నాన్న అడుగుజాడల్లోనే..
‘హాలీవుడ్‌ చిత్ర పరిశ్రమ స్థాయిలో మనకు సదుపాయాలు ఉన్నాయి. కానీ వాటిలో నాణ్యత మన సినిమాల్లో కనిపించదు. అందుకు కారణం మనం సినిమా తీసే విధానమే. ప్రపంచమంతా ముందుకు వెళుతున్నా... మనం సినిమాలు తీయడంలో మాత్రం ఇప్పటికీ పాత పద్ధతుల్నే అనుసరిస్తున్నాం. ఆ పద్ధతులు మారినప్పుడు మన సినిమాల్లో నాణ్యత పెరుగుతుంది’’ అన్నారు ప్రముఖ నిర్మాత డి.సురేష్‌బాబు. తండ్రి డి.రామానాయుడు స్ఫూర్తితో... చిన్న, పెద్ద అనే తేడా లేకుండా కథాబలమున్న చిత్రాల్ని నిర్మిస్తూ ప్రయాణం కొనసాగిస్తున్నారు. గురువారం డి.రామానాయుడు జయంతి. ఆయన స్థాపించిన సురేష్‌ ప్రొడక్షన్స్‌ 55 యేళ్ల మైలురాయిని చేరుకొంది. ఈ సందర్భంగా డి.సురేష్‌బాబు బుధవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు. ఆ విషయాలివీ...


‘‘నేను చాలా సినిమాలు చేశాను కాబట్టి నాకు అన్నీ తెలుసని కాదు. ఒక నిర్మాతకి తెలియాల్సిన దాంట్లో నాకు 60 శాతం మాత్రమే తెలుసు. మిగిలింది నేను కూడా ఎవరి దగ్గరైనా నేర్చుకొని సినిమాలు చేయాల్సిందే. ఇకపై మా సంస్థలో ప్రతి సినిమాకి ముందు, ఆ సినిమా కోసం పనిచేసే బృందానికి ప్రత్యేకంగా శిక్షణ తరగతుల్ని ఏర్పాటు చేయబోతున్నాం. అది పూర్తయ్యాకే సినిమా మొదలు పెడతాం. బయట నుంచి వచ్చే దర్శకనిర్మాతలు, చిత్రబృందాలకి కూడా సినిమాపైన, సాంకేతికతపైన అవగాహన పెంపొందించేలా శిక్షణ ఇచ్చేలా ఏర్పాట్లు చేయబోతున్నాం’’.

* పరాజయాల్లోనూ అవకాశాలు
‘‘ఒక రైతు అయిన మా నాన్న అప్పట్లో వ్యాపారం కోసం మద్రాసుకి వెళ్లారు. ఆ తర్వాత సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. తొలి ప్రయత్నంలోనే పరాజయాన్ని చవిచూశారు. డబ్బంతా పోగొట్టుకున్నా భయపడకుండా సినిమా నిర్మాణంలోనే కొనసాగారు. అందుకు కారణం ఈ రంగంలో అవకాశాలు ఉన్నాయని గ్రహించడమే. ఎవరూ నైపుణ్యంతో సినిమాలు చేయడం లేదని, ఒక విధానంతో సినిమా చేస్తే తప్పకుండా విజయాలు అందుకుంటామని ఆయన నమ్మారు. ఆయన స్థాపించిన నిర్మాణ సంస్థ సురేష్‌ ప్రొడక్షన్స్‌ 55 యేళ్లుగా విజయవంతంగా కొనసాగుతోంది. పరాజయాల్లోనూ అవకాశాలుంటాయని మా నాన్న నుంచే నేను, మా కుటుంబ సభ్యులు నేర్చుకున్నాం. నేను, మా తమ్ముడు, మా అబ్బాయి, మా మేనల్లుడు... ఇలా మా కుటుంబ సభ్యులంతా కూడా చిత్ర పరిశ్రమలోనే కొనసాగుతుండడం ఎంతో సంతృప్తినిస్తోంది’’.

* కంటెంట్‌.. టాలెంట్‌.. టెక్నాలజీ
‘‘నిర్మాతగా నాన్న ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లు ఉన్నాయి. సంస్థని ముందుకు నడిపించాలంటే ఇతర మార్గాలపై కూడా దృష్టిపెట్టాలని 1981 - 82ల్లో డబ్బింగ్‌ స్టూడియోలతో పాటు, ఇతర ప్రాథమిక సదుపాయాలు ఏర్పాటు దిశగా అడుగులు వేసి ఫలితాలు రాబట్టాం. అప్పుడు నేను పరిశ్రమలోకి అడుగుపెట్టా. అప్పట్లో నాన్న చేసినట్టుగానే ఇప్పుడు మేం కూడా, మారిన పరిస్థితులకి తగ్గట్టుగా కంటెంట్, టాలెంట్, టెక్నాలజీతో కూడిన ఒక ఎకో సిస్టమ్‌ని తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉన్నాం. దాంతో సినిమా తీసే విధానం మరింత సులభంగా మారుతుంది. కథలతో పాటు, కొత్త ప్రతిభ వెలుగులోకి వస్తుంది. అందుకోసం పలు సంస్థల్ని కొనుగోలు చేయడంతోపాటు, ఒప్పందాలు చేసుకొన్నాం. అంతిమంగా దీని లక్ష్యం మంచి కథలు చెప్పడమే’’.


* వెంకటేష్‌ కథానాయకుడిగా...
‘‘రూ: 5 కోట్ల సినిమా అయినా, వంద కోట్ల సినిమా అయినా తీసే విధానంలో తేడా ఏమీ ఉండదు. పూర్వ నిర్మాణ పనులు చిత్రాలకి ముఖ్యం. పాత రోజుల్లో ఆ పద్ధతిని పక్కాగా పాటించేవారు. ఇప్పుడు ఆ పద్ధతులు కనిపించడం లేదు. మేం ‘హిరణ్య’ కోసం దాదాపు రెండున్నరేళ్లుగా పూర్వ నిర్మాణ పనులు చేస్తున్నాం. ఆ సినిమా ప్రి విజువలైజేషన్‌ కోసం ఇప్పుడు కూడా వంద మంది పనిచేస్తున్నారు. అదంతా పూర్తయ్యాకే సినిమాని సెట్స్‌పైకి తీసుకెళతాం. ఆ చిత్రం భారతదేశంలోనే అతి పెద్ద చిత్రమయ్యే అవకాశాలున్నాయి. అమర చిత్ర కథల్ని కూడా అంతర్జాతీయ స్థాయికి తీసుకెళుతున్నాం. మా సంస్థ నుంచి చాలా చిత్రాలు రాబోతున్నాయి. ప్రస్తుతం ‘వెంకీమామ’ చిత్రం సెట్స్‌పై ఉంది. తదుపరి తరుణ్‌ భాస్కర్, త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో వెంకటేష్‌తో సినిమాలు, రానా కథానాయకుడిగా ‘విరాటపర్వం’... ఇలా చాలా సినిమాలుంటాయి. సినీ, మీడియా రంగాలు ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి చెందడం అవసరమే. అయితే చిత్ర పరిశ్రమ విశాఖలో ఉంటుందా లేక అమరావతిలోనా అనే విషయంలో ముందు ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే పరిశ్రమ ఒక చోట నుంచి మరొక చోటకి మారడం చాలా కష్టం’’.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.