ఇప్పుడు డబ్బు విలువ తెలుసు... జగపతిబాబు
‘పెద్దరికం’లో పిరికి ప్రేమికుడు అతడే..
‘మావిచిగురు’లో బాధ్యతాయుతమైన భర్తా అతడే..
‘అంతఃపురం’లో మొరటుగా కనిపించే రౌడీ అతడే..
‘శ్రీమంతుడు’లో సున్నితంగా కనిపించే తండ్రీ అతడే..
‘లెజెండ్‌’లో కరడుగట్టిన గూండా అతడే..
జగపతిబాబు ఎంతటి విలక్షణ నటుడో చెప్పడానికి కొన్ని ఉదాహరణలివి!

article image
కథానాయకుడిగా.. సహాయ నటుడిగా.. ప్రతినాయకుడిగా.. ఎన్నెన్నో విభిన్న పాత్రలతో తెలుగు తెరపై తనదైన ముద్ర వేసిన జగపతి వ్యక్తిగానూ విభిన్నమే! మాటలకు ముసుగు తొడగకుండా మాట్లాడినా.. కులం గురించి తూటాల్లాంటి మాటలు పేల్చినా.. కూతురికి ఒక విదేశీయుడితో పెళ్లి చేసినా.. ఇలా ఆయన ఏం చేసినా విలక్షణమే! ఒక దశలో కథానాయకుడిగా అవకాశాలు తగ్గి, ఆర్థికంగానూ దెబ్బ తిని.. మళ్లీ గొప్పగా పుంజుకున్నారు. ‘రంగస్థలం’లో ప్రెసిడెంట్‌గా మెప్పించాడు. దక్షిణాదిన అత్యంత డిమాండున్న నటుల్లో ఒకరిగా ఎదిగిన జగపతిబాబు.. ‘హాయ్‌’తో తన అంతరంగాన్ని ఆవిష్కరించారు.

టీనేజ్‌లో ఒకర్ని ప్రేమించాను
టీనేజ్‌లో ప్రేమించాను. ఆ అమ్మాయిని తీసుకొచ్చి అమ్మకు పరిచయం చేశాను. అమ్మ వద్దని చెప్పింది. ‘నా కలలు కూలిపోయాయి. అన్నీ కోల్పోయాను’ అనుకున్నాను. తర్వాత తెలిసింది. నేను ఆ అమ్మాయిని చేసుకోకపోవడం ఎంతో మంచిదైందని. ప్రేమించిన యువత తల్లిదండ్రుల మాటల్ని గౌరవించాలి. మన మేలు వారి కంటే ఇంకెవరూ కోరుకుంటారు. ఒక్కోసారి వాళ్లది తప్పనిపిస్తే... వారితో చర్చించి నిర్ణయం తీసుకోవాలి. అంతేగాని ప్రేమ విఫలమైందని చావడం, చంపడం చేయకూడదు. ఆరోజు నేను ఏదైనా చేసి ఉంటే... ఈరోజు ఇలా మీముందుండే వాణ్ని కాదు.

− ‘రంగస్థలం’లో తక్కువ మాటలతో విలనిజం పండించారు? ఎలాంటి ప్రశంసలొస్తున్నాయి?
సాధారణంగా సుకుమార్‌ ఎప్పుడూ కథ మొత్తం చెప్పేవారు. ఈ చిత్రానికి సంబంధించి నా దగ్గరకొచ్చినప్పుడు ‘చొక్కాలేకుండా ప్రెసిడెంట్‌ పాలు పితుకుతుంటాడు... భలే ఉంటుంది... సర్‌.. భలే ఉంటుంది’ అంటూ చెప్పడం మొదలు పెట్టాడు. సుక్కూ నాకు కథ అవసరం లేదు. పాత్ర గురించి చెప్పనవసరం లేదు. డేట్స్‌ చెప్పుచాలు అన్నాను. అలా ఈ సినిమా ఓకే అయింది. సుక్కుమీద నమ్మకం అలాంటిది. మాటలు లేకుండా గంభీరతను, క్రూరత్వాన్ని చూపించడం ఈ పాత్రలో గొప్పదనం. ‘లెజెండ్‌’ తర్వాత నా నటనను మరోస్థాయికి తీసుకెళ్లిన చిత్రమిది. ‘నాన్నకు ప్రేమతో...’లో ఓ రకంగా పేరొస్తే... ఇది మరోరకంగా నన్ను నిలబెట్టింది. సినిమాలో రామ్‌చరణ్‌ అద్భుతంగా నటించారు. సమంతా, అనసూయతో పాటు అందరి పాత్రలు పండాయి. ఈ క్రెడిట్‌ మొత్తం సుకుమార్‌దే.

షారుఖ్‌ అన్న ఆ మాట..
‘అంతఃపురం’ సినిమాలో నేను చేసిన పాత్రను హిందీ రీమేక్‌లో షారుఖ్‌ ఖాన్‌ చేశాడు. ఆ పాత్ర పనైపోయే చివరి సీన్లో నాలాగా హావభావాలు పలికించలేక ఇబ్బంది పడిపోయాడట. ‘ఎంతచేసినా వాడిలా చేయలేకపోతున్నా’నని నన్ను ఉద్దేశించి అన్నాడట. ఈ విషయం తర్వాత కృష్ణవంశీ నాకు చెప్పాడు. షారుఖ్‌ లాంటి మేటి నటుడు నా గురించి అలా అనడం చాలా సంతోషం కలిగించింది. గొప్పగా అనిపించింది.

ఆరోగ్య రహస్యం
రోజూ యోగా చేస్తాను. బాడీబిల్డింగ్‌ లాంటివి చేయను. ఆయుర్వేదం ప్రకారం ఆహారం తీసుకుంటాను. నా శరీరానికి ఏం పడతాయో డాక్డర్‌ చెబుతారు. చెప్పిన ప్రకారం నడుచుకుంటాను. అప్పుడప్పుడు ఫంక్షనల్‌ ట్రైనింగ్‌ తీసుకుంటాను. దీనివల్ల శరీరం సరైన స్థితిలో ఉంటుంది.

ఆ రెండూ ఆడవని ముందే తెలుసు
నేను చేసిన మంచి సినిమాల్లో ‘హితుడు’ ఒకటి. అయితే ఆ సినిమా ఆడదని ముందే తెలుసు. అలాంటి సినిమాలు ఆడే అవకాశాలు చాలా తక్కువ. పైగా అప్పటికి నాకు మార్కెట్‌ లేదు. సరిగా పబ్లిసిటీ చేయలేదు. కాకపోతే ఒక మంచి సినిమా చేశానన్న తృప్తి మాత్రం మిగిలింది. ఇక నేను విలన్, క్యారెక్టర్‌ పాత్రల్లోకి మారాక మళ్లీ హీరోగా నటించిన ‘పటేల్‌ సర్‌’ విషయంలోనూ సందేహాలున్నాయి. అది చెడ్డ సినిమా కాదు. మంచి కథతోనే తీశాం. నటుడిగా నాకు క్రేజ్‌ వచ్చినప్పటికీ హీరోగా మార్కెట్‌ పెద్దగా లేదనే అనుకున్నా. అందుకే నిర్మాత సాయి దగ్గర సినిమా పెద్దగా ఆడదేమో అని సందేహం వ్యక్తం చేశా. ఆ సినిమా విషయంలో మేం చేసిన పెద్ద తప్పు హింసాత్మకంగా టీజర్‌ రిలీజ్‌ చేయడం. అది జనాల్ని తప్పుదోవ పట్టించింది. టీజర్‌ చూసి జనాలు యాక్షన్‌ థ్రిల్లర్‌ అనుకున్నారు. కానీ మేం ఫ్యామిలీ డ్రామా చూపించాం.

− కథానాయకుడు, సహాయ నటుడు, విలన్‌... వీటిల్లో ఏ పాత్రంటే మీకిష్టం?
నాకు నటన అంటే ఇష్టం. నేను ఎప్పుడైనా పాత్రనే ఇష్టపడతాను. దానికి వందశాతం న్యాయం చేశానా? లేదా? అని ఆలోచిస్తాను. నేను హీరోగా చేసేటప్పుడు సైతం నా పాత్రకు ప్రాధాన్యం ఉండాలని అనుకోలేదు. మహిళా ప్రాధాన్యమున్న సినిమాల్లో చేశాను. ప్రస్తుతం అన్ని రకాల పాత్రలు చేస్తున్నాను. హీరోగా ఉన్నపుడు అవకాశం రాని గొప్ప దర్శకులు, హీరోలతో ఇప్పుడు పనిచేస్తున్నాను. వివిధ భాషల్లో నటిస్తున్నాను.

− మీరు చేయాలనుకునే పాత్ర?
అలాంటి కలల పాత్ర అంటూ ఏమీ లేదు. సినిమాల్లో ఎన్నో పాత్రలు చేశాను. ఒక సీరియల్‌ (కన్యాకుమారి కా కహానీ)లోనూ నటించాను. ఇది చాలా మందికి తెలియదు. ఏం చేసినా మూసధోరణిలో ఉండకూడదనేది నా అభిప్రాయం. ఛాలెంజింగ్‌గా ఉండాలి. లేకపోతే నాకు నేనే బోర్‌ కొట్టేస్తాను. రెండోఇన్నింగ్స్‌లో నాకు ఎక్కువగా స్టైలిష్‌ విలన్‌.. ధనవంతుడైన తండ్రి పాత్రలే ఇస్తున్నారు. అవి బోర్‌ కొట్టేశాయి. కొత్త పాత్రలు కావాలి.

− ఒకప్పుడు ఆర్థికంగా దెబ్బతిన్నారు. దానికి మీ అలవాట్లే కారణమంటారు. ఇందులో నిజమెంత?
నా అలవాట్ల వల్లే నష్టపోలేదు. దానికి అనేక కారణాలున్నాయి. చాలా మందికి డబ్బులిచ్చాను. వాళ్లు మోసం చేశారు. అంటే నేను మోసపోయాను కాబట్టి నాదే తప్పు. ‘సినిమా వల్ల దెబ్బతిన్నాను’ అన్న వాళ్లను ఆర్థికంగా ఆదుకున్నాను. ఇలా అనేక కారణాల వల్ల దెబ్బ తిన్నాను. అయితే అందరూ అనుకుంటున్నట్లు క్యాసినోలకు వెళ్లడం వల్ల నేను కోట్లేమీ నష్టపోలేదు.

− ప్రస్తుతం జాగ్రత్త పడుతున్నారా?
సంపాదించేది ఖర్చు పెట్టడానికి... ఆనందంగా ఉండటానికే అనేది నా సిద్ధాంతం. అప్పుడూ, ఇప్పుడూ నేనింతే. కాకపోతే గతంలో డబ్బు విలువ తెలుసుకోకుండా ఖర్చు చేసేవాణ్ని. ఇప్పుడు తెలుసుకొని ఖర్చు పెడుతున్నాను. నిజానికి నేను జాగ్రత్త పరుడినే. జనాలు అదే అంటుంటారు. నేను మధ్యలో ఆర్థిక ఇబ్బందుల్లో పడటం మంచికే అయింది. ఆ స్థితి ఎదురవడం వల్లే మళ్లీ మంచి స్థితికి చేరుకున్నా.

− సినిమాల్లో వారసులు బాగా పెరిగిపోయారు? కొత్త వారికి అవకాశాలు రావడం లేదనే మాటలు వినిపిస్తుంటాయి. దీనిపై మీ అభిప్రాయం?
వారసులు వస్తున్నారు. వస్తుంటారు. అంతమాత్రాన కొత్త వారికి అవకాశాలు లేకుండా ఎలా పోతాయి? నాని, శర్వానంద్, విజయ్‌దేవరకొండ... వీళ్లంతా ఏ వారసత్వం లేకుండా వచ్చిన వాళ్లే కదా!. ఇక్కడ ప్రతిభకే అవకాశాలొస్తాయి. కష్టపడిన వారికే ఫలితముంటుంది. అంతేగానీ వారసొలొచ్చినంత మాత్రాన ప్రేక్షకులు ఆదరిస్తారని కాదు... అలా వచ్చిన వారు ఎంతో మంది విఫలమై వెళ్లిపోయారు కదా?

− ‘బాహుబలి’ లాంటి సినిమా చూసినపుడు ఇందులో నేనెందుకు నటించలేదని అనుకున్నారా?
నాకు అలాంటి బాధ ఎప్పుడూ లేదు. ‘బాహుబలి’ చూస్తున్నపుడు అంతే. ఒక పాత్రకు మనం సరిపోతాం అంటే అదే మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. ‘బాహుబలి’లో నేను చేయకపోవడానికి సరైన కారణం ఉందనే అనుకుంటున్నా. రాజమౌళి గొప్ప దర్శకుడు. వ్యక్తిగానూ ఆయన చాలా ఇష్టం. వాళ్ల కుటుంబం అంటే చాలా గౌరవం. ఎవరిలోనూ అహం కనిపించదు. నిజాయితీగా ఉంటారు. సినిమా అంటే విపరీతమైన ప్రేమ, తపన కనిపిస్తుంది వాళ్లందరిలోనూ. అందుకే వాళ్ల నుంచి అంత గొప్ప సినిమాలు వస్తున్నాయి. ఇక రాజమౌళి దర్శకత్వంలో నేను నటించడం అంటే.. నాకు సరిపోయే పాత్ర ఉంటే ఆయనే పిలుస్తారు. నేను ఏ దర్శకుడినీ నాతో సినిమా చేయమని అడగను. ‘గాయం’ కంటే ముందు రాంగోపాల్‌ వర్మతో నాకెంతో స్నేహం ఉన్నప్పటికీ సినిమా చేయమని అడగలేదు. ‘గాయం’ సినిమాకు నేను సరిపోతాననిపించి ఆయనే నన్ను అడిగారు. నేను అడిగి, నాతో అతను సినిమా చేస్తే అతడి మీద నాకు సదభిప్రాయం ఉండేది కాదు.

− సినీ రంగంలో అమ్మాయిలపై లైంగిక వేధింపుల గురించి ఇటీవల పెద్ద చర్చ జరిగింది. దీనిపై మీ అభిప్రాయమేంటి?
ఏ రంగంలో అయినా ఇలాంటివి జరుగుతుంటాయి. సినీ రంగానికి గ్లామర్‌ ఎక్కువ కాబట్టి ఎక్కువ చర్చ జరుగుతోంది. ఎవరైనా క్లోజ్‌గా ఉంటేనే అవకాశాలిస్తాం అంటే.. కుదరదని అమ్మాయిలు గట్టిగా చెప్పాలి. నాకైతే సినీ రంగం సురక్షితం కాదనే అభిప్రాయం ఎంతమాత్రం లేదు. మా అమ్మాయిలు నటిస్తానంటే నిరభ్యంతరంగా చేసుకోమనేవాడిని. నిజానికి మా చిన్నమ్మాయి చదువుతో కుస్తీ పడుతుంటే.. ఎందుకమ్మా ఈ కష్టం, శుభ్రంగా సినిమాలు చేసుకోవచ్చు కదా అన్నాను. మా అమ్మాయిలకు సినిమాలపై ఆసక్తి లేదు.

− మంచి సినిమా కోసం పారితోషికం తగ్గిస్తారా?
పారితోషికం తగ్గించుకుంటా. అసలు డబ్బులే అడక్కుండా సినిమా చేస్తా. ప్రస్తుతం పారితోషికం గురించి ఆలోచించకుండా ఒక చిన్న సినిమా చేస్తున్నాను.
− మీ అమ్మాయికి విదేశీయుడితో వివాహం చేశారు. ఆ సమయంలో ఏమైనా సంఘర్షణ పడ్డారా?
ప్రేమ రెండు మనసులకు సంబంధించినది. రెండు కులాలు, మతాలు, రెండు సంస్కృతులకు సంబంధించి కాదు. ముఖ్యంగా నాకు కులం పట్టింపు అస్సలు లేదు. అందరూ ఈ విషయంలో ఇలాగే ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం. మనకు ఎవరైనా డబ్బు ఇచ్చారనుకోండి.. అప్పుడు వాళ్లు మన కులం కాదని తీసుకోకుండా ఉంటామా? పదవులిచ్చారనుకోండి... మన కులం కాదని వదిలేస్తామా? ఇంట్లో ఏదైనా రిపేర్‌ వచ్చింది. దాన్ని బాగు చేసేవాడు మన కులం వాడు కాదని వద్దంటామా? మరి కొన్ని చోట్ల కులం గురించి పట్టించుకొని, కొన్ని వదిలేయడం ఏమిటి? అంతా మన అవసరం. అసలు కులం, మతం లేని సమాజానికి అందరూ కృషి చేయాలని అంటాను. నిజానికి నా మీద కుల ప్రభావం ఎప్పుడూ లేదు. నేను పెరిగింది చెనై¬్నలో. తర్వాత హైదరాబాద్‌ వచ్చేశా. ఎక్కడా కులం గోల లేదు. పెళ్లిళ్లు, రాజకీయాల దగ్గర కులం, మతం పేరుతో మాట్లాడటం నాకు నచ్చదు. అంతెందుకు మా అమ్మ నా కూతురి విషయంలో భయపడింది. నేను నచ్చజెప్పాను. ఇప్పుడు వాళ్లిద్దరూ సంతోషంగా ఉన్నారు.

− స్నేహితుల ప్రేమకు సహకరించారా?
ఓ... చాలా. ఎంతో మందికి పెళ్లిళ్లు చేశాను. వాళ్ల తల్లిదండ్రుల నుంచి పెద్ద గొడవలేం రాలేదు కానీ, చిన్న పంచాయతీలతోనే సెట్‌ అయిపోయాయి.

− కళాశాల రోజుల్లో ఎలా ఉండేవారు?
డిగ్రీ చదివే రోజుల్లో మొదటి ఏడాది సైలెంటుగా ఉండేవాణ్ని. రెండు, మూడు సంవత్సరాల్లో చాలా గొడవలు జరిగేవి. గ్యాంగ్‌గా తిరిగేవాళ్లం. అప్పుడంతా అదో లోకం.

− హస్తరేఖా శాస్త్రం చదివారని విన్నాం..?
ఒకప్పుడు అన్నయ్య బాగా చదివేవారు. నాకూ ఆసక్తి పెరిగింది. చదివాను. ఎవరి చేతులూ చూసి జాతకం చెప్పనులెండి. అయితే జ్యోతిషాన్ని మాత్రం నమ్ముతాను.

− తెలుగులో పరభాషా నటులకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడంపై విమర్శలు వినిపిస్తుంటాయి. మీరేమంటారు?
నేను వేరే భాషల్లో నటిస్తూ మన సినిమాల్లో వేరే నటుల్ని తీసుకోవడం గురించి విమర్శించలేను. నాకు మలయాళం రాదు. అక్కడివాళ్లకు నేనెవరో తెలియదు. మోహన్‌లాల్‌తోనూ నాకు పరిచయం లేదు. కానీ నాకు పిలిచి ‘పులిమురుగన్‌’లో అవకాశమిచ్చారు. అక్కడి వాళ్లకు నేను డాడీ గిరిజానే. ఒక పాత్రకు సరిపోతారనిపిస్తే ఎక్కడి వాళ్లనైనా తీసుకురావచ్చు. ఐతే తెలుగు నటీనటుల్ని మనవాళ్లు కొంచెం తేలిగ్గా తీసుకోవడం మాత్రం వాస్తవం. వేరే భాషల ఆర్టిస్టుల్ని ప్రత్యేకంగా చూస్తారు. ప్రాధాన్యమిస్తారు. ఆ పరిస్థితి మారాలి.

− సినిమాల్లోకి రావడం వల్ల ఏమైనా కోల్పోయానని.. ఈ రంగంలోకి ఎందుకొచ్చానా అని బాధపడ్డారా?
ఏమాత్రం లేదు. సినిమాల్లోకి వచ్చి పేరు తెచ్చుకోవాలంటే అదృష్టముండాలి. కాబట్టి నా కెరీర్‌ విషయంలో ఎలాంటి చింతా లేదు. సినిమాల్లో ఉండటమంటే మనం విహారానికి వెళ్తే ఎదురు డబ్బులిచ్చినట్లుగా భావిస్తా. ఎవరైనా సినిమాలకు పని చేస్తూ చాలా కష్టపడిపోతున్నాం.. ఏంటీ బాధ అని అంటే కోపం వస్తుంది. అలాంటి వాళ్లు ఎందుకు కొనసాగాలి? ఈ రంగాన్ని వదిలేసి వెళ్లిపోవాలి.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.