మరో ‘కల్కి’ కూడా వస్తాడు..

జీవితరాజశేఖర్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘కల్కి’. ఆదాశర్మ, నందిత శ్వేత, స్కార్లెట్‌ కథానాయికలు. ప్రశాంత్‌ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. సి.కల్యాణ్‌ నిర్మాత. శివానీ, శివాత్మిక సమర్పిస్తున్నారు. సోమవారం రాజశేఖర్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో ‘కల్కి’ టీజర్‌ని విడుదల చేశారు. ఇదే వేడుకలోనే చిత్రబృందం రాజశేఖర్‌ పుట్టినరోజు పండగని జరిపింది. దర్శకుడు మాట్లాడుతూ ‘‘నేను చేసిన ‘అ!’ కంటే పది రెట్లు ఎక్కువ కష్టపడి సిద్ధం చేసిన కథ ఇది. ‘కల్కి’ శక్తిమంతమైన పేరు. ఎంతో మంది ఈ పేరుతో సినిమా చేయాలనుకొన్నారు. 1980 నేపథ్యంలో సాగే కథ కావడంతో ప్రతి విషయాన్ని ఎంతో స్పష్టంగా ఉండేలా తెరకెక్కిస్తున్నాం. నా తొలి సినిమా చూసి కొంతమంది అర్థం కాలేదన్నారు. ఇది అందరికీ అర్థమవుతుంది. రాజశేఖర్‌కి పుట్టినరోజు కానుకగా యాంగ్రీ స్టార్‌ అనే పేరును ఇచ్చాం. ‘కల్కి’కి కొనసాగింపుగా ‘కల్కి 2’ కూడా ఉంటుంది’’ అన్నారు. జీవిత మాట్లాడుతూ ‘‘మళ్లీ విజయాన్ని సాధిస్తామా లేదా? అనుకున్న రోజులు మా జీవితంలో ఉన్నాయి. అటువంటి సమయంలో ‘గరుడవేగ’తో ప్రవీణ సత్తారు మేజిక్‌ చేశారు. ప్రశాంత్‌ కథ సిద్ధం చేశాక దర్శకత్వం కూడా చేయడానికి ఒప్పుకోవడంతో తొలి విజయంగా భావించా. అప్పుడే కల్యాణ్‌ అన్నయ్య ఫోన్‌ చేసి, నేను సినిమా చేస్తానని ముందుకు రావడం సంతోషంగా అనిపించింద’’న్నారు. నిర్మాత మాట్లాడుతూ ‘‘విభిన్నమైన కాన్సెప్ట్‌తో రూపుదిద్దుకొంటున్న చిత్రమిది. పూర్తి బాధ్యతల్ని దర్శకుడు ప్రశాంత్‌ వర్మకే అప్పగించాం. ప్రశాంత్‌ కొత్తగా ఈ సినిమాని తీస్తున్నాడు. 1980 నేపథ్యంలో సాగే ఈ సినిమాతో రాజశేఖర్‌ తన వయసుని కూడా తగ్గించుకొంటున్నారు. మార్చి లేదా ఏప్రిల్‌ నెలలో సినిమా పూర్తవుతుంది. ‘శేషు’ తర్వాత రాజశేఖర్‌తో నేను చేస్తున్న సినిమా ఇది. లైట్లు కొనడానికి కూడా నా దగ్గర డబ్బులు లేని సమయంలో, ఓ తమిళ సినిమా రీమేక్‌ హక్కులు కొని నన్ను నిర్మాతని చేశారు రాజశేఖర్‌ దంపతులు. మా కుటుంబ సభ్యులతో కలిసి చేస్తున్న సినిమా ఇది’’ అన్నారు. రాజశేఖర్‌ మాట్లాడుతూ ‘‘గరుడవేగ’ తర్వాత ఆర్నెళ్లపాటు కథలకోసం అన్వేషించాం. ఏడో నెలలో ‘కల్కి’ కథ కుదిరింది. చాలా రోజుల తర్వాత సి.కల్యాణ్‌ నిర్మాణంలో సినిమా చేస్తున్నా. కథలో విషయం ఉంటేనే ఆయన సినిమా చేస్తారు. ‘గరుడవేగ’ చేస్తున్నప్పుడు ప్రవీణ్‌ సత్తారుతో పనిచేయడం ఎంత కొత్తగా అనిపించిందో, ప్రశాంత్‌తో కలిసి పనిచేస్తున్నప్పుడూ అదే అనుభవం. ఇంతకుముందు నన్ను యాంగ్రీ యంగ్‌మేన్‌ అనేవారు. వయసు పెరిగాక ఆ పేరు ఎలా మారుతుందో అనుకొనేవాణ్ని. కానీ ఈ చిత్రంతో ప్రశాంత్‌ యాంగ్రీ స్టార్‌గా మార్చేశార’’న్నారు. ఈ కార్యక్రమంలో శివానీ, శివాత్మికతో పాటు ఛాయాగ్రాహకుడు దాశరథి శివేంద్ర, నాగేంద్ర, బాలగోపాల్‌రావు, వెంకట్‌కుమార్‌ జెట్టి తదితరులు పాల్గొన్నారు.




Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.