ఆ సినిమా ఆడదని తెలిసినా తప్పక చేశా!!
‘‘ప్రస్తుతం డబ్బు సంపాదన, ఉద్యోగ ఒత్తిడులు తదితర కారణాల వల్ల ప్రతిఒక్కరూ నవ్వుకు దూరమైపోతున్నారు. అందుకే లాఫింగ్‌ క్లబ్‌లు పెట్టుకోని మరీ నవ్వుకునే పరిస్థితులొచ్చాయి’’ అన్నారు జి.నాగేశ్వర రెడ్డి. ‘సీమశాస్త్రి’, ‘దేనికైనా రెడీ’, ‘ఈడోరకం ఆడోరకం’ వంటి వినోదాత్మక చిత్రాలతో ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించిన దర్శకుడాయన. వినోదమే ఆయన ప్రధాన ఆయుధం, బలం కూడా. ఇప్పుడీ బాటను నమ్ముకునే ‘తెనాలి రామకృష్ణ బిఎ.బిఎల్‌’ చిత్రంతో మరోసారి ప్రేక్షకులకు వినోదాల విందు వడ్డించేందుకు సిద్ధమయ్యారు. సందీప్‌ కిషన్‌ - హన్షిక జంటగా నటించిన చిత్రమిది. వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ కీలకపాత్రను పోషించారు. నవంబరు 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ నేపథ్యంలో సోమవారం విలేకర్లతో ముచ్చటించారు నాగేశ్వర రెడ్డి.


*
‘‘తెలివితేటలు ఉన్న వాళ్లు లాయర్లు. ఆ పాత్రలకు ఉండే ప్రధాన లక్షణం.. తిమ్మిని బమ్మిన చేసైనా కేసు గెలవడం. ఇలా చేసేవాడే తెనాలి రామకృష్ణ. అందుకే ఈ పేరు మీదుగానే చిత్ర టైటిల్‌ను ఖరారు చేశాం. చరిత్రలోకి చూస్తే తెనాలి ఎంత తెలివైన వాడు.. చమత్కారి అయినప్పటికీ కృష్ణదేవరాయలు ప్రమాదంలో ఉన్నప్పుడు ఆయన ఎంతో ధైర్యసాహసాలతో దాని నుంచి రాయల వారిని బయటపడేస్తారు. ఈ చిత్రంలోనూ అలాంటి ఓ అంశం ఉంటుంది. తను ఎంతో ప్రేమించే, గౌరవించే వ్యక్తికి అనుకోని ప్రమాదం ఎదురైనప్పుడు ఈ రామకృష్ణ ఎలా బయటపడేశాడనేది? కథాంశం. రామకృష్ణ పాత్రలో చమత్కారం, హాస్యం, సీరియస్‌ నెస్‌తో పాటు అన్ని కోణాలు ఉంటాయి. పోసాని కృష్ణమురళి, వెన్నెల కిషోర్, సప్తగిరి తదితరుల కామెడీ ట్రాక్స్‌ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. సాయి కార్తీక్‌ అందించిన స్వరాలు ఆకట్టుకునేలా ఉంటాయి. తనతో నాకిది మూడో చిత్రం’’.


*
‘‘ఒకప్పుడు రాజేంద్రప్రసాద్, నరేష్‌ వంటి హీరోల చిత్రాలు ప్రేక్షకులకు కడుపుబ్బా నవ్వులు పంచిచ్చాయి. కానీ, ఇటీవల కాలంలో ఈ తరహా చిత్రాల సంఖ్య బాగా తగ్గింది. దీన్ని దృష్టిలో ఉంచుకునే సినీప్రియలకు వినోదాల విందును అందించాలనే ఉద్దేశంతో ఈ చిత్రాన్ని రూపొందించాం. ఆద్యంతం వినోదాత్మకంగా సాగిపోతుంది. కుటుంబంతో కలిసొచ్చి హాయిగా చూసి నవ్వుకునేలా ఉంటుంది. ఈ చిత్రానికి ‘జాలీ ఎల్‌ఎల్‌బి’కి ఎలాంటి సంబంధం లేదు. పూర్తిగా కొత్త కథ ఇది. ఎలాంటి గొడవైనా సరే సర్దుకుపోతే ఎలాంటి ఇబ్బందులుండవు అనే కోణంలో చిత్ర తొలి భాగంలో హీరో పాత్ర కనిపిస్తుంది. కానీ, ద్వితియార్థానికి వచ్చేసరికి హీరోకు సర్దుకుపోవడానికి వీలులేని ఓ కేసు ఎదురవుతుంది. మరి దాని నుంచి అతనెలా బయటపడ్డాడు? ఆ సమస్యను ఎలా పరిష్కరించాడన్నది తెరపై చూసి తెలుసుకోవాలి. ఫ్యామిలీ డ్రామా నేపథ్యంతో సాగే వినోదాత్మక కథలాగే ఉన్నప్పుటికీ క్రైం కూడా ఉంటుంది. అది అవినీతి కోణంలో ఉంటుంది. సందీప్‌ పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. ఈ చిత్రంతో తను కోరుకున్న మాస్‌ ఇమేజ్‌ కూడా సంపాదించుకుంటాడు. తానే తెలివైన లాయర్‌ని అని అనుకుని భ్రమలో జీవించే ఓ సరదా యువతిగా హన్సిక కనిపిస్తుంది. వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ ఇందులో కీలక పాత్రను పోషించారు. తన పాత్రను చూసి ఆమే సంతోషపడేలా ఉంటుంది’’.


*
‘‘వినోదాన్ని చక్కగా తెరకెక్కించగలగడం నాకున్న బలం. అందుకే ఆ దారిలోనే నడుస్తున్నా. దీనికి ముందొచ్చిన ‘ఆచారి అమెరికా యాత్ర’ నన్ను నిరాశపరిచింది. నిజానికి ఆ చిత్ర ఫలితాన్ని ముందుగానే ఊహించా. చేయకూడదని అనుకున్నా. కానీ, అప్పటి మార్కెట్‌ పరిస్థితులను బట్టి తప్పక చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం నా దృష్టంతా ఈ సినిమాపైనే ఉంది. దీని ఫలితాన్ని చూశాక ఈ చిత్రాన్ని తమిళ్‌లో డబ్‌ చేయాలా? లేక రీమేక్‌ చేయాలా? అన్నది ఆలోచిస్తా’’ అన్నారు.

మందలపర్తి రాజేశ్‌ శర్మ, ఈనాడు డిజిటల్‌


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.