ప్రణయ్‌, అమృతల ప్రేమకథ స్ఫూర్తితో..

‘నటులకి ఏ మాధ్యమమైనా ఒక్కటే. ఎక్కడైనా కెమెరా ముందు నటించాల్సిందే’’ అన్నారు బాలాదిత్య. ఆయన కీలక పాత్రలో నటించిన చిత్రం ‘అన్నపూర్ణమ్మ గారి మనవడు’. అన్నపూర్ణమ్మ ప్రధాన పాత్రధారి. నర్రా శివనాగేశ్వరరావు దర్శకుడు. యం.ఎన్‌.చౌదరి నిర్మాత. త్వరలో ఈ చిత్రం వస్తోంది. సోమవారం హైదరాబాద్‌లో విలేకర్లతో మాట్లాడారు బాలాదిత్య.

‘‘తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్, అమృతల ప్రేమకథ స్ఫూర్తితో దర్శకుడు మా పాత్రల్ని తీర్చిదిద్దారు. నాకు జంటగా అర్చన నటించింది. ద్వితీయార్ధంలో నా పాత్ర కనిపిస్తుంది. నా పాత్ర నిడివి తక్కువైనా సినిమా మొత్తం నా చుట్టూనే తిరుగుతుంది. ఈ పాత్ర చేసే ముందు ప్రణయ్‌ గురించి తెలుసుకున్నా. అందులో కొన్ని కొత్త విషయాలున్నాయి’’.

* ‘‘నేను చేసిన ‘1940లో ఒక గ్రామం’ చిత్రానికి జాతీయ అవార్డు వచ్చింది. తర్వాత చదువుల కోసం ఐదేళ్లు సినిమాలకు విరామం ఇచ్చా. ఆ సమయంలో నేను పరిశ్రమను వదిలేసి విదేశాలకు వెళ్లిపోయానని మాట్లాడు కున్నారు. అమ్మకిచ్చిన మాట కోసమే మధ్యలో చదువులవైపు దృష్టి సారించా. మళ్లీ సినిమాల్లోకి వచ్చాక నాకు నచ్చిన పాత్రలు రాలేదు.. వచ్చినవి నచ్చలేదు. ఇన్నాళ్లకు ఈ చిత్రంతో ఓ మంచి పాత్ర దొరికింది. దీనికి ముందు ‘ఎంత మంచివాడవురా’లోనూ ఓ చక్కటి పాత్ర చేశా’’.

* ‘‘ఈటీవీలో వచ్చే ఛాంపియన్‌ కార్యక్రమంతోనే మళ్లీ ప్రేక్షకులకు చేరువయ్యా. చిరంజీవి, నాగార్జున లాంటి వారే బుల్లితెరపై కనిపిస్తున్నారు. నేను చేస్తే తప్పేముందని ఏ అవకాశమొచ్చినా చేస్తూ వెళ్లిపోతున్నా. తమిళంలో ‘రాసాతి’ అనే సీరియల్‌ చేస్తున్నా. తెలుగులో ‘గాడ్స్‌ ఆఫ్‌ ధర్మపురి’ అనే వెబ్‌సిరీస్‌ చేశా’’.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.