హీరోలను ఆరాధించే పద్ధతి నచ్చదు
‘‘కథానాయకులను ఆరాధించే పద్ధతి తెలుగు చిత్ర పరిశ్రమలో కనిపించినంతగా మరే చిత్రసీమలోనూ కనిపించదు. తెలుగు తర్వాత తమిళ సినీప్రియుల్లోనూ ఈ తరహా ఆరాధాన భావాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఈ పద్ధతి నాకు అసలు నచ్చదు’’ అంటోంది కాజల్‌ అగర్వాల్‌. వెండితెరపై అడుగుపెట్టి దశాబ్దంన్నర దాటినా నేటికీ అంతే తరగని అందం, అభినయాలతో కుర్రనాయికలకు పోటీ ఇస్తూ వరుస విజయాలు ఖాతాలో వేసుకుంటోంది. కమల్‌ హాసన్, చిరంజీవి వంటి అగ్ర కథానాయకులతో ఆడిపాడుతూనే ‘సీత’, ‘ప్యారిస్‌ ప్యారిస్‌’ వంటి నాయిక ప్రాధాన్య చిత్రాలతోనూ సత్తా చాటుకుంటోంది. తాజాగా ఈ భామ ఓ ప్రముఖ టాక్‌షోలో మాట్లాడుతూ ఉత్తరాది, దక్షిణాది చిత్రసీమలకు మధ్య ఉన్న మంచి, చెడులేంటో తన అనుభవాల నుంచి చెప్పుకొచ్చింది.

* ‘‘తెలుగు చిత్ర పరిశ్రమలో సమయపాలన, క్రమశిక్షణ చాలా గొప్పగా ఉంటాయి. ఉదయం 6 గంటలకు సెట్స్‌లోకి అడుగుపెడితే 7కల్లా చిత్రీకరణ మొదలైపోతుంది. సాయంత్రం 6 గంటల కల్లా పేకప్‌ చెప్పెయ్యొచ్చు. కానీ, బాలీవుడ్‌లో ఇలాంటి పరిస్థితి కనిపించదు. అక్కడ షూటింగ్‌ ఉదయంకి మొదలు అంటే మధ్యాహ్నాం 12కి కానీ చిత్రీకరణ మొదలు కాదు. ఇక అది పూర్తయ్యే సరికి రాత్రి 12 దాటిపోతుంది. అందుకే ఇక్కడ పనిచేసి హిందీలో చేస్తుంటే చాలా ఇబ్బందిగానే అనిపిస్తుంటుంది. అంతేకాదు తెలుగు పరిశ్రమలో ప్రీ-ప్రొడక్షన్‌ పనులు సైతం చాలా పగడ్బందీగా అనుకున్న సమయాని కన్నా ముందుగానే పూర్తవుతుంటాయి’’.

* ‘‘తమిళ, మలయాళ చిత్రసీమలు టెక్నీషియన్స్‌ - కంటెంట్‌ విషయాల్లో చాలా ఉన్నతంగా కనిపిస్తుంటాయి. ఈ రెండు పరిశ్రమల్లోని నటీనటులు - సాంకేతిక నిపుణుల్లో ఎంతో గొప్ప ప్రతిభ దాగి ఉంటుంది. అంతేకాదు.. వాళ్లు మంచి కథా బలం ఉన్న చిత్రాలు తెరకెక్కించడంలో దేశంలోనే అందరి కన్నా ముందు వరుసలో ఉంటారు. ఇక వాళ్లు ఇతర నటీనటులతో మాట్లాడే తీరు కూడా ఎంతో గౌరవపూర్వకంగా ఉంటుంది. అయితే తెలుగు, తమిళ చిత్రసీమల్లో కనిపించే హీరో వర్‌షిప్‌ పద్ధతి నాకు అసలు నచ్చదు. హిందీలో ఇది అసలు కనిపించదు’’.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.