సిల్క్‌తో పోల్చడం సంతోషమే
ఇరుట్టు అరైయిల్‌ మురట్టుకుత్తు, సెయ్‌ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న నటి చంద్రికా రవి. తమిళంలో మరిన్ని చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఈ సందర్భంగా తన చిత్ర విశేషాల గురించి ఆమె చెప్పిన విశేషాలు...

 సినిమాలపై ఆసక్తి ఎలా కలిగింది?
చిన్న వయసు నుంచే సినిమాలంటే బాగా ఇష్టం. మూడేళ్ల నుంచే నృత్యం నేర్చుకుంటున్నా. ఆ తర్వాత నటనలో శిక్షణ తీసుకోవడానికి చేరా. మోడలింగ్‌ కూడా నేర్చుకునేదాన్ని. తమిళ సినిమాలను ఎక్కువగా చూడమనేది మా అమ్మ. కమల్‌ నటించిన సినిమాలను ఎక్కువగా చూసేదాన్ని.

తొలుత బాలివుడ్‌లో అవకాశాలు వచ్చాయే..?
అవును. బాలీవుడ్‌లోనే అవకాశాలు ఎక్కువగా వచ్చాయి. కానీ నేను నటించడానికి ఒప్పుకోలేదు. నేను తమిళ అమ్మాయిని. పుట్టి పెరిగిందంతా ఆస్ట్రేలియాలో. అందుకే తమిళంలో అవకాశం కోసం ఎదురు చూశా.

 తమిళ పరిశ్రమ గురించి?
 తమిళ సినీ పరిశ్రమ చాలా అభివృద్ధి చెందింది. ప్యాన్‌ ఇండియా చిత్రాలన్నీ ఇక్కడే తెరకెక్కుతున్నాయి. అంతేకాకుండా మంచి కథా చిత్రాలు ఎక్కువగా వస్తున్నాయి.

 తమిళంలో ఎవరితో నటించాలనుంది?
 ఆ జాబితాలో చాలా మంది హీరోలు ఉన్నారు. తొలుత కమల్‌హాసన్‌తో నటించాలి. ఆ తర్వాత ధనుష్‌, ప్రభుదేవాతో నటించాలనుంది. ఆ ఇద్దరి డాన్స్‌కు నేను పెద్ద ఫ్యాన్‌ని. ‘ఇరుట్టు అరైయిల్‌ మురట్టు కుత్తు’, ‘సెయ్‌’ చిత్రాలు నాకు మంచి గుర్తింపునిచ్చాయి. ఇప్పుడు ‘ఉన్‌ కాదల్‌ ఇరుందాల్‌’లో కథనాయికగా చేస్తున్నా. ఇది నా మూడో చిత్రం. మరో రెండు చిత్రాల్లో నటిస్తున్నా. వాటి వివరాలను త్వరలోనే వెల్లడిస్తా. రొటీన్‌ కథలే ఎక్కువగా వింటున్నా. అందుకే భిన్నమైన మంచి పాత్ర కోసం ఎదురు చూస్తున్నా.

 మీరు చేయాలనుకుంటున్న పాత్ర ఏమిటి?
 గ్రామీణ అమ్మాయిగా లంగా, ఓణీతో కనిపించాలి. అలాగే ఓ చరిత్రాత్మక చిత్రంలో నటించాలనుంది.

 మిమ్మల్ని జూనియర్‌ సిల్క్‌స్మిత అంటున్నారే..?
ఆమె గురించి నాకు బాగా తెలుసు. సామాజిక మాధ్యమాలు లేనప్పుడే ఆమె ప్రత్యేకతను చాటుకున్నారు. ఆమె ఆత్మవిశ్వాసం, ధైర్యం అంటే నాకు బాగా ఇష్టం. ఆమెతో పోల్చడం సంతోషమే.


 ‘మీటూ’ వ్యవహారం గురించి?
 ఇప్పటి వరకు అలాంటి పరిస్థితులు ఎదురు కాలేదు. మీటూ వేదికగా ఫిర్యాదు చేసినవారు అబద్ధం చెబుతున్నారని చెప్పలేం. నాకు నటించే అవకాశం వస్తే నటిస్తా. లేకపోతే అస్సలు బాధపడను. అవకాశాల కోసం ఎవరి వద్దకు వెళ్లను.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.