నటనలో సంతోషం.. దర్శకత్వంలో సంతృప్తి
‘‘దర్శకత్వంతో పోల్చితే నటించడం చాలా సులువుగా, సంతోషంగా అనిపిస్తుంది. కానీ, అందులో ఓ సంతృప్తి దొరుతుంది. దర్శకుడిగా వందశాతం కష్టపడాల్సి వస్తే.. నటుడిగా అందులో పదిశాతం పని చేస్తే సరిపోతుంది’’ అన్నారు దేవి ప్రసాద్‌. ‘ఆడుతూ పాడుతూ’, ‘బ్లేడ్‌ బాబ్జి’, ‘కెవ్వు కేక’ వంటి వినోదాత్మక కథలతో మెప్పించిన దర్శకుడాయన. ‘నీదీ నాదీ ఒకే కథ’తో నటుడిగా మారారు. ఈ చిత్రంతో వచ్చిన పేరుతో ఇప్పుడాయన నటుడిగా తీరిక లేకుండా గడిపేస్తున్నారు. ఇప్పుడాయన కీలక పాత్రలో నటించిన చిత్రం ‘తోలు బొమ్మలాట’. రాజేంద్ర ప్రసాద్, విశ్వంత్, హర్షిత ప్రధాన పాత్రలు పోషించారు. విశ్వనాథ్‌ మాగంటి దర్శకుడు. త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో సోమవారం హైదరాబాద్‌లో విలేకర్లతో మాట్లాడారు దేవి ప్రసాద్‌.


* ‘‘నేను నటుడవ్వాలని ఎప్పుడూ అనుకోలేదు. మా గురువు కోడి రామకృష్ణ నాలోని నటుడిని గుర్తించారు. ఆయన అప్పట్లో ముగ్గురు కథానాయకులతో ఓ సినిమా ప్లాన్‌ చేశారు. నన్ను అందులో ఓ పాత్ర చేయమన్నారు. కానీ, అనుకోకుండా అది ఆగిపోయింది. తర్వాత నా చిత్రాల్లోనే సమయానికి నటులు అందుబాటులో లేక చిన్న చిన్న పాత్రలు చేశా. ‘నీదీ నాదీ ఒకే కథ’ఓ పూర్తిస్థాయి నటుడిగా మారా. ఆ చిత్రానికి, నా పాత్రకు మంచి పేరొచ్చింది. దాన్ని చూశాక మా గురువు రామకృష్ణగారు ఫోన్‌ చేసి నన్ను ప్రశంసించారు. ‘దర్శకత్వం చేస్తూ.. నటుడిగా మెప్పించే అవకాశం అందరికీ రాదు. ఆ ఛాన్స్‌ నీకొచ్చింది. అందుకే నటుడిగా అవకాశాలు వదులుకోకు’ అని చెప్పారు. ఇప్పుడాయన చెప్పిందే చేస్తున్నా’’.

* ‘‘ఈ చిత్రంలో నేను రాజేంద్రప్రసాద్‌కి కొడుకుగా నటించా. హీరో విశ్వంత్‌ నా కొడుకుగా కనిపిస్తాడు. కుటుంబ బంధాల నేపథ్యంలో సాగే చిత్రమిది. చాలా కొత్తగా ఉంటుంది. కథలో ఆకట్టుకునే మలుపులున్నాయి. కథలో ప్రతినాయకులంటూ ప్రత్యేకంగా ఎవరూ ఉండరు. పాత్రల్లోని మంచి చెడులను చూపిస్తారంతే. ఈ కథలో ప్రతిఒక్కరూ తమ నిజ జీవితాల్ని చూసుకుంటారు. దర్శకుడిగా విశ్వంత్‌కు ఇది తొలి చిత్రమైనా ఎంతో చక్కగా కథను తెరపై ఆవిష్కరించాడు. నిజానికి కొత్త దర్శకులెవరు తొలి ప్రయత్నంలోనే ఇలాంటి ఫ్యామిలీ డ్రామాలు చేయడానికి సాహసించరు. లవ్‌స్టోరీనో, యాక్షన్‌ కథలో చేసుకోని దర్శకుడిగా స్థిరపడ్డామనుకున్నాక ఇలాంటి కథల వైపు చూస్తారు. కానీ, విశ్వ దాన్ని తొలి ప్రయత్నంలోనే ఎంతో అద్భుతంగా చేసి చూపాడు’’.


* ‘‘అప్పట్లో దర్శకుడిగా రాజేంద్రప్రసాద్‌తో ఓ సినిమా చేయాలనుకున్నా. కానీ, కుదర్లేదు. ఇన్నాళ్లకు నటుడిగా ఆయనతో పని చేసే అవకాశం దక్కినందుకు సంతోషిస్తున్నా. ఓ నటుడిగా ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నా. ఆయన సెట్స్‌లో ఎన్నో విలువైన సూచనలు, సలహాలు ఇస్తుండేవారు. నేను దర్శకుడినైనా నటుడిగా సెట్స్‌లో ఉన్నప్పుడు ఆ పనినే చేసుకుంటా. నటనలో నన్ను నేను ఓ విద్యార్థిలా భావించుకుంటా. మరొకరి స్క్రిప్ట్‌లో వేలు పెట్టను. ఎందుకంటే ప్రతి దర్శకుడికీ తన సినిమాపై తనకంటూ ఓ విజన్‌ ఉంటుంది. దాన్ని ఎవ్వరూ కదపకూడదు. ఇప్పుడొస్తున్న దర్శకులంతా చాలా కొత్తకొత్త ఆలోచనలతో వస్తున్నారు. వాళ్ల మేకింగ్‌ స్టైల్‌ ఎంతో కొత్తగా ఉంటోంది. వాళ్ల పనిని చూస్తూ దర్శకుడిగా నన్ను నేను అప్‌డేట్‌ చేసుకుంటున్నా’’.

* ‘‘నీదీ నాదీ ఒకే కథ’లో సీరియస్‌ పాత్ర చేయడం వల్ల తర్వాత నుంచి అన్నీ ఆ తరహా పాత్రలే వస్తున్నాయి. కానీ, నాకు అన్ని రకాల పాత్రలు పోషించాలనుంది. ప్రస్తుతం శర్వానంద్‌తో ‘శ్రీకారం’తో పాటు ‘కాదల్‌’, ‘ఆయుష్మాన్‌ భవ’, ‘సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌’, ‘అద్భుతం’ వంటి ఓ 14 చిత్రాల వరకు చేస్తున్నా. కృష్ణవంశీ ‘రంగమార్తాండ’లో ఓ పాత్ర కోసం నన్ను సంప్రదించారు. ప్రస్తుతం నటుడిగా తీరిక లేకుండా సంతోషంగా గడుపుతున్నా. త్వరలో కచ్చితంగా మళ్లీ దర్శకత్వం చేస్తా’’.మందలపర్తి రాజేశ్‌ శర్మ, ఈనాడు డిజిటల్‌


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.