అందుకే.. బోల్డ్‌ పాత్రలు చెయ్యలేను!!
‘‘నా తల్లిదండ్రులతో కలిసి చూడగలిగేలా పద్ధతైన పాత్రల్లో నటించడమంటే చాలా ఇష్టం’’ అంటోంది హర్షిత చౌదరి. ‘తోలుబొమ్మలాట’ చిత్రంతో వెండితెరపై అడుగుపెట్టబోతున్న పదహారణాల తెలుగమ్మాయి హర్షిత. రాజేంద్ర ప్రసాద్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రమిది. విశ్వంత్, వెన్నెల కిషోర్, దేవి ప్రసాద్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మాగంటి విశ్వనాథ్‌ దర్శకత్వం వహించారు. త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో గురువారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించింది హర్షిత. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే..


*
‘‘నేను పుట్టింది ఆంధ్రాలోని ప్రకాశంలోనైనా పెరిగింది మొత్తం హైదరాబాద్‌లోనే. మాస్‌ కమ్యునికేషన్స్‌ చదువుతున్నా. తెరపైకి రాకముందు కొన్ని వాణిజ్య ప్రకటనల్లో నటించా. తర్వాత ఆ అనుభవంతోనే సినిమాల్లో ప్రయత్నించి ఈ అవకాశం దక్కించుకున్నా. నిజానికి ఈ రంగంలోకి అడుగుపెట్టాలనుంది అని చెప్పినప్పుడు అందరి అమ్మానాన్నల్లాగే మా వాళ్లు వద్దన్నారు. కానీ, నా ఆసక్తి చూసి ఒప్పుకున్నారు. కథల ఎంపికలో చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటా. ఎందుకంటే.. అందరు తెలుగమ్మాయిల్లాగే నేను అన్ని రకాల పాత్రలు చేయలేను. ముఖ్యంగా బోల్డ్‌ పాత్రలు నచ్చవు. డ్రెస్సింగ్‌ విషయంలోనూ నాకంటూ కొన్ని పరిమితులు ఉన్నాయి’’.

*
‘‘నేను ఎలా ఉంటే బాగుంటుంది అని అనుకుంటానో.. ఆ తరహా పాత్రనే ఇందులో పోషించా. చక్కటి కుటుంబ కథా చిత్రమిది. నేనిందులో రాజేంద్రప్రసాద్‌కు మనవరాలిగా కనిపిస్తా. వృత్తిరిత్యా సాఫ్ట్‌వేర్‌ జాబ్‌ చేసే యువతిని. నా పాత్ర చాలా అమాయకంగా, పద్ధతిగా ఉంటుంది. దర్శకుడు తొలి ప్రయత్నంలోనే ఇలాంటి కథను ఎంచుకోవడం సాహసమనే చెప్పాలి. కానీ, చాలా బాగా తెరకెక్కించారు. మంచి బలమైన సంభాషణలు అందించారు. ప్రతి చిన్న పాత్రకూ ప్రాధాన్యత ఉంటుంది. పాటలతో మా బంధాలను ఎంతో చక్కగా ఆవిష్కరించారు’’.


*
‘‘రాజేంద్రప్రసాద్‌ వంటి సీనియర్‌ నటులతో చేస్తున్నప్పుడు ఎవరికైనా కాస్త భయంగానే ఉంటుంది. నాకూ మొదట్లో అలాగే అనిపించింది. కానీ, వారి నటన నుంచి ఎన్నో మెళకువలు నేర్చుకొని బాగా చేశా. అయితే ఫస్ట్‌కాపీ చూసుకున్నాక నా పాత్ర ఇంకా బాగా చేసుంటే బాగుండేదేమో అన్న అనుభూతి కలిగింది. ఈ సినిమాతో సమయపాలన, సానుకూల దృక్పథం వంటివి అలవర్చుకున్నా. ప్రస్తుతం ఓ కథ వింటున్నా.. త్వరలోనే దానికి సంబంధించిన వివరాలు తెలియజేస్తా’’.



మందలపర్తి రాజేశ్‌ శర్మ, ఈనాడు డిజిటల్‌


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.