యం ఎంత?
నాకూ, దర్శకనిర్మాతలకి స్నేహితులైన పలువురు దర్శకులకి స్క్రిప్టుని వినిపించాం. వాళ్లు కొన్ని సూచనలు ఇచ్చారు. అవి మా సినిమాకి చాలా మేలు చేశాయి.

‘ఒక్క క్షణం’ తర్వాత మరో సినిమా చేయడానికి ఇంత సమయం ఎందుకు పట్టింది?
నావైపు నుంచి సమస్యేమీ లేదు. కానీ ఆలస్యమవుతోంది. వచ్చే ఏడాది కచ్చితంగా రెండు సినిమాలు చేస్తా. ‘ఒక్క క్షణం’ ఫలితం నన్ను ఆలోచించేలా చేసింది. ఆ తర్వాత నుంచి మంచి కథలపై దృష్టిపెట్టా. ప్రేమకథలంటే నాకు చాలా ఇష్టం. తదుపరి ఓ ప్రేమకథ చేయబోతున్నా. అందుకు సంబంధించి స్క్రిప్టు కూడా సిద్ధమైంది.

                             


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.