‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’లో నా పాత్ర అలా..
‘‘తమిళ్‌లో చేస్తే తమిళ స్క్రిప్ట్‌ ఇస్తారు. ఇక్కడ నటిస్తే తెలుగు స్క్రిప్ట్‌ ఇస్తారు. ఇలా భాషల్లో మార్పు కనిపిస్తుందేమో కానీ, సినిమా అన్నది ఎక్కడైనా ఒకటే’’ అంటోంది నటి కేథరీన్‌ థెరిసా. ‘ఇద్దరమ్మాయిలతో’, ‘సరైనోడు’, ‘నేనే రాజు నేనే మంతి’ వంటి హిట్‌ చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది కేథరీన్‌. ఇప్పుడు ‘వదలడు’ అనే చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతుంది. సిద్ధార్థ్‌ కథానాయకుడిగా నటించారు. యువ దర్శకుడు సాయి శేఖర్‌ తెరకెక్కించారు. ఈ చిత్రం అక్టోబరు 11న తెలుగు, తమిళ భాషల్లో విడుదలవుతోన్న నేపథ్యంలో.. శనివారం విలేకర్లతో చిత్ర విశేషాలు పంచుకుంది కేథరీన్‌.


*
‘‘ఈ చిత్రంలో నేను జ్యోతి అనే టీచర్‌గా కనిపించబోతున్నా. పాత్రలో ఓ కొత్తదనం ఉంది. తనకి చిన్నప్పటి నుంచి వాసనలను గుర్తించలేదు. అది ఆమె లోపం. ఇదే పాయింటే నన్నీ పాత్రను చేసేలా చేసింది. ఇక కథ విషయానికొస్తే.. ఈ చిత్రంతో ఓ సామాజిక సందేశాన్ని ఇవ్వబోతున్నాం. ప్రస్తుతం దేశంలో ఎక్కడా చూసినా ఆహార కల్తి ఎక్కువైపోయింది. ఫలితంగా ఎంతో మంది క్యాన్సర్‌ వంటి ప్రమాదకర వ్యాధులతో మృత్యువాత పడుతున్నారు. డబ్బుకి కక్కుర్తి పడి కొందరు చేసే ఇలాంటి పిచ్చి పనుల వల్ల ఎందరో పిల్లలు తమ జీవితాలను నష్టపోతున్నారు. ఇక్కడ క్యాన్సర్‌ అనేది ఓ వ్యాధి కాదు.. ఓ వ్యాపారం అన్నట్లుగా మారిపోయింది. అందుకే విదేశాల్లో ఉన్నట్లుగా ఇక్కడ ఫుడ్‌ సేఫ్టీ విధానాల్లో మార్పులు తీసుకురావాలని చెప్పబోతున్నాం. దీంతో పాటు కొన్ని థ్రిల్లింగ్, యాక్షన్‌ అంశాలు కూడా ప్రేక్షకులకు అందించబోతున్నాం. చిన్నపిల్లలతో కలిసి హాయిగా చూడగలిగేలా ఉంటుంది. ఈ చిత్రంలో సిద్ధార్థ్‌ ఫుడ్‌ సేఫ్టీ ఆఫీసర్‌గా కనిపిస్తారు. కథంతా మా ఇద్దరి చుట్టూనే తిరుగుతుంటుంది’’.

*
‘‘దర్శకుడు సాయి శేఖర్‌ కొత్తవాడైనా ఎంతో బాగా చిత్రాన్ని తెరకెక్కించాడు. అతను గతంలో తమిళ్‌లో అనేక హిట్‌ చిత్రాలకు సహాయ రచయితగా పనిచేశాడు. అన్ని విభాగాలపై మంచి పట్టుంది అతనికి. సిద్ధార్థ్‌తో తెర పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. తను సమాజాంలో కనిపించే ప్రతి సమస్యమైనా సామాజిక మాధ్యమాల ద్వారా స్పందిస్తుంటారు. ఇతరులకు సహయం చేయాలి, సమాజంలో మార్పు తీసుకురావాలని నిరంతరం తపించిపోయే వ్యక్తి. ఆయన లక్షణాలు చూశాక నేను అలా ఉండటానికి ప్రయత్నిస్తున్నా. నటుడిగానూ సిద్ధార్థ్‌కు మంచి అనుభవం ఉంది సెట్స్‌లో కలివిడిగా ఉంటారు. నటనలో తన సలహాలు, సూచనలు ఇస్తుంటారు. ఈ సినిమాకు తమన్‌ అద్భుతమైన నేపథ్య సంగీతాన్నిచ్చారు. చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. సినిమాలోని రెండు పాటలూ ఆకట్టుకునేలా ఉంటాయి.

*
‘‘ప్రతిఒక్కరూ ఎక్కువగా రెండో కథానాయిక పాత్రలే చేస్తున్నారెందుకు అని అడుగుతుంటారు. నిజానికి నేను నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలే ఎంచుకుంటున్నా. ‘సరైనోడు’ చిత్రాన్నే తీసుకోండి.. అందులో నా ఎమ్మెల్యే పాత్రకు ఎంత పేరొచ్చింది. చాలా గొప్ప పాత్ర అది. నా దృష్టిలో సెకండ్‌ హీరోయిన్‌ అన్నది ఓ అంకె మాత్రమే. దాన్ని నేనెప్పుడూ పట్టించుకోలేదు. కొత్తదనం నిండిన కథలు దొరికితే ఎలాంటి పాత్రలో నటించడానికైనా నేను సిద్ధమే. తెలుగులో నాకు అలాంటి కథలు దొరకకపోవడం వల్లే ఇక్కడ ఎక్కువ చేయలేకపోతున్నా. ఎప్పుడూ ఒకే తరహా పాత్రలు చేయడమంటే నాకు అసలు నచ్చదు. పాత్రలో వైవిధ్యం ఉంటే ఏ భాషలో చేయడానికైనా వెనుకాడను. తమిళ్‌ ప్రేక్షకులు హీరోయిన్‌ది గ్లామర్‌ పాత్రా? కాదా? అన్నది అంతగా పట్టించుకోరు. అందుకే అక్కడ కథల్లో వైవిధ్యభరిత పాత్రలు వస్తుంటాయి. ప్రస్తుతం నేను తెలుగులో విజయ్‌ దేవరకొండతో ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’లో నటిస్తున్నా. క్రాంతి కుమార్‌ నాకు చాలా గొప్ప పాత్ర ఇచ్చారు. ఇప్పటికే నా పాత్ర చిత్రీకరణ దాదాపు పూర్తయింది. మరో రెండు, మూడు రోజుల షెడ్యూల్‌ మిగిలి ఉంది. ఇటీవల తెలుగు చిత్రాలు పెద్దగా చూడాలే. అర్జెంట్‌గా మాత్రం ‘సైరా’ చూడాలనుకుంటున్నా’’.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.