పూర్తి సంతృప్తి ఎప్పుడూ దొరకదు
‘జై’తో సంగీతదర్శకుడిగా పరిచయమయ్యారు అనూప్‌ రూబెన్స్‌. అక్కడి నుంచి చిన్న సినిమాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారారు. ‘మనం’, ‘టెంపర్‌’లాంటి విజయాలు తన ఖాతాలో ఉన్నాయి. కానీ... ప్రతిభకు సరిపడా అవకాశాలు రాలేదు. తేజ తెరకెక్కించిన ‘సీత’కు తనే స్వరాలు అందించారు. ఈనెల 24న విడుదలవుతున్న సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో అనూప్‌ మాట్లాడారు.

‘‘ప్రేమ, యాక్షన్‌, వినోదం, భావోద్వేగాలు మిళితమైన చిత్రం ‘సీత’. ఇలాంటి సినిమాని నేనైతే చూడలేదు. పేరు చూసి లేడీ ఓరియెంటెడ్‌ సినిమా అనుకుంటారేమో. కానీ ప్రతి పాత్ర బాగుంటుంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ మాస్‌ కథలే ఎక్కువ చేశారు. తనని కొత్త కోణంలో చూపించే సినిమా ఇది. ఐదు పాటలూ సందర్భోచితంగా వస్తాయి. ‘బుల్‌రెడ్డి’ పాట మాస్‌కి నచ్చింది. ‘నిజమేనా..?’ పాట మంచి మెలోడీ. ‘జై’తో నాకు తొలి అవకాశం ఇచ్చింది తేజగారే. ఆయనతో పనిచేయడం సులభంగానే అనిపిస్తుంది. కథ, సందర్భం అర్థమయ్యేలా వివరంగా చెబుతారు’’.

ప్రేక్షకులు కోరిందే ఇవ్వాలి...:
‘‘ఏ సంగీత దర్శకుడూ కావాలని మూస స్వరాల్నివ్వరు. నాకు తెలిసి ఈ పని చేయలేదు. సినిమాల ఒత్తిడిలో తెలిసీ తెలియక ఒకటీ అరా అలాంటి పాటలు దొర్లి ఉండొచ్చు. ఇకపై ఇలాంటి విమర్శలు రాకుండా ఉండేందుకు కృషి చేస్తున్నాను. ప్రేక్షకులు సహజత్వానికి పెద్దపీట వేస్తున్నారు. మామూలు మాటల్నే పాటల్లో పదాలుగా వినడానికి ఇష్టపడుతున్నారు’’.

ఆ గ్యాప్‌తో నేర్చుకున్నా... :
‘మనం’ తర్వాత అవకాశాలు బాగానే వచ్చినా ఎందుకో అవన్నీ ఆచరణలోకి రాలేదు. ఈ గ్యాప్‌ వల్ల నాకు నేర్చుకునేందుకు కావల్సినంత సమయం దొరికింది. స్టార్‌ హీరోల చిత్రాల్లో ఓ పాట హిట్టయితే ఆదరణ అదే స్థాయిలో ఉంటుంది. చిన్న సినిమాల్లో ఆ సౌలభ్యం ఉండదు. ఏ సినిమాలోని పాట విజయవంతమైనా పూర్తిస్థాయి సంతృప్తి ఎప్పుడూ దక్కదు. అది దక్కిందనుకుంటే ఇక అంతటితో సృజనశక్తి ఆగిపోతుంది. ప్రస్తుతం గణేష్‌ కథానాయకుడుగా ఓ కన్నడ చిత్రానికి స్వరాలిస్తున్నాను. తెలుగులో కార్తికేయ కథానాయకుడుగా రూపొందుతున్న ఓ చిత్రానికి స్వరాల్నిస్తున్నాను. ఇంకో రెండు తెలుగు చిత్రాల్ని ఒప్పుకున్నాను. అందులో ఒకటి అగ్ర కథానాయకుడి చిత్రం’’.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.