నువ్వు రచయితవా? అని అవమానించారు..
‘మౌనంగానే ఎదగమని...’ ఆ పాటసారి జీవితం చెబుతుంది.

‘ఎంత సక్కగున్నావే లచ్చిమి..’ అని ఆయన పెళ్లిపుస్తకం తెరిస్తే ఆ లచ్చిమి ఎవరో తెలుస్తుంది.

‘ఎవరేమీ అనుకున్నా... నువ్వుండే రాజ్యానా’ అంటే ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని నిలిచిన ఆయన ప్రతిభపాటవం కనిపిస్తుంది. ఇంతకీ ఎవరాయన అంటారా?

కనుకుంట్ల సుభాష్‌ చంద్రబోస్‌... అర్థం కాలేదు కదా! అదేనండి పాటాచార్యుడు చంద్రబోస్‌.

అత్యంత సామాన్య గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చి... ఈ స్థాయికి ఎదిగిన ఆయన ‘హాయ్‌’తో ఎన్నో విషయాలు పంచుకున్నారు. బాల్యం, కాలేజీ చదువు, తాజ్‌మహల్‌ నుంచి సైరా దాకా పాటయానం... ఇలా ఎన్నో జ్ఞాపకాలు నెమరువేసుకున్నారు.

చిరంజీవి ఐస్‌క్రీమ్‌ ఇప్పించారు

సుచిత్రతో నా పెళ్లి రహస్యంగా జరిగింది. తర్వాత పెద్దల ఆశీర్వాదం కోసం రాఘవేంద్రరావుగారి దగ్గరికి వెళ్లాం. ఆయనకు మా ప్రేమ గురించి ముందే చూచాయగా తెలుసు. ఆయన మమ్మల్ని ఆశీర్వదించారు. అక్కడే చిరంజీవిగారు ఉండటంతో కలిశాం. ఆయన మమ్మల్ని చూసి ఎంతో సంతోషించారు. ఆయన దగ్గర అప్పుడు రెక్కల్లా తలుపులు తెరచుకొనే కారు ఉండేది. అందులో మమ్మల్ని ఎక్కించుకొని.. తనే డ్రైవ్‌ చేసుకుంటూ మమ్మల్ని ఐస్‌క్రీమ్‌ పార్లర్‌కి తీసుకువెళ్లాడు. ఐస్‌క్రీమ్‌ ఇప్పించి... మీ జీవితం ఇలా చల్లగా, తీయగా సాగిపోవాలని చెప్పారు. మరిచిపోలేని అనుభూతి అది.


తన వల్లే దుర్వ్యసనాలు వదిలేశా

సుచిత్ర నాకు లభించిన వరం. ఎప్పుడూ నాకోసం తపిస్తుంది. ప్రోత్సహిస్తుంది. నాకు రెండు దుర్వ్యసనాలు ఉండేవి. అవి లేకుంటే పాటలు రాయలేను అనుకునేవాణ్ని. ‘మీరు పాటలు రాయకపోయినా ఫర్వాలేదు... అడుక్కొని అయినా తిందాం... ఆ అలవాట్లు మానుకోండి’ అని చెప్పింది. ఇలా చాలాసార్లు ప్రయత్నం చేయగా... ఒక అలవాటు మానుకున్నా. అయినా నలుగురికి మంచి చెప్పే మనం ఇలా ఉంటే ఎలా? అని నన్ను నేను ప్రశ్నించుకొని రెండో అలవాటు మానుకున్నా. అవి లేకపోతే పాట రాయలేను అనుకున్న వాడ్ని. ఇప్పుడు అప్పుటికంటే వేగంగా రాయగలుగుతున్నా. ఇదంతా సుచిత్ర మరీమరీ ప్రయత్నించడంతోనే జరిగిందని నమ్ముతా.

తెలంగాణ రసం బాగా చేస్తుంది
సుచిత్ర వంటలు బాగా చేస్తుంది. తను తినకపోయినా నాకోసం నాన్‌వెజ్‌ వండుతుంది. మా అమ్మవాళ్ల దగ్గర తెలంగాణ రసం ఎలా చేయాలో తెలుసుకొని చేస్తుంటుంది. దాని రుచి గురించి ఎంత చెప్పినా తక్కువే.

* రోజూ మెడిటేషన్‌ చేస్తా. వాకింగ్‌కు వెళతా.. అవే నా ఆరోగ్య రహస్యాలు. తను నా కుటుంబ సభ్యులను తన కుటుంబ సభ్యులకంటే ఎక్కువగా ప్రేమిస్తుంది. నేను వాళ్ల కుటుంబ సభ్యులను నా వాళ్లుగానే గౌరవిస్తా.

పిల్లలతో గడిపితే ఒత్తిడి మాయం
నాకు ఒత్తిడి అనిపించినప్పుడు కుటుంబంతో గడుపుతాను. మా అబ్బాయి నంద వనమాలి మెకట్రానిక్స్‌ చదువుతున్నాడు. మా అమ్మాయి అమృత త్రోబాల్‌ జాతీయ క్రీడాకారిణి. సంగీతంలోనూ శిక్షణ తీసుకుంటోంది. కవితలు, గేయాలు రాసి చూపిస్తుంటుంది. వాళ్లతో కొద్దిసేపు మాట్లాడి... వాళ్లు చెప్పే విషయాలు వింటూ సరదాగా గడిపితే నా ఒత్తిడి మొత్తం మాయం అవుతుంది. పిల్లలు మొదట మమ్మీ, డాడీ అని పిలిచేవారు. ఒక వెయ్యి సార్లైనా... వాళ్లకు చెప్పి ‘అమ్మా, నాన్న’ అనేలా అలవాటు చేశా. ఎండాకాలం సెలవుల్లో వేమన పద్యాలు వారితో కంఠస్థం చేయించేవాణ్ని. మా డైనింగ్‌ టేబుల్‌ దగ్గర పాటల గురించి చర్చ నడుస్తుంటుంది. నేను రాసే ఎత్తుగడలు... ఎలా ఉన్నాయో చెబితే... వాటిపై అభిప్రాయాలు చెబుతారు.


దేశమే నువ్వురా.. సందేశమయ్యెరా!
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం మొత్తం వివరించి... ‘సైరా’ సినిమా కోసం ఓ మంచి పాట రాయాలని దర్శకుడు సురేందర్‌రెడ్డి చెప్పారు. ఆయన జీవితంతో పాటు... దేశభక్తి ప్రతిధ్వనించాలన్నారు. ‘దేశమే నువ్వురా.. సందేశమయ్యెరా...’ అంటూ సాగే పాట ఇది. సినిమా చివరలో స్వాతంత్య్ర సమరయోధుల చిత్రాలు చూపుతూ ఈ పాట వస్తుంది. ‘సినిమాలో మిగతా పాటలు కూర్చుని చూస్తే... ఈ పాటను ప్రేక్షకులు నిల్చొని చూసి... చప్పట్లు కొడుతున్నారు’ అని ఓ మిత్రుడు చెప్పారు. ఇంతకంటే పాట రచయితగా నాకు కావాల్సిందేముంటుంది.

* బాల సాహిత్యం చదివించాలి
ప్రతి ఇంట్లో పిల్లలతో బాల సాహిత్యం చదివించాలి. దీనివల్ల మూడు ప్రయోజనాలు ఉంటాయి. ఒకటి శబ్ద సౌందర్యం, వాక్య నిర్మాణాలు తెలుస్తాయి. మన మాతృభాషపై పట్టు వస్తుంది. రెండోది పిల్లల్లో కల్పనా చాతుర్యం, ఊహ శక్తి పెరుగుతుంది. ఇక ముఖ్యంగా మూడోది... ప్రతి కథ, రచనలోనూ మంచి ఉంటుంది. చెడు చివరికి ఓడిపోతుందని... మంచి గెలుస్తుందని చెబుతాయి. దుర్మార్గుడు దెబ్బతింటాడని, మంచి వాళ్లు అందరి మన్ననలు పొందుతారని వివరిస్తాయి. ఇవన్నీ పిల్లల మనస్సులో నాటుకుపోయి... మెరుగైన సమాజానికి వాళ్లు వెలుగు దివ్వెలవుతారు. మనం విల్లులా వంగి... వారిని బాణంలా లక్ష్యం వైపు వదలాలి.

* పత్రిక నడిపా
వరంగల్‌ జిల్లాలో చల్లగరిగ మా ఊరు. నాన్న నరసయ్య ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు. అమ్మ మదనమ్మ గృహిణి. మా ఇంటి పక్కనే గ్రంథాలయం ఉండేది. అక్కడికెళ్లి పత్రికలు, పుస్తకాలు చదివేవాణ్ని. అందరిలా ఎప్పుడూ చదవడమేనా? అని ప్రశ్నించుకొని ఒక పత్రిక పెట్టాను. దాని పేరు ‘వార్త వాహిని’. అది చేతిరాత పత్రిక. సంచిక, సంపుటి, సంపాదకుడి మాట... ఇలా అందులో అన్ని అంశాలు ఉండేవి. రోజూ ఊర్లో జరిగే సంఘటనలు అందులో రాసి లైబ్రరీలో పెట్టేవాణ్ని. ఊర్లో సర్పంచి, కరణం, పటేల్‌ ఇలా.. అందరూ గ్రంథాలయానికి వచ్చి ముందు నా పత్రిక చదవడం మొదలుపెట్టారు. చాలా సంతోషపడ్డా. ఒకసారి ఒక తప్పు వార్త రాశా. దీంతో సంబంధీకులకు ఆగ్రహం వచ్చింది. ఈ విషయం ఇంట్లో తెలిసి... నాన్న కొట్టారు. ‘అనివార్య కారణాలతో పత్రిక ఆపేస్తున్నా.. క్షమించండి’ అని రాసి చివరి పత్రిక ఇచ్చాను. తర్వాత కొంత కాలానికి ‘నవత’ అని మరో పత్రిక పెట్టాను. దాన్నీ కొంత కాలం నడిపాను. పేపర్లు కొనడానికి ఆర్థిక పరిస్థితి సహకరించక...(నవ్వుతూ) దాన్ని ఆపేశాను.

*నేల మీద ఉండటం అమ్మే నేర్పింది
నాన్నకు అంతంతమాత్రమే జీతం. అందులోనూ ఆయనకు ఆరోగ్యం బాగాలేక... సగం రోజులే స్కూల్‌కు వెళ్లేవారు. దీంతో తక్కువ జీతం వచ్చేది. మేం నలుగురం పిల్లలం. మాకు సెంటు భూమి లేదు. అమ్మ పొలం పనులకు వెళ్లి.. అంతోఇంతో సంపాదించి మమ్మల్ని పోషించేది. మంచి బట్టలు కూడా ఉండేవి కావు. వరన్నం తినాలని చాలా ఆశపడేవాణ్ని. అమ్మ బియ్యం వండితే అందరికీ సరిపోదని... గట్క(మొక్కజొన్న నూకతో చేసేది) వండిపెట్టేది. అనారోగ్యం దృష్ట్యా నాన్నకు మాత్రం కొంత వరన్నం వండేది. నాన్న తినగా మిగిలే కొంచెం మెతుకుల బువ్వ కోసం పిల్లలం రోజూ వంతులు వేసుకొని తినేవాళ్లం. కుటుంబం సవ్యంగా నడవడానికి అమ్మ పడే కష్టం చూసి ఎన్నో విషయాలు నేర్చుకున్నా. తక్కువ డబ్బుతో బతకడం ఎలా? ఉన్న పరిస్థితులను తట్టుకొని, ఎవరితోనూ మాట పడకుండా జీవించడం ఎలాగో తెలుసుకున్నా.

* తమిళంలో నేను రాయగలిగేది ‘ఇళయరాజా’ అనే..
మా ఊరి గుడిలో వినిపించే పోతన భాగవత పద్యాలు నన్ను బాగా ప్రభావితం చేశాయి. అన్నమాచార్య గీతాలు, బడిలో మా మాస్టర్‌ లక్ష్మీనారాయణ రాగయుక్తంగా ఆలపించే పద్యాలు నన్ను సాహిత్యంవైపు మళ్లించాయి. 1980ల్లో ఇళయరాజా చేసిన ప్రైవేటు సంగీత ఆల్బమ్‌ ‘నథింగ్‌ బట్‌ విండ్‌’ని రూ.4కి క్యాసెట్‌లో కాపీ చేయించుకొని ఇంటికి తీసుకెళ్లి విన్నా. అందులో ఏదో మహత్తర శక్తి ఉందని అనిపించింది. అందులో ‘సాంగ్‌ ఆఫ్‌ సోల్‌’ అనే బీట్‌కు అప్పట్లోనే పాట రాశా. అప్పుడే నిర్ణయించుకున్నా.. ఎలాగైనా సినిమాల్లోకి వెళ్లాలని. చాలా కాలం పాటు ఇళయరాజా ఫొటో జేబులో పెట్టుకొని తిరిగేవాణ్ని. ఆయన పేరును తమిళంలో ఎలా రాయాలో తెలుసుకొని ఆ ఫొటో వెనకాల రాసుకొని ఉంచుకున్నా!

* తబలా వాయించేవాడిని
మా ఊరి గుళ్లో భజనపాటలకు తబలా వాయించడం నాకు అలవాటు. అప్పట్లో చుట్టు పక్కల గ్రామాల్లో హరికథలు చెప్పేవారు. అలా నేను గురువుగా భావించే మల్లంపల్లి సుబ్రహ్మణ్యశర్మ హరికథలు చెబుతుంటే... నేను ఆ బృందంలో తబలా వాయించేవాడ్ని. హరికథ మధ్యలో ఏదైనా విరామం వస్తే... నేను లేచి సినిమా పాటలు పాడి శ్రోతలను అలరించేవాణ్ని.


* ఉస్మానియాలో పాట పాడాను
హైదరాబాద్‌ జేఎన్‌టీయూలో ఇంజినీరింగ్‌ చదివేటప్పుడు ఉస్మానియాలో కాలేజీ ఫెస్ట్‌ జరుగుతుంటే వెళ్లాను. అక్కడ పాటల పోటీకి నా పేరిచ్చాను. నా వంతు రాగానే వేదికనెక్కి ‘విధాత తలపున...’ అంటూ సీతారామశాస్త్రిగారి పాట పాడాను. పల్లవి పూర్తయ్యేసరికి... ప్రాంగణం చప్పట్లతో మారుమోగింది. నాకు అప్పటికే అర్థమైంది బహుమతి తప్పకుండా వస్తుందని. ఆ పోటీల్లో ప్రథమ బహుమతి అందుకున్నా. ఇక ఎలాగైనా సినిమాల్లో పాడాలని ప్రయత్నించడం మొదలు పెట్టా.

* వంద అవమానాలు భరించాలనుకున్నా
పాట పాడాలంటే... ముందు రాయాలి. రాస్తే సరిపోదు..దానికి బాణీ కట్టాలి. ఇది నాకు చిన్నప్పటి నుంచి అలవాటైంది. మా ఉపాధ్యాయులు బదిలీపై వెళ్లేప్పుడు, స్నేహితుల పుట్టినరోజులకు... ఇలాగే చేసేవాణ్ని. సినిమాల్లో పాటలు పాడాలని చాలా మంది చుట్టూ తిరిగాను. ఎక్కడా అవకాశాలు రాలేదు. ఒకసారి నా మిత్రుడు శ్రీనాథ్‌ అన్న ‘పాటలు రాయడానికి ప్రయత్నించు’ అని వెన్ను తట్టాడు. సినిమా ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణలు మొదలుపెట్టాను. నీకు ఏం అనుభవం ఉంది? నువ్వు ఏం చదివావు? అంటూ చాలా చోట్ల తిరస్కరించేవారు. ఒక చోటికి వెళితే... నువ్వు రచయితవా? అంటూ అవమానకరంగా మాట్లాడారు. బాధ పడ్డాను. అయినా ఈ ప్రయాణం ఆపకూడదని... 100 అవమానాలు జరిగేదాకా ప్రయత్నిద్దామని నిర్ణయించుకున్నా. 21వ ప్రయత్నంలోనే ముప్పలనేని శివ ‘తాజ్‌మహల్‌’ చిత్రానికి అవకాశమిచ్చారు.


* పాటలు రాయడం ఒక పనేనా?
‘మంచుకొండల్లోన చంద్రమా...’ పాట విడుదలై ప్రేక్షకాదరణ పొందింది. మరోవైపు నా ఇంజినీరింగ్‌ ఫైనల్‌ పరీక్షలు పూర్తై డిగ్రీ పట్టా వచ్చింది. ఇప్పుడు ఎటువైపు వెళ్లాలా? అని ఆలోచించాను. ఉద్యోగాలు చాలా మంది చేస్తారు. పాటలు రాయడం కొంత మందికే అబ్బే విద్య... అందుకే దీన్నే కెరీర్‌గా మలచుకోవాలనుకున్నా. తర్వాత ధర్మచక్రం, పెళ్లిసందడి...ఇలా వరుసగా అవకాశాలొచ్చాయి. నా మొదటి పాట విడుదలైన సంవత్సరానికి గానీ మా ఊరికి వెళ్లలేదు. మా నాన్నకు వీడు ఏదో తింగరి పని చేస్తున్నాడని అనుమానమొచ్చి అడిగితే... సినిమాలకు పాటలు రాస్తున్నా అన్నాను. పాటలు నువ్వు రాయడం ఏంట్రా? చిరంజీవి, ఎన్టీఆర్‌... వాళ్లే రాసుకోరా? అని తిరిగి ప్రశ్నించాడు. అసలు పాటలు రాయడం, సంగీతం సమకూర్చడం వంటి ప్రక్రియలు ఉంటాయని తెలియని అమాయకులు వాళ్లు.

* రక్తమోడుతున్నా.. పాట వినిపించా
మొదటి సినిమాకు రామానాయుడు గారు ఇచ్చిన రూ.2500 పారితోషకాన్ని దాచిపెట్టాను. అప్పటికి మా నాన్నకు జీతం పెరగడంతో ఇంట్లో కష్టాలు తగ్గాయి. రెండో సినిమాకు ఆయనిచ్చిన డబ్బును జతచేసి ఒక బండి కొన్నా. నాకు బండి సరిగ్గా నడపడం వచ్చేది కాదు. దర్శకులు శివ నాకు ఒక పాట అప్పగించారు. ఆరోజు పాట తప్పనిసరిగా వినిపించాలి. నేను బయలుదేరి వెళుతుంటే... ప్రమాదం జరిగింది. కింద పడిపోయాను. కాళ్లుచేతులకు గాయాలు అయ్యాయి. రక్తం ధారగా కారుతోంది. అక్కడే దగ్గర్లోని పంపు వద్దకు వెళ్లి కడుక్కున్నా. గాయాలు కన్పించకుండా... షర్ట్‌తో కవర్‌ చేశా. అలాగే ఆఫీసుకు వెళ్లి... ఓ వైపు రక్తం కారుతుంటే... వాళ్లకు పాట వినిపించా.


- వీరా కోగటం


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.