అలాంటి పాత్రల్లోనే కలిసి నటించాలేమో!!

‘దొరసాని’ చిత్రంతో కథానాయకుడిగా పరిచయం అయ్యాడు ఆనంద్‌ దేవరకొండ. తొలి చిత్రంతోనే గుర్తింపు తెచ్చుకున్నాడు.ఇప్పుడు ‘మిడిల్‌ క్లాస్‌ మెలొడీస్‌’తో అలరించేందుకు సిద్ధమయ్యారు. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా నవంబరు 20న ప్రేక్షకుల ముందుకు రాబోతుందా చిత్రం. ఈ సందర్భంగా ఆనంద్‌తో ముచ్చటించింది ‘సితార’. ఈ విశేషాలు మీ కోసం...* ‘మిడిల్‌ క్లాస్‌ మెలోడీస్‌’తో డిజిటల్‌ తెరపైకి ఎంట్రీ ఇవ్వడం ఎలా అనిపిస్తుంది?

- నిజానికి ఈ చిత్రాన్ని థియేటర్లే లక్ష్యంగా తెరకెక్కించాం. డిసెంబరు నాటికే చిత్రీకరణ పూర్తయింది. వేసవిలో థియేటర్లలోకి తీసుకొద్దాం అనుకున్నాం. కానీ, కరోనా పరిస్థితులతో అనూహ్యంగా మా ప్రయాణం ఓటీటీ వైపు మలుపు తీసుకుంది. అయితే అమెజాన్‌ ప్రైమ్‌ ద్వారా విడుదల కావడం వల్ల తెలుగు వాళ్లతో 190 దేశాల ప్రజలు చూడగలిగే అవకాశం దొరికినందుకు సంతోషంగా ఉంది.

* ఈ చిత్రంతో మీ ప్రయాణం ఎలా మొదలైంది?

- ‘దొరసాని’ షూటింగ్‌ టైంలోనే దర్శకుడు వినోద్‌ నాకీ కథ చెప్పారు. విన్న వెంటనే నాకూ తెగ నచ్చేసింది. స్క్రిప్ట్‌ చదివాక.. మధ్యతరగతి జీవితాలు కళ్ల ముందు కదిలినట్లుగా అనిపించింది. అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్‌ అయ్యేలా ఉంటుంది. దీంట్లో వినోదం కథలో భాగంగా ఉంటుంది కానీ, ఎక్కడా ఇరికించినట్లు ఉండదు.

* ఇంతకీ కథేంటి? మీ పాత్ర ఎలా ఉండబోతుంది?

- నేనిందులో రాఘవ అనే మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువకుడిగా కనిపిస్తా. గుంటూరులో టిఫిన్‌ సెంటర్‌ పెట్టి.. జీవితంలో స్థిరపడాలనే లక్ష్యంగా జీవిస్తుంటా. కానీ, దీనికి కావాల్సిన డబ్బుండదు. ఈ క్రమంలో నా లక్ష్యాన్ని సాధించడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశా? ఎదురైన సవాళ్లేంటి? ఆఖరికి నేననుకున్న లక్ష్యం సాధించానా? లేదా? అన్నది మిగతా కథ. మధ్యతరగతి జీవితాలకు అద్దం పట్టేలా ఉంటుంది. అందుకే సినిమాకు ‘మిడిల్‌ క్లాస్‌ మెలోడీస్‌’ అనే టైటిల్‌ ఖరారు చేశాం.

* రాఘవ పాత్ర కోసం ఎలాంటి కసరత్తు చేశారు?

- ఈ పాత్రకు పక్కింటి కుర్రాడిలా కనిపించే నటుడు కావాలి. నేనలాగే కనిపిస్తుంటా కాబట్టి పాత్ర కోసం పెద్ద కసరత్తు చేయలేదు. కానీ, గుంటూరు యాసలో మాట్లాడటం కోసం కష్టపడ్డా. ఇందుకోసం చిత్రీకరణకు కొద్దినెలల ముందు నుంచే శిక్షణ తీసుకున్నా. తర్వాత సెట్‌లో దర్శకుడు, నటీనటులతో మాట్లాడుతూ ఉండటం వల్ల గుంటూరు యాస ఈజీగా అలవాటైంది. ఈ చిత్ర దర్శకుడు, దీంట్లో చేసిన ముఖ్య తారగణమంతా గుంటూరు వాళ్లే.

* మీరూ మధ్యతరగతి కుటుంబం నుంచే వచ్చారు కదా. ఈ పాత్ర మీకెంత దగ్గరగా ఉంటుంది?

- ఈ పాత్ర నా నిజ జీవితానికి చాలా దగ్గరగా ఉంటుంది. చిన్నప్పుడు మేమూ మధ్యతరగతి కష్టాలు చాలా చూశాం. కథ వింటున్నప్పుడు అవన్నీ మళ్లీ గుర్తొచ్చాయి. అందుకే నాకు కథ మరింత ఎక్కువగా నచ్చింది. చిన్నతనంలో నేను ఒక మంచి ఉద్యోగం వస్తే చాలు అనుకున్నా. తర్వాత మంచి అపార్ట్‌మెంట్‌ తీసుకోవాలనుకున్నా. ఇవన్నీ చేశా. ఇప్పుడేమో.. మంచి నటుడు అనిపించుకోవాలి. మంచి సినిమాలు చేయాలి అని లక్ష్యాలతో జీవిస్తున్నా.

* ‘దొరసాని’ ఫలితం నిరుత్సాహ పరిచిందా?

- మనం ఆశించిన ఫలితం రానప్పుడు కచ్చితంగా నిరుత్సాహంగా ఉంటుంది. అలాగని అది తీసిపారేసే చిత్రమైతే కాదు. చాలా మందికి నచ్చింది. మ్యూజికల్‌గా హిట్టయింది. ఏదేమైనా ఆ చిత్రం చాలా కొత్త పాఠాలు నేర్పించింది.

* కథల ఎంపికలో మీ అన్నయ్య విజయ్‌ దేవరకొండ సలహాలు తీసుకుంటారా?

- నేనేదైనా కథ వింటే.. ‘ఫలానా దర్శకుడు కథ చెప్పాడు.. లైన్‌ ఇది’ అని ఒక ఫ్రెండ్‌కి చెప్పినట్లు విజయ్‌కి చెప్తా. అది అంతవరకే. తర్వాత తను ఏమన్నా చెప్పాలనుకుంటే సినిమా చూశాకే చెప్తాడు. ఇది ఇలా ఉంటే బాగుంటుందేమో.. నటన పరంగా నేనింకేం చెయ్యొచ్చు.. ఇలా చిన్న చిన్న విషయాలు చెప్తుంటాడు. తనకి ‘మిడిల్‌ క్లాస్‌ మెలోడీస్‌’ చాలా నచ్చింది.

* మీ అన్నదమ్ములిద్దరూ కలిసి సినిమా చెయ్యాలన్న ఆలోచనలు ఎప్పుడైనా చేశారా?

- మేమిద్దరం కలిసి చేస్తే బాగుంటుందని ఇంట్లో వాళ్లు, బయట చాలా మంది అనుకుంటారు. మేమైతే ఎప్పుడూ దాని గురించి మాట్లాడుకోలేదు. మంచి కథ దొరికితే భవిష్యత్తులో చెయ్యొచ్చేమో. కానీ, అదంత ఈజీగా అయిపోదు. ఒకవేళ మేం చెయ్యాల్సి వచ్చినా.. అన్నదమ్ముల్లాగే చెయ్యాల్సి వస్తుందేమో. ఎందుకంటే మా ఇద్దరి రూపు, మాటతీరు ఒకేలా ఉంటాయి.

* నటుడిగా ఎలాంటి పాత్రలు చెయ్యాలనుకుంటున్నారు?

- ఇలాంటి పాత్రలే చెయ్యాలి అని నన్ను నేను ఒక చట్రంలో బంధించుకోవాలి అనుకోవట్లేదు. విభిన్న పాత్రలు, వైవిధ్యభరితమైన కథలు చెయ్యాలని ఉంది. కేవలం హీరోయిజం మాత్రమే కాకుండా మంచి కథ కూడా ఉంటే బాగుంటుందనేది నా ఫీలింగ్‌. నా సినిమా నేను చూసుకున్నప్పుడు అందులో నేను కాకుండా నా పాత్రే కనిపించాలి. ప్రస్తుతం కొత్తవాళ్లతో పాటు అనుభవజ్జులైన దర్శకుల దగ్గర నుంచీ కథలు వింటున్నా.

* కొత్త సినిమా కబుర్లేంటి? వెబ్‌ సిరీస్‌లు చేసే ఆలోచన ఉందా?

- ప్రస్తుతం సృజన్‌ అనే కొత్త దర్శకుడితో ఓ సినిమా చేస్తున్నా. చిత్రీకరణ పూర్తయింది. త్వరలోనే నిర్మాణాంతర పనులు మొదలవుతాయి. ఇప్పుడప్పుడే వెబ్‌సిరీస్‌ల వైపు వెళ్లే ఆలోచన లేదు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.