తెలుగు నేర్చుకునే పనిలో ఉన్నా
సంగీత దర్శకుడిగా ప్రయాణం మొదలు పెట్టారు విజయ్‌ ఆంటోనీ. ఆ తర్వాత కథానాయకుడిగా మారారు. ‘సలీమ్‌’, ‘బిచ్చగాడు’ తదితర చిత్రాలతో విజయాల్ని అందుకొన్న ఆయనకి తెలుగులో మంచి మార్కెట్‌ ఏర్పడింది. అప్పట్నుంచి ఆయన తమిళంలో నటించే ప్రతి సినిమా తెలుగులో విడుదలవుతూ వస్తోంది. త్వరలోనే ఆయన ‘కిల్లర్‌’గా సందడి చేయబోతున్నారు. శుక్రవారం ఈ చిత్రం విడుదల కానున్న సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో విలేకర్లతో మాట్లాడారు విజయ్‌ ఆంటోనీ. ఆ విషయాలివీ...


*
‘‘తెలుగు ప్రేక్షకులకి నన్ను ‘బిచ్చగాడు’ బాగా దగ్గర చేసింది. దాంతో నా ప్రతి సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే అన్నీ ఆశించిన ఫలితాలివ్వలేదు. ‘కిల్లర్‌’ మాత్రం తప్పకుండా మెప్పిస్తుందనే నమ్మకం నాకుంది. ఇది పట్టు సడలని స్క్రీన్‌ప్లేతో సాగే ఓ సస్సెన్స్‌ థ్రిల్లర్‌. రొమాన్స్‌ కూడా ఉంటుంది. నా క్లాస్‌మేట్‌ ఆండ్రూ లూయిస్‌ చెప్పిన ఈ కథ నాకు బాగా నచ్చింది. మేం కలిసి చదువుకొనే రోజుల్లో తను దర్శకుడు అవుతాడని అస్సలు ఊహించలేదు. తను ఐదేళ్ల కిందట ఓ సినిమాని తెరకెక్కించాడు. ఆ తర్వాతే నాకు ఈ కథ చెప్పాడు. మంచి కథకుడు ఆండ్రూ’’.

*
‘‘ఒక యువకుడు కిల్లర్‌గా ఎందుకు మారాల్సి వచ్చింది? తను కుటుంబం కోసం ఏం చేశాడనే అంశాలు ఇందులో ఆసక్తికరం. భావోద్వేగాలతో కూడిన చిత్రమిది. కుటుంబమంతా కలిసి చూసేలా ఆండ్రూ చిత్రాన్ని తెరకెక్కించాడు. సైమన్‌ కె. సింగ్‌ సంగీతం, మాక్స్‌ ఛాయాగ్రహణం ప్రధానాకర్షణ. పోలీసు అధికారి పాత్రలో అర్జున్‌ నటన ప్రత్యేకంగా ఉంటుంది. ఆయనతో కలిసి చేయడం ఓ వరం. మా ఇద్దరి మధ్య సాగే యాక్షన్‌ సన్నివేశాలు కొత్తగా అనిపిస్తాయి’’.

* ‘‘బయటి నిర్మాతలకి కూడా సినిమాలు చేయాలనే ఉద్దేశంతోనే, నేను సొంతంగా సినిమాలు నిర్మించడం లేదు. సంగీతంతో పాటు... స్క్రీన్‌ప్లే, ఎడిటింగ్‌లపై పరిజ్ఞానం ఉంది. అయినా సరే... నటుడిగానే నా పని చేసుకుంటున్నా. ప్రస్తుతం సెంథిల్‌ దర్శకత్వంలో ‘ఖాకి’ అనే ద్విభాషా చిత్రం చేస్తున్నాను. అరుణ్‌ విజయ్‌తో కలిసి ‘జ్వాల’ అనే ద్విభాషా చిత్రంలో కథానాయకుడుగా నటిస్తున్నాను. అలాగే ఆనంద్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాను. ఇవి కాకుండా మరో పది సినిమాలు నటించడానికి ఒప్పుకొన్నా. తెలుగులో నేరుగా సినిమా చేస్తా. కానీ అది చేయాలంటే ముందు తెలుగు నేర్చుకోవాలి. దానిపైనే దృష్టిపెట్టా’’.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.