ఆ విషయంలో నాకు అవగాహన లేదు..
‘‘సినిమాలో ఎంత మంది నాయికలున్నారనేది పట్టించుకోను. నా పాత్రకి ఎలాంటి ప్రాధాన్యం ఉందనేదే చూస్తాను’’ అంటోంది కేథరిన్‌. అందం, అభినయంతో ఆకట్టుకుంటున్న నాయిక ఈమె. విజయ్‌ దేవరకొండతో కలిసి ఆమె నటించిన ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ 14న విడుదలవుతోంది. ఈ సందర్భంగా కేథరిన్‌ శుక్రవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించింది.

‘‘బొగ్గు గనుల్లో పనిచేసే ఆధునిక పోకడలున్న అమ్మాయి పాత్రని పోషించా. నా నిజ జీవితానికి దగ్గరగా ఉంటుంది. దర్శకుడు క్రాంతి మాధవ్‌ ఈ కథ, పాత్రల గురించి చెప్పగానే వాటితో కనెక్ట్‌ అయిపోయా. ఎంతో పరిణతితో ఆలోచించే అమ్మాయి పాత్ర నాది. నాకంటూ కొన్ని బలమైన అభిప్రాయాలుంటాయి. అలాంటి అమ్మాయికీ, కథానాయకుడికీ సంబంధమేంటో తెరపైనే చూడాలి’’.

‘‘ప్రేమ, పెళ్లి, బంధాల నేపథ్యంలో సాగే చిత్రమిది. ఇందులో నలుగురు నాయికలున్నా... నలుగురికీ నాలుగు కథలు ఉంటాయి. ఇతర కథానాయికలకీ, నాకూ మధ్య ఎలాంటి సన్నివేశాలు లేవు. క్రాంతి మాధవ్‌ శైలిలో సాగే చిత్రమిది. విజయ్‌ పాత్రలో భిన్నమైన కోణాలుంటాయి. ఆయనతో కలిసి నటించడం మంచిఅనుభవం. నిడివితో సంబంధం లేకుండా పాత్రకి పేరొస్తుందని నమ్ముతున్నా. పాత్ర విషయంలో నాకెలాంటి అసంతృప్తి లేదు’’.

‘‘ప్రేమపై పూర్తి నమ్మకం ఉంది. ప్రేమ లేని జీవితమే ఉండదు. అయితే ప్రేమ, ఇద్దరి మధ్య బంధం విషయంలో నాకు లోతుగా అవగాహన లేదు. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రేమ ప్రయాణం మరింత దోహదం చేస్తుందని మాత్రం నమ్ముతుంటా’’.

Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.