ద్విపాత్రాభినయమా కాదా.. ట్రైలర్‌లో క్లూ
టాలీవుడ్‌ కలవరిస్తున్న పేరు... ప్రభాస్‌.
బాలీవుడ్‌ సైతం ఆరా తీస్తున్న పేరు.. ప్రభాస్‌.
భారతీయ చిత్రసీమలో, తెలుగు హీరోయిజం చాటిన నిలువెత్తు కటౌట్‌.. ప్రభాస్‌.
‘బాహుబలి’ తరవాత తన ఇమేజ్‌ రాష్ట్రాలు దాటేసి, దేశాలు చుట్టేసింది. అందుకే ‘సాహో’ కోసం అంత నిరీక్షణ. రెండేళ్లు ఈ సినిమా కోసం కష్ట పడ్డారు ప్రభాస్‌. తన క్రేజ్‌ని నమ్మి యూవీ సంస్థ ఏకంగా రూ.350 కోట్లు ఖర్చు పెట్టింది. అందుకే.. ‘సాహో’ దేశ వ్యాప్తంగా సినీ ప్రియుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈనెల 30న విడుదల కాబోతున్న ‘సాహో’ గురించి ప్రభాస్‌ మనసు విప్పారు. సోమవారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ ‘సాహో’ ముచ్చట్లు పంచుకున్నారు.


‘సాహో’ ప్రచార చిత్రాలు చూస్తుంటే హాలీవుడ్‌ చిత్రాలు గుర్తొస్తున్నాయి. ఈచిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్లే టప్పుడు మీ ఉద్దేశాలు కూడా అవేనా?
‘సాహో’ పక్కాగా ఓ కమర్షియల్‌ సినిమా. లార్జర్‌ దేన్‌ లైఫ్‌లా ఉంటుంది. ‘బాహుబలి’ తరవాత ఏం చేసినా కొత్తగానే ఉండాలి. ‘బాహుబలి’లో చూడండి. ఓ జలపాతాన్ని సృష్టించారు. దాన్ని ఆ స్థాయిలో చూపించాల్సిన పనిలేదు. కానీ ఆకాశమంత ఎత్తు చూపించేసరికి ప్రేక్షకులు విస్మయానికి గురయ్యారు. ఫైటింగులు, ఛేజింగులు ఇవన్నీ భారీ స్థాయిలో ఉండడానికి కారణం కూడా అదే.

‘బాహుబలి’ తరవాత మీ కోసం పెద్ద దర్శకులు అంతా క్యూలో నిలబడ్డారు. కానీ ఒకే ఒక్క సినిమా అనుభవం ఉన్న సుజిత్‌కి అవకాశం ఇచ్చారు. కారణమేంటి?
‘రన్‌ రాజా రన్‌’తోనే సుజిత్‌ చాలా బాగా నచ్చాడు. తను స్క్రీన్‌ ప్లే బాగా చేయగలడని అర్థమైంది. అందుకే ‘నాకో సినిమా చేస్తావా’ అని అడిగాను. ‘మంచి కథ రాశాక కలుస్తా’ అన్నాడు. ‘అబ్బా ఏం కాన్ఫిడెన్స్‌’ అనిపించింది. అనుకున్నట్టే మంచి కథతో వచ్చాడు. ‘సాహో’లో కొన్ని సన్నివేశాలు చాలా కీలకం. ఒక్కో సన్నివేశం మళ్లీ మళ్లీ తెరపై కనిపిస్తుంటుంది. అందులోనే రకరకాల షేడ్స్‌ కనిపిస్తాయి. వాటిని తెరకెక్కించడం చాలా కష్టం. వాటిని సుజిత్‌ సమర్థంగా తెరకెక్కించాడు.

ఈ కథ చెప్పినప్పుడు మీ పాత్రకు రిఫరెన్సులు ఇచ్చారా?
కలిసి కూర్చుని మాట్లాడుకున్నాం. చాలా వర్క్‌షాప్‌లు చేశాం. ‘బాహుబలి’ స్థాయిలో కాదనుకోండి.. (నవ్వుతూ). సుజిత్‌కి మాస్‌ పల్స్‌ బాగా తెలుసు. ‘డైహార్డ్‌ ఫ్యాన్స్‌’ అనే డైలాగ్‌ ఉండాలన్న ఆలోచన కూడా తనదే.


ఈ సినిమాలో యాక్షన్‌ దృశ్యాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వాటి కోసం ప్రత్యేకంగా చేసిన కసరత్తేంటి?
‘బాహుబలి’తో పోలిస్తే ‘సాహో’లోని యాక్షన్‌ సన్నివేశాలు పూర్తిగా విభిన్నమైనవి. కొన్ని యాక్షన్‌ సన్నివేశాల్ని ఎలా తెరకెక్కించాలో అర్థం కాలేదు. అబుదాబిలో కొన్ని ఫైట్స్‌ తీశాం. వాటి కోసం జెట్స్‌, రిమోట్‌ కార్లు లాంటివి వాడాం. రిమోట్‌ కార్లని నేను చూడడం అదే మొదటిసారి. ఇలాంటి సన్నివేశాల్ని తెరకెక్కించే కెమెరాలు ప్రత్యేకంగా డిజైన్‌ చేయిస్తారట. అవి కూడా మేం విదేశాల నుంచి ఓడల్లో దిగుమతి చేసుకోవాల్సివచ్చింది. ప్రతి సన్నివేశానికి ముందు చాలా కసరత్తు చేశాం. కళావిభాగం, కెమెరా టీమ్‌ సమన్వయంతో పనిచేశాయి. ఈ సన్నివేశాల్ని ఎడిట్‌ చేసిన విధానం కూడా హాలీవుడ్‌ స్థాయిలో ఉంటుంది.

‘సాహో’ కథ గురించి చాలా కథనాలు ప్రచారంలో ఉన్నాయి. మీరు ద్విపాత్రాభియనం చేస్తున్నారని అంటున్నారు. ఈ విషయంపై క్లూ ఇస్తారా?
ద్విపాత్రాభినయం కాకపోవచ్చు (నవ్వుతూ). కథ మొత్తం ఇప్పుడే చెప్పొచ్చు. కానీ థియేటర్‌కి వెళ్లేంత వరకూ ఆ ఉత్సుకత ఉండాలి కదా. అందుకే దాస్తున్నాం. కథ గురించి కొన్ని క్లూలు ట్రైలర్‌లో ఇచ్చేశాం.

‘బాహుబలి’ విజయాన్ని చూసే ఈ సినిమా బడ్జెట్‌ పెంచుకుంటూ వెళ్లారా?
‘బాహుబలి’ జరుగుతున్నప్పుడు సుజిత్‌ ఈ కథ చెప్పాడు. ‘బాహుబలి’ బాగా ఆడితే ఈ సినిమాపై డబ్బులు ఖర్చు పెట్టొచ్చు అనిపించింది. అదృష్టంకొద్దీ బాగా ఆడింది. దాంతో క్రమంగా ‘సాహో’ స్కేల్‌ పెరుగుతూ వెళ్లింది. ఎంత చేసినా రూ.150 కోట్లు దాటదనుకున్నాను. కానీ ఎక్కువైపోయింది.

బడ్జెట్‌ పెరిగిపోతుంటే ఏమనిపించేది?
నిద్రపట్టేది కాదు. బడ్జెట్‌ అనేది నా స్నేహితులు చూసుకుంటారు. వాళ్లు అసలు రాజీ పడరు.

‘బాహుబలి’, ‘సాహో’తో బాలీవుడ్‌లోకీ వెళ్లారు. మీ సినిమాలను అక్కడ అగ్ర హీరోలు పోటీగా భావించే పరిస్థితి. అక్కడి హీరోలు మీతో ఎలా ఉంటున్నారు?
పోటీ అని బయట మాట్లాడుకుంటారు. కానీ మా మధ్య అలాంటివేం ఉండవు. అక్కడి కథానాయకులు నన్ను స్వాగతించిన తీరు చాలా ఆనందాన్ని కలిగించింది. రణ్‌బీర్‌ కపూర్‌, అజయ్‌దేవగణ్‌ నాతో బాగా మాట్లాడతారు. ఈ మధ్య ఆమీర్‌ ఖాన్‌ ప్రీమియర్‌ షో కోసం ఆహ్వానించడానికి ఫోన్‌ చేశారు.

బాలీవుడ్‌లో మల్టీస్టారర్‌ చేయడానికి రెడీయేనా?
తప్పకుండా. అలాంటి కథల్ని అక్కడ మరింత బాగా ఆదరిస్తారు.

ఓ యాక్షన్‌ చిత్రాన్ని హాలీవుడ్‌ స్థాయిలో తెరకెక్కించాల్సివస్తున్నప్పుడు కూడా పాటలు అవసరం అనిపిస్తోందా?
మేం తీసింది కమర్షియల్‌ చిత్రమే. అందులో ఎలాంటి హంగులు ఉండాలో అవన్నీ ఉండాల్సిందే. సడన్‌గా హీరో బాలసుబ్రహ్మణ్యంలా పాటలు పాడాల్సిందే.. (నవ్వుతూ)


తొలినాళ్లకీ ఇప్పటికీ మీలో మీకు కనిపించిన మార్పులు?
‘ఈశ్వర్‌’ చేస్తున్నప్పుడు నన్నెవరైనా చూస్తారా? నేనిక్కడ నిలదొక్కుకోగలనా? అనే భయం వేసేది. ఇప్పుడు ‘బాహుబలి’ని మరిపించేలా ఏం చేయగలం? ఏం చేస్తే ప్రేక్షకులు ఆస్వాదిస్తారు? అనేది ఆలోచిస్తున్నా.

బయట కూల్‌గా ఉంటారు. సినిమాల్లో వీరోచితంగా కనిపిస్తారు. ఇలా ఎలా చేయగలుగుతున్నారు?
డబ్బులు తీసుకుంటున్నాం కదండీ.. (నవ్వుతూ). సెట్లో ఇప్పటికీ బిడియం ఉంటుంది. కానీ కెమెరా ఆన్‌ అయితే అది మాయం అవుతుంది.

‘సాహో’ ఒత్తిడంతా మీరే భరించారు. మీ ఒత్తిడిని తీసుకునే జీవిత భాగస్వామి ఎప్పుడొస్తుంది?
ఒత్తిడి తీసుకుంటుందో, పెంచుతుందో తెలీదు కదా? (నవ్వుతూ). అందుకే కాస్త ఆగాను.


* ‘‘పెదనాన్నగారు నా విజయాల్ని చూసి పొంగిపోతున్నారు. ముంబయి, దిల్లీలాంటి చోట్లకు వెళ్తుంటే వాళ్లు ‘బాహుబలి.. ప్రభాస్‌’ అంటున్నారట. ఆ మాటలు విని ఆయన ఇంకా లావైపోతున్నారు (నవ్వుతూ). నా విజయాల్ని ఆయన బాగా ఆస్వాదిస్తున్నారు. ఆయనకు ఈతరం అభిరుచులేంటో బాగా తెలుసు. ‘బిల్లా’లాంటి కథని ఆయన ఒప్పుకుంటారని నేను ఆనుకోలేదు. గోపీకృష్ణ సంస్థలోనే ఆ సినిమా చేశాం’’.
* ‘‘నాకంటే ఎక్కువ విజయాలు సాధించిన వాళ్లంతా వినయంగానే ఉంటున్నారు. రాజమౌళిని పన్నెండేళ్లుగా చూస్తున్నా. తను అప్పుడు ఎలా ఉన్నాడో, ఇప్పుడూ అలానే ఉన్నాడు. చిరంజీవిగారు, రజనీ కాంత్‌గారు ఎంతో సాధించారు. వాళ్ల ముందు నేను చిన్నవాడినే కదా’’.
* ‘‘ఈమధ్య తెలుగు సినిమా మంచి జోరుమీద ఉంది. మంచి సినిమాలొస్తున్నాయి. చిన్న సినిమాలు కూడా బాగా ఆడుతున్నాయి. అది చాలా మంచి పరిణామం. చిన్న సినిమాలు ఆడితే ప్రతిభావంతులు మరింతమంది బయటకు వస్తారు. ఇటీవల జాతీయ అవార్డుల్లో తెలుగు సినిమా తన సత్తా చాటింది. ఇవన్నీ మంచి పరిణామాలు’’.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.