కథ నచ్చితే చాలు.. డబ్బింగా.. రీమేకా.. పట్టించుకోరు
భీమినేని శ్రీనివాస రావు.. ఈ పేరు తెలుగు చిత్రసీమలో వినోదాత్మక కథలకు చిరునామా. అంతేకాదు రీమేక్‌ కథలను తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా తెరకెక్కించడంలోనూ ఆయనది అందె వేసిన చేయి. తాజాగా ఆయన ‘కౌసల్య కృష్ణమూర్తి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ‘కనా’ అనే తమిళ చిత్రానికి రీమేక్‌ ఇది. ఐశ్వర్య రాజేష్‌ ప్రధాన పాత్రలో నటించింది. రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ప్రస్తుతం ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో సోమవారం హైదరాబాద్‌లో విలేకర్లతో మాట్లాడారు భీమినేని. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..


* ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి వస్తోన్న ఆదరణ చూస్తుంటే ఎలా అనిపిస్తోంది?
చాలా సంతోషంగా ఉంది. ఓ మంచి కథ కోసం చకోరా పక్షిలా ఎదురు చూశా. ఆ సమయంలోనే ‘కనా’ దొరికింది. ఇప్పుడీ చిత్రానికి వస్తున్నన్ని ప్రశంసలు గతంలో నా ఏ సినిమాకూ రాలేదు. ప్రముఖుల అభినందనలతో నా ఫోన్‌ మూడు రోజులుగా నిర్విరామంగా మోగుతూనే ఉంది. సుబ్బిరామిరెడ్డిగారు సినిమా చూసి మా బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు. తొలి ఫ్రేం నుంచి చివరి సీన్‌ వరకు కథను చాలా గ్రిప్పింగ్‌గా తీశారని ప్రశంసించారు.

* ఐశ్వర్య రాజేశ్‌ నటన గురించి చెప్పండి..
సినిమా ఇంత బాగా వచ్చిందంటే కారణం ఐశ్వర్యే. ఈ సినిమా కోసం కొన్ని నెలల పాటు క్రికెట్‌లో శిక్షణ తీసుకొని మరీ నటించింది. అందుకే తన పాత్రలో అంతగా లీనమైన నటించగలిగింది.


* మాతృకలో శివ కార్తికేయ చేసిన పాత్రను మళ్లీ ఆయనతోనే చేయడానికి కారణం?
వాస్తవానికి ఈ చిత్ర మాతృక ‘కనా’ను నిర్మించింది ఆయనే. విపరీతమైన పోటీ ఉన్నా నిర్మాత కె.ఎస్‌.రామారావు గారిపై ఉన్న గౌరవంతో తెలుగు హక్కులు మాకిచ్చారు. ఆ సమయంలోనే ఆయన ఓ చిన్న కోరిక కోరారు. మాతృకలో నేను పోషించిన పాత్రను తెలుగులోనూ నేనే చేస్తానని అడిగారు. దీంతో ఆయనకిచ్చిన మాట ప్రకారం తిరిగి ఆ పాత్రను తనతోనే చేయించాం. ఇక ‘కణా’కు స్వరాలందించిన సంగీత దర్శకుడినే ఇక్కడా కొనసాగించడానికి కారణం.. ఆయన మ్యూజిక్‌లో ఉన్న కొత్తదనమే.


* ఎక్కువగా రీమేక్‌ కథలతోనే ప్రయాణం చేస్తున్నారు ఎందుకు?
ప్రేక్షకులకు తాము చూసేది రీమేక్‌ చిత్రమా? లేక డబ్బింగ్‌ చిత్రమా? అన్న పట్టింపులేదు. వాళ్లకు కథ నచ్చితే చాలు సినిమా ఎవరిదైనా ఆదరిస్తున్నారు. అందుకే నాకు ఎక్కడా మంచి కథలు దొరికినా ప్రేక్షకులకు చూపించాలని తపిస్తుంటా. నేనెప్పుడూ ఏ సినిమానైనా ఓ సాధారణ ప్రేక్షకుడిలాగే చూస్తా. అది నా మనసుకు నచ్చిందంటే వెంçనే తెరకెక్కిస్తుంటా. అయినా ఇప్పుడు తెలుగు పరిశ్రమలోనూ మార్పు వస్తోంది. ఇప్పుడు మనమే బయట చిత్రసీమలకు కథలు అందించే స్థాయికి ఎదిగాం. నిజంగా ఇది గర్వించ దగ్గ విషయం.

* ఈ సినిమాలో నటుడిగా చిన్న పాత్రలో మెరిశారు. అవకాశాలొస్తే బయట చిత్రాల్లోనూ చేస్తారా?
నాకు కాస్త విరామం దొరికి, మంచి పాత్రలు వస్తే కచ్చితంగా చేస్తా. చదువుకునే రోజుల్లో నాటకాలు రాసుకోని నేనే నటించే వాడిని. కానీ, ఇక్కడికి వచ్చిన కొత్తలో నటుడిగా ప్రయత్నించడానికి భయం వేసింది. అందుకే ముందు ఎవరి దగ్గరైనా సహాయ దర్శకుడిగా చేరి పని నేర్చుకుంటే చాలు అనుకున్నా. అలా చేస్తున్న రోజుల్లోనూ నటుడిగా అవకాశాలొచ్చాయి. కాకపోతే రెండు పడవలపై ప్రయాణం ఎందుకని చాలా ఛాన్స్‌లు వదులుకున్నా. ఈ మధ్యలో కొంత విరామం దొరకబట్టీ ‘కుదిరితే కప్పు కాఫీ’, ‘కెరటం’ చిత్రాల్లో నటించా.


* ‘సుడిగాడు 2’ తీసుకొచ్చే ఆలోచన ఉందా?
‘సిల్లీఫెలోస్‌’ చిత్ర సమయంలో నరేష్, నేను ఈ విషయమై మాట్లాడుకున్నాం. ఆయన కూడా ‘సుడిగాడు 2’ చేద్దాం అని అడిగారు. కానీ, దానికి చాలా పెద్ద మార్పు కావాలి. ఎందుకంటే ‘జబర్దస్త్‌’ వంటి కామెడీ షోలు వచ్చాక పేరడీలు బోర్‌ అనిపిస్తున్నాయి. అయితే ‘కొబ్బరిమట్ట’ చిత్రానికి వచ్చిన ఆదరణ చూశాక మళ్లీ ఆశలు చిగురించాయి. అన్నీ కుదిరితే సీక్వెల్‌ తప్పక చేస్తా. ప్రస్తుతానికైతే ఓ ప్రాజెక్టు విషయమై చర్చలు జరుగుతున్నాయి. ‘కౌసల్య..’ హడావుడి ముగిశాక దానికి సంబంధించిన వివరాలు తెలియజేస్తా.

 - మందలపర్తి రాజేశ్‌ శర్మ, ఈనాడు డిజిటల్‌


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.