రూ.200కి ఆసుపత్రి అద్దాలు తుడిచా
తెలుగు చిత్రసీమలో హాస్యనటులకి కొదవ లేదు. పరిశ్రమ కూడా ఎంత మంది హాస్యనటులున్నా... కొత్తవారికి చోటిస్తూ ఉంటుంది. అలా పరిశ్రమలో చోటు దక్కించుకొని, హీరోల స్నేహితుడిగా పక్కా టైమింగ్‌తో నవ్విస్తున్న నటుడు సత్య. తాజాగా ‘గద్దలకొండ గణేష్‌’తో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాడు. ఈ సందర్భంగా ఆయనను ‘హాయ్‌’ పలకరించింది.


*
తెలుగులో స్నేహితుడి పాత్ర అనగానే గుర్తుకొచ్చే నటుల్లో మీరొకరు. ఈ ప్రయాణాన్ని ఎలా ఆస్వాదిస్తున్నారు?
దర్శకుడు అవుదామని ఇండస్ట్రీకి వచ్చా. నాలోని నటుడిని పరిశ్రమే గుర్తించింది. దర్శకనిర్మాతలు ప్రోత్సహించారు. అలా నటనపై నాకు మమకారం పెరిగింది. ఇక ఈ ప్రయాణం అంటారా? సినిమా అనేది రిక్రియేషన్‌ కాబట్టి ప్రతి రోజూ ఓ కొత్త అనుభూతికి గురవుతుంటా. కొన్ని పాత్రలు మనసుకి దగ్గరగా ఉంటాయి. మరికొన్ని కొత్త జీవితంలోకి తొంగిచూసిన అనుభూతిని కలిగిస్తాయి.
* సినిమా కాకుండా బయట స్నేహితులతో ఎలా ఉంటారు?
పరిశ్రమకి వచ్చినప్పట్నుంచి స్నేహితులే నాకన్నీ. వాళ్లతోనే కాలక్షేపం. తిండి లేకపోయినా.. అల్లరి చేస్తూ, కబుర్లు చెప్పుకొంటూ వాటితోనే కడుపు నింపుకొనేవాళ్లం. సినిమాల్లో నా అల్లరి తక్కువేనేమో కానీ, బయట ఇంకా ఎక్కువ! ఆ అల్లరే కామెడీ పరంగా, టైమింగ్‌ పరంగా ఇప్పుడు పనికొస్తోంది.
* దర్శకుడవ్వాలని వచ్చారు.. అలా ఎంత దూరం వెళ్లారు?
‘అమృతం’ ధారావాహికతో దర్శకత్వం విభాగంలో నా ప్రయాణం మొదలైంది. సహాయ దర్శకుడిగా పనిచేశా. అందులో నటుడిగా చిన్న పాత్రలోనూ కనిపిస్తా. ఆ తర్వాత ‘ద్రోణ’ చిత్రానికి సహాయ దర్శకుడిగా చేరా. ఆ చిత్ర నిర్మాత డి.ఎస్‌.రావు ‘నీలో మంచి నటుడు ఉన్నాడ’ంటూ ప్రోత్సహించారు. ‘పిల్ల జమిందార్‌’ కోసం నన్ను కెమెరా ముందుకు పంపారు. ఆ తర్వాత ‘కళావర్‌ కింగ్‌’ సినిమాకి సహాయ దర్శకుడిగా పనిచేస్తున్నప్పుడు... కథానాయకుడు నిఖిల్‌కి స్నేహితులైన సుధీర్‌ వర్మ, చందు మొండేటి పరిచయమయ్యారు. నా హావభావాల్ని, నా టైమింగ్‌ని గమనించిన సుధీర్‌వర్మ వీడైతే బాగుంటాడని తన ‘స్వామిరారా’లో నాకు అవకాశమిచ్చారు. ఆ సినిమా నా జీవితాన్ని మలుపుతిప్పింది.

*
తినడానికి తిండి ఉండేది కాదని చెప్పారు. పరిశ్రమలో ఎలాంటి కష్టాలు పడ్డారు?
దర్శకులు కె.విశ్వనాథ్, శంకర్, సుకుమార్‌ నాకు స్ఫూర్తి. వాళ్ల సినిమాల్ని ఎక్కువగా చూసేవాణ్ని. అప్పుడే నేనూ దర్శకుడు కావాలనుకున్నా. ఆ పిచ్చితో ఇంజినీరింగ్‌ మధ్యలోనే మానేసి హైదరాబాద్‌కి వచ్చా. మా ఇంట్లోవాళ్లు వచ్చి నచ్చజెప్పి ఇంటికి తీసుకెళ్లిపోయారు. కానీ నా ఆలోచనలు మారలేదు. నాన్న రూ.10 వేలు చేతిలో పెట్టి వెళ్లిపో అన్నారు. డబ్బులు తగ్గుతున్న కొద్దీ కంగారు. అప్పటికీ నాంపల్లిలో ఒక ఆస్పత్రి దగ్గర అద్దాలు తుడిచే పనికి ఒప్పుకొన్నా. రోజుకి రూ.200 ఇచ్చేవాళ్లు. నాలుగు రోజులు ఆ పని చేసుంటాను. ఓ రోజు రజనీకాంత్‌-శంకర్‌ కలయికలోని ‘శివాజీ’ సినిమా ట్రైలర్‌ చూపిస్తున్నారని తెలిసి ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ‘భూ కైలాస్‌’ సినిమాకి వెళ్లా. అక్కడ ఇద్దరు జూనియర్‌ ఆర్టిస్టులు మాట్లాడుకోవడం విని పలకరించా. వాళ్లు ‘రేపు షూటింగ్‌ దగ్గరికి వచ్చేయ్‌’ అని అడ్రస్‌ చెప్పారు. అక్కడికెళ్లాక రూ.500 తీసుకొని చిత్రీకరణ జరుగుతున్న చోటుకి పంపించారు. అక్కడ జూనియర్‌ ఆర్టిస్టుల మధ్య కూర్చుని చిత్రీకరణని చూశా. అక్కడే మరికొందరు పరిచయం అయ్యారు. వారితో ‘నవ వసంతం’, ‘యమదొంగ’ సినిమాల చిత్రీకరణకి వెళ్లా. జూనియర్‌ ఆర్టిస్టుల్లోనే ఒకరు నా దగ్గరున్న డబ్బు తీసుకొని వెళ్లిపోయాడు. మూడు రోజులు మంచినీళ్లు తాగి పడుకున్నా. ఆ బాధలో అమ్మకి ఫోన్‌ చేశా. నా గొంతు విని గుర్తు పట్టేసింది అమ్మ. నాన్నకి చెప్పడంతో ఆయన వచ్చి తీసుకెళ్లారు. మా నాన్నకి స్నేహితుడైన చంటిగారి బంధువు నల్లశ్రీను దర్శకుడు రాజమౌళి దగ్గర మేకప్‌మెన్‌గా పనిచేస్తున్నారని తెలుసుకొని ఆయన దగ్గరికి పంపించారు. ఆయనే నాకు ‘ద్రోణ’ సినిమాకి దర్శకత్వ విభాగంలో పనిచేసే అవకాశాన్నిప్పించారు.
* మీది ప్రేమ పెళ్లా? పెద్దలు కుదిర్చిన వివాహమా?
మాది పెద్దలు కుదిర్చిన వివాహమే. నా భార్య పేరు స్వాతి. మా బంధువులమ్మాయే. మాకొక పాప. తన పేరు సుధీర. దర్శకుడు సుధీర్‌వర్మ పేరునే మా పాపకి పెట్టా. ఆయన ‘స్వామి రారా’లో నాకు అవకాశం ఇచ్చుండకపోతే నా జీవితం ఇంత హాయిగా ఉండేది కాదు.

- వీడొస్తే నవ్విస్తాడనే ఓ ముద్ర లేకుండా... నటుడిగా అన్నిరకాల పాత్రలు చేయాలనేది నా కోరిక. ‘స్పీడున్నోడు’లో వ్యతిరేక ఛాయలున్న పాత్ర చేశా. విలన్‌గా నటించాలని ఉంది. ప్రస్తుతం ‘డిస్కోరాజా’తో పాటు శ్రీనివాసరెడ్డి దర్శకత్వం వహిస్తున్న ‘భాగ్యనగర్‌వీధుల్లో గమ్మత్తు’, ‘అక్షర’ సినిమాలు చేస్తున్నా. కీరవాణి వాళ్ల అబ్బాయి సింహా నటిస్తున్న ‘మత్తు వదలరా’లోనూ చేస్తున్నా.

- కొద్దిమంది హాస్యనటులం కలిసి ‘ఫ్లయింగ్‌ కలర్స్‌’ అని ఒక గ్రూప్‌ ఏర్పాటు చేసుకొన్నాం. మంచి చెడులు, కష్టనష్టాలన్నీ ఈ గ్రూప్‌తోనే పంచుకుంటా. దర్శకులు సుధీర్‌వర్మ, చందు మొండేటితో వ్యక్తిగతంగా ప్రత్యేకమైన అనుబంధం ఉంటుంది. ఇక కథానాయకుల్లో నిఖిల్, నాని, నారా రోహిత్, నాగచైతన్య, సాయిధరమ్‌ తేజ్, నాగశౌర్యలతో కలిశామంటే ఒక కథానాయకుడు, కమెడియన్‌లా కాకుండా.. ఇద్దరు స్నేహితులు కలుసుకున్నట్టే ఉంటుంది.


అమలాపురం దగ్గర జనుపల్లె మా ఊరు. మా తాత చిన్న హోటల్‌ నడిపేవారు. మా నాన్న అక్కల వెంకట్రావు ప్రభుత్వ ప్రధానోపాధ్యాయులు. మా అమ్మ పేరు పద్మావతి. నాకు ఇద్దరు తమ్ముళ్లు. ఆసక్తి ఉన్న సబ్జెక్టులు బాగా చదివేవాణ్ని అంతే. పండిత పుత్ర పరమశుంఠ అన్నట్టు చూసేవాళ్లు. నాన్నేమో.. మావాడు ఇంజినీర్‌ కావాలి, లేదంటే ఒక మంచి ప్రభుత్వోద్యోగి కావాలని అనుకొనేవారు. సినిమాపై ఆసక్తితో ఆయన్ని చాలా బాధపెట్టా. ఇప్పుడైతే సంతోషంగా ఉన్నారనుకోండీ.


- నర్సిమ్‌ ఎర్రకోట.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.