నెత్తురు పొంగిన మహత్తర కథ ఇది
‘నేను నీళ్లలాంటివాడిని. ఎందులోనైనా ఇమిడిపోయినట్టుగా, నేను ఎలాంటి పాత్రలకైనా సిద్ధమే’’ అన్నారు ప్రముఖ కథానాయకుడు చిరంజీవి. తెలుగు సినిమా గౌరవాన్ని ఇనుమడింపజేసేలా రామ్‌చరణ్‌ ‘సైరా నరసింహారెడ్డి’ని నిర్మించాడని... మరికొన్ని గంటల్లోనే మేమిద్దరం కలిసి నటించే సినిమా గురించి అంతా వింటారని చెప్పారు. మంచి కథ వస్తే తమ్ముడు పవన్‌కల్యాణ్‌తో కూడా కలిసి నటిస్తానన్నారు. చిరంజీవి కథానాయకుడిగా, సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. కొణిదెల ప్రొడక్షన్‌ పతాకంపై రామ్‌చరణ్‌ నిర్మించారు. చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతున్న సందర్భంగా చిత్రబృందం సోమవారం హైదరాబాద్‌లో విలేకర్లతో సమావేశమైంది. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ ‘‘బందిపోటు అని ముద్రవేసి ఉయ్యాలవాడ నరసింహారెడ్డిపై దురభిప్రాయం ఏర్పడేలా చేశారు బ్రిటిష్‌ పాలకులు. ఆయన బందిపోటు కాదు, స్వాతంత్య్రం కోసం తపించిన వీరుడు అని మేం భారతదేశానికి తెలియజెప్పే ప్రయత్నం చేశాం. ఎక్కడైతే కథ స్తబ్దతగా మారిపోతుందో అక్కడ ఒళ్లు గగుర్పొడిచేలా అక్షరాలు రాసి, తనవంతు సాయంగా భుజం కాసి సినిమాని పైకిలేపారు సిరివెన్నెల సీతారామశాస్త్రి. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్ర ఇచ్చిన ధైర్యం లేకపోతే ఇంత శ్రమించేవాళ్లం కాదేమో. కిక్‌’, ‘రేసుగుర్రం’ నుంచి సురేందర్‌రెడ్డిలో ఏదో మేజిక్‌ ఉందనిపించడం వల్లనే ఈ అవకాశం ఇచ్చాం. నేనున్నానే ధైర్యం ఉన్నప్పటికీ, దాదాపుగా రూ: 300 కోట్లు ఖర్చు పెట్టి అందరి నుంచి పనిని రాబట్టుకొన్నాడు చరణ్‌. నా నిర్మాతల్లోనే నెంబర్‌ వన్‌ అనిపించుకున్నాడు. నిర్మాతగానే కాదు, నటుడిగా కూడా తనకి వంద మార్కులు వేస్తా. ‘రంగస్థలం’కి జాతీయ అవార్డు రావల్సినంత ప్రతిభని ప్రదర్శించాడని ఫీల్‌ అవుతా’’ అన్నారు.


* నాగార్జున కౌగిలింత... వెంకటేష్‌ ముద్దు

ప్రేక్షకుల ప్రశంసలతో పాటు, తోటి నటులు, దర్శకులు వాళ్ల ప్రశంసలు మరింత సంతృప్తినిచ్చాయాన్నరు చిరంజీవి. ‘‘సినిమా చూశాక నాగార్జున వచ్చి ఎర్రటి కళ్లతో గట్టిగా హత్తుకొన్నాడు, ఇంతకంటే ఏం చెప్పలేనన్నాడు. వెంకటేష్‌ ఇంటికొచ్చి... గట్టిగా ముద్దు పెట్టి తన స్టైల్‌లో మెచ్చుకున్నాడు. మహేష్‌ ట్వీట్‌ చేశాడు. చాలా మంది దర్శకులు ఇంటికొచ్చారు. ఒక నటుడికి ఇంతకంటే ప్రశంసలు ఏం కావాలి’’ అన్నారు చిరంజీవి.
* జాతీయ పురస్కారం వచ్చి తీరుతుంది: సిరివెన్నెల సీతారామశాస్త్రి
గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మాట్లాడుతూ ‘‘పర పరిపాలనకి ఎదురితిరిగి గళం విప్పిన మొదటి గొంతు నరసింహారెడ్డిది. ఆయన ఆత్మార్పణం అనేది అంతం కాదు, ఆరంభం అనే మహత్తరమైన సందేశాన్ని, నెత్తురు పొంగించిన మహత్తరమైన కథకి ప్రాణం పోశారు చిరంజీవి. దేశమంతా ఒకటిగా నిలబడగలిగిన ఈ స్థితిలో ఒక చారిత్రక అవసరంగా పుట్టిందా ఈ సినిమా అనిపిస్తోంది. ఆపద్బాంధవుడు, స్వయంకృషి, ప్రాణం ఖరీదు, పున్నమినాగు... ఇలా చిరంజీవి అభినయ కౌశలానికి హద్దుల్లేవు, హద్దుల్లేకుండా వదిలిపెడతే చిరంజీవి ఒక జాతిని కదిలించగలరని ‘సైరా...’ విజయం నిరూపించింది. చిరంజీవిలో తొలి అర్ధ శతాబ్ధం వినోదానికి, మలి అర్ధ శతాబ్ధం వికాసానికి ఉపయోగపడాలి. పవిత్ర ధాత్రి భారతాంబ ముద్దుబిడ్డవౌవురా ఉయ్యాలవాడ నారసింహుడా అనే నా మాట... దేశంలోని ఐదు భాషల్లో వింటుంటే భారతీయతని ఏక సూత్రీకరణగా మార్చినట్టుగా అనిపించింది. ‘రుద్రవీణ’లో ఒకే ఒక ఓటు తేడాతో జాతీయ పురస్కారం తప్పిందని విన్నా, ఈసారి జాతీయ అవార్డు వచ్చితీరుతుంది’’ అన్నారు.
నటుడు సాయిచంద్‌ మాట్లాడుతూ.. ‘‘ఒక గొప్ప సినిమాలో మంచి పాత్ర చేస్తున్నానని అనుకొన్నాను కానీ, ఇంత గొప్ప స్పందన వస్తుందని ఊహించలేదు’’ అన్నారు. నటుడు రవికిషన్‌ మాట్లాడుతూ ‘‘చరణ్‌ తన తండ్రికి ఇచ్చిన అద్భుతమైన బహుమానం ఈ సినిమా’’ అన్నారు.
* శిక్షణ లేకుండా నటించారు: సురేందర్‌రెడ్డి
‘‘కొన్ని సన్నివేశాల్లో మరో టేక్‌ అనే మాటే లేకుండా నటించారు చిరంజీవి. నీళ్లలో తీసే సన్నివేశాల కోసం ఒక రోజంతా శిక్షణ ఇవ్వాలనుకొన్నాం. కానీ కొన్ని గంటల్లోనే ఆ సన్నివేశాలను పూర్తి చేశారు. వాణిజ్య సినిమా చేసుంటే ప్రశంసలు కిక్‌ ఇచ్చేవి కాదేమో కానీ, చారిత్రాత్మక సినిమా తర్వాత వచ్చిన ఈ పేరు ఎంతో తృప్తినిచ్చింది. ఇంకా పరిగెత్తుతూనే ఉండాలి, రాజమౌళిని అందుకోవాలనేది నా ఆశ’’ అన్నారు సురేందర్‌రెడ్డి.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.