నా పేరు సుధాకర్‌ అని తెలియదు
‘‘నా పేరు సుధాకర్‌ అని చాలా మందికి తెలియదు. ‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌’ నుంచి... ఇప్పటివరకూ కూడా నన్ను చాలా మంది నాగరాజు అనే పిలుస్తుంటార’’న్నారు యువ కథానాయకుడు సుధాకర్‌ కోమాకుల. శేఖర్‌ కమ్ముల తెరకెక్కించిన ‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌’చిత్రంతో పరిచయమైన ఆయన, ‘కుందనపు బొమ్మ’, ‘ఉందిలే మంచి కాలం ముందు ముందునా’ చిత్రాల్లో నటించారు. ఆయన కథానాయకుడిగా, హరినాథ్‌ బాబు.బి దర్శకత్వంలో తెరకెక్కిన ‘నువ్వు తోపురా’ ఈ నెల 3న విడుదలవుతోంది. ఈ సందర్భంగా సుధాకర్‌ కోమాకుల బుధవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు. ఆ విషయాలివీ...


* ‘‘సరూర్‌ నగర్‌ సూర్య అనే కుర్రాడి కథ ఇది. సరూర్‌ నగర్‌లో అల్లరి చిల్లరగా తిరిగే బాధ్యత లేని ఓ కుర్రాడు అమెరికాకి వెళ్లాక జీవితం ఎలా మారిందనేదే ఈ కథ. తల్లి, కొడుకుల మధ్య అనుబంధం కీలకం. ఎవరైనా అసాధ్యమనుకొన్న పనుల్ని కూడా చేసి చూపించారంటే ‘నువ్వు తోపు...’ అంటుంటారు. ఈ సినిమాలో కథానాయకుడు తనకి ఎదురైన సమస్యల్ని పక్కా ప్రణాళికతో అధిగమిస్తాడు. సూర్య సరూర్‌ నగర్‌ కుర్రాడు కాబట్టి తెలంగాణ మాండలికంలో మాట్లాడుతుంటాడు’’.

* ‘‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌’ తర్వాత రెండు చిత్రాలు చేశాను. అనుకొన్నంత గుర్తింపు రాలేదు. ప్రేక్షకులకు మళ్లీ దగ్గరవ్వాలంటే నాగరాజు తరహా పాత్రని చేయాలనుకొన్నా. ఆ పాత్ర స్ఫూర్తితో దర్శకుడు, రచయితలు సూర్య పాత్రని తీర్చిదిద్దారు. అమెరికాలో ఎక్కువ భాగం చిత్రీకరించాం. మన సినిమాల్లో అమెరికా అంటే ఎత్తైన కట్టడాల్నే చూపిస్తుంటారు. ఈ సినిమాలో అవి కాకుండా, కొత్తగా ల్యాండ్‌ స్కేప్స్‌ చూపించాలనుకొన్నాం. చుట్టూ కొండలు, మధ్యలో సరస్సులు, అక్కడొక సిటీ ఉంటుంది. యూటా, సాల్ట్‌ లేక్‌ సిటీతో పాటు ప్రోవో అనే ప్రాంతాల్లో చిత్రీకరణ చేశాం. నిర్మాణ పరంగానూ కొన్ని పనుల్ని చూసుకొన్నా’’.

* ‘‘నేను పుట్టి పెరిగింది విశాఖపట్నంలో. హైదరాబాద్‌కి ఉద్యోగం కోసం వచ్చా. అప్పుడే తెలంగాణ మాండలికం పరిచయమైంది. అయితే ఆ తర్వాత మళ్లీ అమెరికా వెళ్లిపోయా. ‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌’కి ఎంపికయ్యాక దర్శకుడు శేఖర్‌ కమ్ముల ఈ సినిమాలో తెలంగాణ మాండలికం మాట్లాడాలన్నారు. అలా నాకు తెలంగాణ భాష అలవాటైంది’’.

* ‘‘పూర్తిగా నచ్చితే కానీ సినిమా ఒప్పుకోకూడదని నిర్ణయించుకున్నా. ‘నువ్వు తోపురా’ విడుదల తర్వాతే కొత్త సినిమా గురించి ఆలోచిస్తా. ఈ చిత్రం తర్వాత రహదారి భద్రతపై అవగాహన కార్యక్రమాలు చేస్తా. ఇటీవల జరిగిన ప్రమాదం నన్ను బాధపెట్టింది. మరణించిన మహిళ కుటుంబానికి రూ5 లక్షలు అందజేయబోతున్నాం’’.

సంబంధిత వ్యాసాలు
సంబంధిత ఫోటోలు


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.