గ్లిజరిన్‌ లేకుండా ఒక టేక్‌లో పదిసార్లు ఏడ్చా!!
‘ఒక టేక్‌లో పది సార్లు ఏడ్వాలని చెప్పారు. గ్లిజరిన్‌ లేకుండా పదిసార్లు ఏడ్చాను. ఏడ్వాల్సి వచ్చిన ప్రతిసారీ నేను సత్యహరిశ్చంద్ర నాటకంలోని కాటి సన్నివేశాన్ని గుర్తు చేసుకునేవాణ్ని. నాటక రంగంతో నాకున్న అనుబంధం, సినిమా రంగంలో ఉపయోగపడింది’’ అన్నారు ప్రముఖ రచయిత, గాయకుడు గోరటి వెంకన్న. ఆయన అప్పుడప్పుడు నటుడిగానూ మెరుస్తుంటారు. ‘శ్రీరాములయ్య’, ‘బతుకమ్మ’, ‘నగరం నిద్రపోతున్న వేళ’ తదితర చిత్రాల్లో నటించిన గోరటి వెంకన్న, ఇటీవల ‘బిలాల్‌పూర్‌ పోలీస్‌ స్టేషన్‌’లో నటించారు. నాగసాయి మాకం దర్శకత్వంలో తెరకెక్కిన ఆ చిత్రం ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా గోరటి వెంకన్న బుధవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు. ఆ విషయాలివీ...


‘‘దర్శకనిర్మాతలు ప్రేమతో పిలిచినప్పుడు, మంచి కథ అనిపించినప్పుడు నటిస్తుంటాను. ‘బిలాల్‌పూర్‌ పోలీస్‌ స్టేషన్‌’ దర్శకనిర్మాతలు నాగసాయి మాకం, మహంకాళి శ్రీనివాస్‌లు మంచి అభిరుచి కలిగిన వ్యక్తులు. అది నచ్చే ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నా. ఇందులో నేను సురేందర్‌ అనే హెడ్‌ కానిస్టేబుల్‌ పాత్రని పోషించా’’.

* ‘‘కళారూపాలు ఏవైనా ఒక్కటే. ఒక సందర్భం చెప్పి పాట రాయమని చెబితే రచయితగా నేను అందులోకి పరకాయ ప్రవేశం చేయాలి. ఆ జీవితాన్ని, ఆ సందర్భాన్ని అనుభవించి పాట రాయాలి. నటన కూడా అంతే. సురేందర్‌ పాత్రలో నటిస్తున్నప్పుడు అందులోకి పరకాయ ప్రవేశం చేశా. పద్య నాటకాలతో అనుబంధం ఎక్కువ. ఆ రంగంలో బండారు రామారావు, చీమకుర్తి నాగేశ్వరరావు, బీవీ సుబ్బారావులాంటి ఎంతోమంది ప్రముఖుల్ని దగ్గర్నుంచి చూశా. వాళ్లు పాత్రల్లో ఒదిగిపోయేవారు. రంగస్థలంపై నిజంగానే ఏడ్చేవారు. అలా నేను కూడా ఆధునిక దృశ్య మాధ్యమమైన సినిమాకి, ప్రాచీన పద్యనాటక వైభవాన్ని, అందులోని విషాదాన్ని తీసుకొచ్చి కలిపాను. దాదాపు 40 రోజులుపాటు ఈ చిత్రంలో నటించా. ఒక పాట రాశా. ఈ సినిమా తర్వాత నటనపై గౌరవం పెరిగింది’’.

* ‘‘రచయితగా అన్ని రకాల పాటలు రాస్తుంటాను. ‘శ్రీరాములయ్య’లో రాయలసీమ పాట రాస్తే, ‘జై బోలో తెలంగాణ’లో ప్రేమ పాట రాశా. ‘మహాయజ్ఞం’లో ప్రత్యేక గీతం రాశా. ఇటీవల ‘దొరసాని’ కోసం నా శైలిలోనే రెండు పాటలు రాశా. అలా ఈ ఏడాది దాదాపు పది సినిమాల్లో పాటలు రాసుంటాను. నటుడిగా మాత్రం ఇదివరకు చేసిన అన్ని చిత్రాల్లో కంటే పెద్ద పాత్రని ఇందులో చేశా’’.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.