‘జగదేక వీరుడు’ మరో 30 ఏళ్లు మాట్లాడుకునే చిత్రం

ఐదు దశాబ్దాల మైలురాయికి చేరువలో ఉన్న నిర్మాణ సంస్థ.. వైజయంతీ మూవీస్‌. ఈ ప్రయాణంలో ప్రతి తరానికీ గుర్తుండిపోయే చిత్రాలు వచ్చాయి ఈ సంస్థ నుంచి. మధ్యలో ఆటుపోట్లు ఎదురైనా... ‘మహానటి’తో మళ్లీ పూర్వ వైభవాన్ని సంతరించుకుంది. వైజయంతీ మూవీస్‌ నిర్మించిన ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ విడుదలై ఈ నెల 9కి 30 ఏళ్లు పూర్తవుతాయి. ఈ సందర్భంగా ఆ సంస్థ అధినేత సి.అశ్వనీదత్‌తో ‘ఈనాడు-ఈటీవీ’ ప్రత్యేక ముఖాముఖి.‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ 30 ఏళ్లు పూర్తి చేసుకోబోతుంది. ఆ సినిమా ఎలా మొదలైంది?

ఆ సినిమా నాకొక మధుర స్వప్నం. వైజయంతీ సంస్థ గౌరవాన్ని పెంచిన సినిమా. తీస్తే ఎన్టీఆర్‌ ‘జగదేకవీరుని కథ’లాంటి సినిమా తీయాలని బలంగా అనుకునేవాణ్ని. విజయా ప్రొడక్షన్స్‌లాగా పెద్ద నిర్మాతను అవ్వాలనుకుని పరిశ్రమలోకి అడుగుపెట్టాను. ఆ ప్రయాణంలో నా కల నెరవేర్చిన చిత్రం ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’. ఈ 30 ఏళ్లే కాదు మరో 30 ఏళ్లు మాట్లాడుకునే సినిమా ఇది. తెలుగులో మొదటి 10 ఉత్తమ చిత్రాల్లో ఒక సినిమాగా నిలిచి చరిత్ర సృష్టించింది. మా కో డైరెక్టర్‌ శ్రీనివాసచక్రవర్తి తిరుపతి కొండ మీద ఆసువుగా రాఘవేంద్రరావుకు ఓ లైన్‌ చెప్పాడు. ఉంగరం పొగొట్టుకున్న దేవకన్య పైనుంచి భూమి మీదకు దిగి వస్తుంది. ఆ ఉంగరం చిరంజీవికి దొరుకుతుందనేది పాయింటు. దీని నుంచే ఈ కథ పుట్టింది. అప్పటి వరకు చిరంజీవి-శ్రీదేవి కలయికలో సినిమా లేదు. వాళ్లిద్దరి జోడీ బాగుంటుందని అనుకున్నాం. ఆ రోజుల్లో దేవకన్యగా చూపించాలంటే శ్రీదేవి తప్ప మరెవరూ లేరు. హిందీలో బిజీగా ఉన్నా రాఘవేంద్రరావు ఈ సినిమా ఎలా తీస్తారో ఆవిడ ముందే ఊహించి తన కాస్ట్యూమ్స్‌ అన్నీ సొంతంగా ముంబయిలో డిజైన్‌ చేయించుకున్నారు. దేవకన్యకు మించి నా పాత్ర ఉండకూడదని చిరంజీవి సలహా ఇచ్చారు. మాసిన దుస్తులు, చెదిరిన జుట్టుతో రాజు పాత్రలో కనిపించి ప్రేక్షకులను మైమరిపించారు.
తరతరాలు గుర్తుంచుకునే సినిమాలు తీయడం వెనక మీకు స్ఫూర్తి ఎవరు?

సినిమా ఓ మంచి వ్యాపారం. వ్యాపారాన్ని అదే తరహాలోనే చేయాలని విజయా ప్రొడక్షన్స్‌ నాగిరెడ్డి, కేవీ రెడ్డి, ఆదుర్తి సుబ్బారావు చిత్రాల స్ఫూర్తితో పరిశ్రమలోకి అడుగుపెట్టా. ఎన్టీఆర్, ఏఎన్నార్‌ అంటే ఎనలేని అభిమానం. ఒకపక్క రామానాయుడు, మరోపక్క జగపతి రాజేంద్రప్రసాద్‌.. తీస్తే వాళ్ల తరహా సినిమాలు తీయాలనుకునేవాణ్ని. జనాలు వాళ్ల గురించి మాట్లాడుకున్నట్టే నా గురించీ మాట్లాడుకోవాలనుకునేవాణ్ని. వచ్చాం...ఏదోటి తీశాం అని ఎప్పుడూ అనుకోలేదు. 5 తరాలకు సరితూగే సినిమాలు తీశానంటే గొప్పదర్శకులు నాకు దొరకడమే కారణం.
‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ రీమేక్‌ ఆలోచన ఉందా?

మా జగదేకవీరుడు మళ్లీ వస్తాడు. కచ్చితంగా ఆ సినిమాకు రెండో భాగం ఉంటుంది. అది తీశాకే రిటైర్‌ అవుతాను. ఎప్పుడు, ఎవరెవరు నటిస్తారనేది త్వరలో చెబుతాం. స్వప్న సినిమా బ్యానర్‌లో హను రాఘవపూడి దర్శకత్వంలో, దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా ఓ సినిమా ఉంటుంది. దీంతోపాటు నందినిరెడ్డి మరో కథను తయారుచేస్తోంది. ఆ రెండు చిత్రాలు చేసే పనిలో ఉన్నాం.
‘మహానటి’ తర్వాత మీ సంస్థలో వచ్చిన మార్పులేంటి?

అంతకుముందు మేం స్వప్న సినిమా పేరుతో చిన్న సినిమాలు తీయడం మొదలుపెట్టాం. ‘ఎవడే సుబ్రహ్మణ్యం?’ మాకు టర్నింగ్‌ పాయింట్‌. మా అమ్మాయిలు స్వప్న, ప్రియాంక హాలీవుడ్, బాలీవుడ్‌లో ఏం చేస్తున్నారో నిరంతరం తెలుసుకుంటారు. ట్రెండ్‌ ఎలా ఉందని వాళ్లని అడిగి తెలుసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. వాళ్లు వచ్చిన తర్వాతా నేను చాలా రిలాక్స్‌గా ఉన్నాను. మహానటి సినిమా రూ.12 కోట్లలో అయిపోతుందన్నారు. ఆ బడ్జెట్‌లో సినిమా తీస్తే అది డాక్యుమెంటరీగానే మిగిలిపోతుంది తప్ప సినిమాగా తీయలేరని చెప్పా. ‘ఎవడే..’ తర్వాత నాగ్‌ అశ్విన్‌పై పూర్తి విశ్వాసం కలిగింది. తను తీస్తున్నాడు కాబట్టి ‘బడ్జెట్‌ ఎక్కువైనా ఫర్వాలేదు. గ్రాఫిక్స్, సెట్స్‌కు ఖర్చుపెట్టండ’ని చెప్పా. అలా సినిమాకు రూ.22 కోట్లు ఖర్చుపెట్టినా తగిన ఫలితం వచ్చింది.
వైజయంతీ మూవీస్‌ సంస్థ 50 ఏళ్లకి చేరువవుతున్న క్రమంలో ప్రభాస్‌తో సినిమాని ప్రకటించారు. అదెలా ఉండబోతుంది?

నిజానికి ప్రభాస్‌ని మా సంస్థ నుంచే పరిచయం చేయాలనుకున్నా కుదరలేదు. ఈలోగా దేశంలో అగ్ర హీరో అయ్యాడు. ‘బాహుబలి’ చూశాక ప్రభాస్‌తో తప్పక సినిమా చేయాలని ఉండేది. ‘మహానటి’ తర్వాత నాగ్‌ అశ్విన్‌ ఎలాంటి కథ చెబుతాడోనని ఎదురుచూశా. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు చూసే కథను ప్రభాస్‌కు రాశాడు. ఆ కథ విని ఆశ్చర్యపోయా. వందల కోట్ల ప్రాజెక్టు ఇది. ప్రభాస్‌ అయితేనే ఆ ప్రాజెక్టు వర్కవుట్‌ అవుతుందని నాగ్‌ అశ్విన్‌ అడిగాడు. కథ వినగానే ప్రభాస్‌ ఓకే చెప్పాడు. నాగ్‌ అశ్విన్‌- ప్రభాస్‌ కలయికలో సినిమాను 2020 అక్టోబర్‌లో మొదలుపెట్టి 2022 ఏప్రిల్‌లోపు విడుదలకు సన్నాహాలు చేశాం.

సినిమా చిత్రీకరణలో మీకు మరిచిపోలేని సంఘటనలేమైనా ఉన్నాయా?

‘జగదేక వీరుడు..’ విజయంలో కథతోపాటు సంగీతానికి చాలా ప్రాధాన్యత ఉంది. ఇళయరాజా సినిమాకు ముందే పాటలను సూపర్‌ హిట్‌ పాటలుగా మలిచి ఇచ్చారు. అందాలలో అహో మహోదయం, అబ్బనీ తీయని దెబ్బ, ప్రియతమా ప్రియతమా ట్యూన్స్‌ ఓకే చేసిన తర్వాత చిరంజీవికి ఒక సందేహం కలిగింది. అన్ని మెలొడీస్‌ అయిపోతున్నాయి. మాస్‌ పాట లేకుంటే అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తారేమో అన్నారు. అప్పుడు నేను అబ్బనీ తీయని దెబ్బ ట్యూన్‌ ఎట్టి పరిస్థితుల్లో మార్చవద్దని కోరాను. ఇళయారాజా గారికి రెండోసారి ట్యూన్‌ ఇవ్వడం ఇష్టం ఉండదు. ఈ విషయాన్ని వేటూరిగారికి చెబితే అదే ట్యూన్‌ను బ్రహ్మాండమైన మాస్‌ సాంగ్‌ చేస్తానని చెప్పారు. అలాగే ఇచ్చారు. ఆ పాట సంచలనమైంది. అంత పెద్ద హిట్‌ సాంగ్‌ను రాఘవేంద్రరావు రెండు రోజుల్లోనే చిత్రీకరించారు. ఇలా మరిచిపోలేని సంఘటనలెన్నో ఈ సినిమా వెనక ఉన్నాయి.


చిరంజీవితో ‘జగదేక వీరుని కథ’లాంటి ఫాంటసీ సినిమా తీయాలని ఉండేది. నేను ప్రేమగా ‘బావ’ అని పిలుచుకునే కె.రాఘవేంద్రరావు మాత్రమే అలాంటి సినిమా తీస్తారని నా నమ్మకం. తొలిసారి మా కలయికలో ‘అడవిసింహాలు’ వచ్చింది. అగ్నిపర్వతం, ఆఖరిపోరాటం, జగదేకవీరుడు అతిలోక సుందరి’ ఇలా చాలా వచ్చాయి’’

మా దేవకన్య లేకపోవడం నా మనస్సును కలిచివేస్తుంటుంది. శ్రీదేవి చనిపోయాక ఆవిడను చూడటానికి చిరంజీవి, నేను ముంబయి వెళ్లాం. ఆవిడను నిజంగానే దేవకన్యలాగా అలంకరించారు. అప్పుడు నాకు ‘దేవకన్య ఇంద్రజ.. తన పనులన్ని పూర్తి చేసుకొని తండ్రి ఇంద్రుడి దగ్గరికి వెళ్లిపోయింది’ అనిపించింది’’.
Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.