‘ఇక చాలు బాబు’ అనేంత వరకు తీస్తా..!

‘‘సినిమా అనేది నాకు స్వర్గం. అదే నాకు కావాల్సినంత ఎనర్జీని అందిస్తుంటుంది. అందుకే ఎప్పుడూ చిత్రీకరణలతో ఆ స్వర్గంలోనే సందడిగా గడపాలని కోరుకుంటా’’ అన్నారు అనిల్‌ రావిపూడి. ‘పటాస్‌’ చిత్రంతో తొలి ప్రయత్నంలోనే వెండితెరపై నవ్వుల పటాస్‌లు పేల్చి.. ‘సుప్రీమ్‌’, ‘రాజా ది గ్రేట్‌’, ‘ఎఫ్‌ 2’ చిత్రాలతో సినీప్రియులకు వినోదాల విందును వడ్డించిన దర్శకుడాయన. ఇటీవలే ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు. సోమవారం ఆయన పుట్టినరోజు. ఈ నేపథ్యంలో ఆదివారం మీడియాతో ముచ్చటించారు అనిల్‌ రావిపూడి.* ఐదేళ్ల సినీ ప్రయాణంలో.. ఐదు విజయాలు. ఎలా అనిపిస్తుంది?

- నిజంగా ఇది అదృష్టం. ప్రతి చిత్రం విజయవంతమవ్వాలనే కష్టపడతాం. కొన్నిసార్లు ఫలితం అటు ఇటు అవ్వొచ్చు. కానీ, నేను వరుసగా ఐదు విజయాలు అందుకొన్నా. దీని వల్ల దర్శకుడిగా మంచి గుర్తింపు సాధించడమే కాక ఆర్థికంగా స్థిరపడ్డా. చాలా ఆనందంగా ఉంది.

* ‘సరిలేరు నీకెవ్వరు’ ఫలితం ఎలాంటి సంతృప్తినిచ్చింది?

- ప్రతి దర్శకుడికీ ఓ పెద్ద హీరోతో పని చెయ్యాలని లక్ష్యం ఉంటుంది. ఆ అవకాశం వెంటనే దొరికితే వచ్చే ఉత్సాహమే వేరు. నాకు ఆ కల ‘సరిలేరు’తో తీరింది. నేను 45నిమిషాలు కథ చెప్పగానే.. మహేష్‌ నన్ను నమ్మి సినిమా చేస్తా అన్నారు. ఆ మాట వినగానే కళ్లలో నీళ్లు తిరిగాయి. దీనికి తగ్గట్లుగానే సినిమా మంచి విజయాన్ని అందుకోవడం నా సంతోషం రెట్టింపయింది.

* ‘ఎఫ్‌ 3’ పనులు ఎంత వరకొచ్చాయి? సినిమా ఎలా ఉండబోతుంది?

- కరోనాకు వ్యాక్సిన్‌ వస్తుందో రాదో కానీ.. కచ్చితంగా ‘ఎఫ్‌ 3’తో ప్రేక్షకులకు నవ్వుల వ్యాక్సిన్‌ అందుతుందని గ్యారెంటీ ఇవ్వగలను. ఫన్‌ అండ్‌ ప్రస్టేషన్‌కు మరో ఎఫ్‌ యాడ్‌ అవుతుంది. గెట్‌ రెడీ ఫర్‌ మోర్‌ ఫన్‌ అని దానర్థం. ఇప్పటికే స్క్రిప్ట్‌ పనులు పూర్తయ్యాయి. దిల్‌రాజుగారు డిసెంబరు 14 నుంచి చిత్రీకరణ ప్రారంభించాలని ప్లాన్‌ చేసుకున్నారు.

* భవిష్యత్‌ లక్ష్యాలేంటి?

- చాలా ఆలోచనలున్నాయి. ప్రస్తుతం దర్శకుడిగా ఒక దాని తర్వాత మరొకటి సినిమాలు చూసుకుంటూ వెళ్తున్నా. ప్రేక్షకులు ఆదరించినంత కాలం ఇలాగే నా అనుకున్న వాళ్లతో కలిసి ముందుకెళ్లాలి అనుకుంటున్నా. ఇటీవలే నా మిత్రుడు సాయితో కలిసి ప్రొడక్షన్‌లోకి అడుగుపెట్టా. ఇకపై నిర్మాతగానూ వైవిధ్యభరిత సినిమాలు చేసుకుంటూ వెళ్లాలి అనుకుంటున్నా.

* పుట్టినరోజు జరుపుకోవడంపై మీ ఆలోచనలు ఎలా ఉంటాయి?

- పుట్టినరోజు అనేది ప్రతి మనిషికీ ఎంతో ముఖ్యమైన రోజు. ఈ భూమి మీదకి వచ్చి ఇన్ని సాధించగలుగుతున్నామంటే ఆరోజుకి కచ్చితంగా ప్రాముఖ్యత ఇవ్వాలి. ఈ జన్మనిచ్చిన తల్లిదండ్రులు గర్వపడే విజయాలు సాధించాలి.

* ఇంతకీ ఈ పుట్టినరోజు స్పెషల్‌ ఏంటి?

- నాకీ పుట్టినరోజు చాలా స్పెషల్‌. ఈ ఏడాది నాకు చాలా ఆనందాల్ని పంచింది. ‘సరిలేరు నీకెవ్వరు’తో విజయాన్ని అందుకున్నా. మా భార్య భార్గవి, పాప శ్రేయాశ్రీకి తోడుగా మా కుటుంబంలోకి అజయ్‌ సూర్యాంశ్‌ జాయిన్‌ అయ్యాడు. అందుకే ఈసారి పుత్రోత్సాహంతో పుట్టినరోజుని మరింత ప్రత్యేకంగా సెలబ్రేట్‌ చేసుకుంటాను.

నటుడిగా అప్పుడే

‘‘ప్రేక్షకులు దర్శకుడిగా ‘ఇక చాలు బాబు’ అనే వరకు సినిమాలు తీస్తూనే ఉంటా. ఆ తర్వాతే నటన గురించి ఆలోచిస్తా’’.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.