లాయర్‌ అవ్వాలనుకున్నా...కానీ
"ప్రేక్ష‌కుల‌కి వినోదం పంచ‌డ‌మే నా ప‌ని. ఆ అవ‌కాశం ఏ భాష నుంచి వ‌చ్చినా స్వీక‌రిస్తా. కానీ తెలుగు, త‌మిళ భాష‌లు నాకు రెండు క‌ళ్లులాంటివి. ఈ రెండు భాష‌ల్లో న‌టించ‌డాన్ని ఎంత‌గానో ఆస్వాదిస్తా’’ అంటోంది హ‌న్సిక‌. `దేశ‌ముదురు`తో ప్ర‌యాణం ప్రారంభించిన ముంబై భామ ఈమె. ఆ త‌ర్వాత త‌మిళంలో బిజీ అయిపోయింది. కానీ తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌ని మాత్రం మ‌రిచిపోలేదు. ఇక్క‌డి నుంచి అవ‌కాశం వ‌చ్చిన ప్ర‌తిసారీ అందిపుచ్చుకుంటూ న‌టిస్తోంది. `గౌత‌మ్ నందా` త‌ర్వాత హ‌న్సిక న‌టించిన తెలుగు చిత్రం `తెనాలి రామ‌కృష్ణ బి.ఎ, బి.ఎల్‌`. సందీప్‌కిష‌న్ క‌థానాయ‌కుడిగా న‌టించిన ఈ చిత్రాన్ని జి.నాగేశ్వ‌ర్‌రెడ్డి తెర‌కెక్కించారు. చిత్రం శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్న సంద‌ర్భంగా హ‌న్సిక బుధ‌వారం హైద‌రాబాద్‌లో విలేక‌ర్ల‌తో ముచ్చ‌టించింది. ఆ విష‌యాలివీ...


* ఇందులో న్యాయ‌వాది పాత్ర‌లో న‌టించారు క‌దా, మీకు లాయ‌ర్ స్నేహితులు ఎవ‌రైనా ఉన్నారా?
- ఒక‌రున్నారు. త‌ను మా సోద‌రుడికి స్నేహితుడు. సో.. నాక్కూడా సోద‌రుడే అన్న‌మాట‌. ఎప్పుడు ఫోన్ చేసినా కోర్టు రూమ్‌లో ఉన్నానంటుంటాడు. ఈ సినిమా చేస్తున్నాప్పుడు త‌న ప్ర‌పంచం ఎలా ఉంటుందో ఊహించుకొన్నా. అన్న‌ట్టు నేను కూడా చిన్న‌ప్పుడు న్యాయ‌వాదిని అవ్వాల‌నే అనుకొనేదాన్ని. ఏ విష‌యంలోనైనా స‌రే నేను బాగా వాదిస్తుంటాన‌న్న‌మాట (న‌వ్వుతూ). అందుకే ఇప్ప‌టికి కూడా న్యాయ‌వాదిని అయ్యుంటే ఎంత బాగుండేదో క‌దా అనిపిస్తుంటుంది.

* సినిమాతో ఆ కోరిక కొంత‌వ‌ర‌కు నెర‌వేరింద‌న్న‌మాట‌...
- నేనేమీ సీరియ‌స్ లాయ‌ర్‌ని కాదులెండి. న‌వ్వించే చోటు మోటు లాయ‌ర్‌ని. తెనాలి పాత్ర‌లో క‌నిపించే సందీప్‌కిష‌న్‌తో క‌లిసి చేసే సంద‌డి మంచి వినోదాన్ని పంచుతుంది.

* ఈ సినిమా ఒప్పుకోవ‌డానికి ప్ర‌ధాన‌మైన ఓ కార‌ణం చెప్పండి?
- క‌థే. హాస్య‌భ‌రితంగా సాగే క‌థ‌లంటే స్వ‌త‌హాగా నాకు ఇష్టం. ప్రేక్ష‌కుడికి ఆహ్లాదాన్ని పంచాలి. ఈ మ‌ర్డ‌ర్ ఎవ‌రు చేశారు? దీనికి కార‌ణం ఏంటి? క‌థ త‌ర్వాత ఎలాంటి మ‌లుపు తిరుగుతుందో... ఇలా ఒక ప‌క్క సినిమా చూస్తూ మ‌రో ప‌క్క బుర్ర‌కి ప‌నిపెట్టే సినిమా కాదిది. హాయిగా స‌ర‌దాగా చూస్తున్నంత‌సేపూ న‌వ్విస్తుంది. జి.నాగేశ్వ‌ర్‌రెడ్డితో ఇదివ‌ర‌కు `దేనికైనా రెడీ` చేశాను క‌దా. అలా ఆద్యంతం వినోదాన్ని పంచుతుందీ సినిమా. నాగేశ్వ‌ర‌ర్‌రెడ్డి స‌ర్ క‌థ చెప్ప‌డ‌మే గ‌మ్మ‌త్తుగా ఉంటుంది. ఆయ‌న మార్క్ సినిమా ఇది. త‌ప్ప‌కుండా ప్రేక్ష‌కుల్ని న‌వ్విస్తుంది.

* తెలుగులో సినిమా సినిమాకీ మ‌ధ్య రెండేళ్లు విరామం వ‌స్తోంది. కార‌ణ‌మేమిటి?
- దాన్ని నేను గ‌మ‌నించ‌లేదు. మంచి అవ‌కాశం నాకు ముఖ్యం. మంచి క‌థ వచ్చిందంటే అది ఏ భాష‌లో అనేది ప‌ట్టించుకోను. కొన్ని సంద‌ర్భాల్లో తెలుగు నుంచి అవ‌కాశాలు వ‌చ్చినా త‌మిళంలో సినిమాల‌తో బిజీగా ఉండ‌టంతో చేయ‌లేక‌పోయాను. అంతే కానీ... ప్ర‌త్యేకంగా విరామం తీసుకోవ‌డ‌మంటూ ఏమీ లేదు.

* క‌థానాయిక‌గా సుదీర్ఘ‌మైన ప్ర‌యాణం చేశారు. యాభై సినిమాల మైలురాయిని అధిగ‌మించారు. వెన‌క్కి తిరిగి చూసుకుంటే ఏమ‌నిపిస్తోంది?
- ఇంకా చాలా దూరం ప్రయాణించాలి. ఇన్ని సినిమాలు చేయాల‌ని కానీ, చేస్తాన‌ని కానీ నేను ముందు ఊహించలేదు. ఒక ప్ర‌వాహంలా ప్ర‌యాణం సాగిపోతోందంతే.


* వ్య‌తిరేక ఛాయ‌ల‌తో కూడిన పాత్ర‌లొస్తే చేయ‌డానికి సిద్ధ‌మేనా?
- అస్స‌లు ఆలోచించ‌ను. మ‌ల‌యాళంలో మోహ‌న్‌లాల్‌తో క‌లిసి ఒక సినిమా చేశా. అందులో నాది వ్య‌తిరేక ఛాయ‌లున్న పాత్రే. విల‌నిజంతో కూడిన పాత్ర‌లంటే నాకు చాలా ఇష్టం. అవ‌కాశం వ‌చ్చిందంటే త‌ప్ప‌కుండా చేస్తా.

* ఈమ‌ధ్య బ‌రువు బాగా త‌గ్గిన‌ట్టున్నారు. ఇదివ‌ర‌క‌టితో పోలిస్తే మ‌రింత నాజూగ్గా క‌నిపిస్తున్నారు....
- ఐదేళ్లుగా ఫిట్‌నెస్ విష‌యంలో మ‌రింత శ్ర‌ద్ధ తీసుకుంటున్నా. నాజూగ్గా మార‌డం వెన‌క ర‌హస్యం స్వాష్ ఆడ‌ట‌మే. స‌మ‌యం దొరికితే స్క్వాష్ ఆడుతుంటా. అది నా బ‌రువుని బాగా నియంత్రిస్తుంటుంది.

* తెలుగులో కొత్త‌గా ఒప్పుకున్న సినిమాలేమైనా ఉన్నాయా?
- భాగ్‌మ‌తి ఫేమ్ జి.అశోక్ ద‌ర్శ‌క‌త్వంలో వెబ్‌సిరీస్ చేశా. అందులో నేటియువ‌తుల్ని ప్ర‌తిబింబించే పాత్ర నాది. ఇంకో నాలుగైదు రోజులు మాత్ర‌మే చిత్రీక‌ర‌ణ చేయాలి. రాబోయే కాలమంతా వెబ్ సిరీస్‌లదే. నేనైతే బాగా చూస్తుంటా. త‌ప్ప‌కుండా ఈ వెబ్ సిరీస్ ఆక‌ట్టుకుంటుంది.

* ఈమ‌ధ్య కొత్త కారు కొన్న‌ట్టున్నారు?
- ధ‌న్‌తేర‌స్‌ని పుర‌స్క‌రించుకొని మా అమ్మ మెర్సిడెస్ బెంజ్ ఎస్ క్లాస్ బ‌హుమానంగా ఇచ్చింది. అదెంతో నాకు చాలా ఇష్టం. 



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.