కల నిజమాయెగా
దర్శకుడిగా తొలి ప్రయత్నంలోనే విజయం అందుకొన్నారు కె.వి.గుహన్‌. ఛాయా గ్రాహకుడిగా విజయ వంతమైన పలు చిత్రాలకి పనిచేసిన ఆయన ‘118’తో దర్శకుడిగా మారారు. కల్యాణ్‌రామ్‌ కథానాయకుడిగా, మహేష్‌ ఎస్‌.కోనేరు నిర్మాణంలో రూపొందిన ఆ చిత్రం ఇటీవలే విడుదలైంది. ఈ సందర్భంగా కె.వి.గుహన్‌ బుధవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు.

‘‘ఇరవయ్యేళ్లుగా నేను కన్న కల దర్శకత్వం. ‘118’తో ఆ కల నెరవేరింది. సినిమా విడుదలైన తొలి రోజు ఎలా ఉంటుందో నాకు అనుభవం లేదు. ఉదయం లేవగానే ఒకొక్క సమీక్ష చూస్తున్నప్పుడు కళ్లల్లో నీళ్లొచ్చాయి. మామూలుగా నేను సెట్‌లో కొంచెం కోపంగా ఉంటానని చెబుతుంటారు. కానీ నాకు తెలియకుండానే కన్నీళ్లు రావడంతో నాలో ఈ కోణం కూడా ఉందా అనిపించింది (నవ్వుతూ). మా పాప పుట్టినప్పుడు ఎలా భావోద్వేగానికి గురయ్యానో, ‘118’ విడుదల రోజూ అలాంటి అనుభూతి కలిగింది. దర్శకత్వం చేయాలని ప్రతిసారీ ఏదో ఒక కథ రాసుకొంటాను. ఇంతలో ఏదో ఒక సినిమా కోసం ఛాయాగ్రాహకుడిగా పిలుస్తుంటారు. మంచి అవకాశం కదా అనుకుంటూ వెళ్తా. అలా మరో ఏడాది గడిచిపోతుంటుంది. ఎట్టకేలకి ఇన్నేళ్లకి నా కథని తెరపై చూసుకున్నా’’.

* ‘‘సినిమా మీద ఉన్న ప్రేమే నన్ను ఈ రంగంలోకి తీసుకొచ్చింది. నేను చూసిన సినిమాలే, నేను దర్శకుడు కావడానికి స్ఫూర్తి. ఛాయాగ్రాహకుడిగా ఉత్తమ దర్శకులతో కలసి సినిమా చేసే అవకాశం నాకు లభించింది. ఈ పదిహేనేళ్లలో త్రివిక్రమ్‌, శ్రీనువైట్ల, శ్రీకాంత్‌, రాధామోహన్‌ లాంటి దర్శకులతో పనిచేశా. ‘నా నువ్వే’ సమయంలో పీసీ శ్రీరామ్‌ సార్‌ దగ్గర మరోసారి సహాయకుడిగా పనిచేశా. అక్కడే తొలిసారి కల్యాణ్‌రామ్‌ని కలిశా. ‘అతనొక్కడే’ సినిమాతో పోలిస్తే భిన్నంగా కనిపించారు. దాంతో నేను మొదట గుర్తు పట్టలేదు. మరుసటి రోజు నుంచి ఆయనతో మాట్లాడుతూనే ఉన్నాను. ఆయనకి ఎలాంటి సినిమాలు ఇష్టమో తెలిసింది. నాక్కొన్ని ఆలోచనలు ఉన్నాయని చెప్పా. కెమెరామెన్‌గా నామీద ఉన్న గౌరవంతో కొద్దిసేపు వింటారనుకొన్నా. కానీ రెండు గంటలు నేను చెప్పిన కథ వింటూనే ఉన్నారు. సినిమా చూస్తున్నట్టే ఉందని చేయడానికి ఒప్పుకొన్నారు. మరో వారంలో ‘118’ పనులతో బిజీ అయిపోయా. ఈ సినిమా అంతా ఒక మేజిక్‌లా జరిగిపోయింది’’.


* ‘‘నా నిజ జీవితంలో జరిగిన సంఘటనలతో రూపొందించిన చిత్రమిది. గదిలో ఒంటరిగా గడపడమంటే నాకు భయం. కానీ చిత్రీకరణల కోసం ఎక్కడికెక్కడికో వెళ్లాల్సొస్తుంది. ఒక రోజు ఒక హోటల్‌ గదిలో పడుకొన్నప్పుడు కల వచ్చింది. అందులో ఒక అమ్మాయి ఇబ్బందుల్లో ఉంటుంది. ఆ ఇబ్బందులకి నేనే కారణంగా మారి, ఒక నేరం చేస్తాను. ఆ తర్వాత ఇదంతా బయట ప్రపంచానికి తెలిస్తే నా పరిస్థితి ఏంటి? నా కెరీర్‌ ఏం కావాలి? అని భయపడిపోతుంటా. ఇంతలో మెలకువ వచ్చి, ‘ఇదంతా కలే కదా’ అని ఊపిరి పీల్చుకున్నా. మళ్లీ కొన్నాళ్లకి ఒక హోటల్‌ గదిలో పడుకొన్నప్పుడు మరో కల. ‘ఒక నేరం జరిగింది, అందులో నీపైన కూడా సందేహాలున్నాయి. ఒకసారి వచ్చి వెళ్లండి’ అంటూ సీబీఐ అధికార్ల నుంచి ఫోన్‌ వస్తుంది. అప్పట్లో నేరం చేసింది నేనే కదా, ఇప్పుడు సీబీఐ విచారణలో దొరికిపోతానేమో అని భయం నాలో. ఒళ్లంతా చెమటలు. ఆ భయంలోనే మెలకువ వచ్చింది. మళ్లీ ‘హమ్మయ్యా... ఇది కలే కదా’ అని పడుకున్నా. కానీ ఆ రెండు కలలు వచ్చింది ఒకే గదిలోనే అన్న విషయం ఆ తర్వాత అర్థమైంది. మళ్లీ మూడోసారి పడుకొంటే ఎలాంటి కల వచ్చేదో తెలియదు కానీ నేను ధైర్యం చేయలేదు. అమెరికాలో ఉన్న నా స్నేహితుడికి తన ఆఫీసు పరంగా కొన్ని సమస్యలు ఎదురైతే, దానికి పరిష్కారం కలలో లభించిందట. అలా ఈ అంశాలన్నింటినీ ఆధారంగా చేసుకొని ‘118’ తెరకెక్కించా. చూసినవాళ్లంతా సినిమా బాగుందని మెచ్చుకుంటుంటే ఆనందంగా ఉంది. కల్యాణ్‌రామ్‌ నిబద్ధత కలిగిన నటుడు. ఆయన సెట్‌లో మెలిగే విధానం చాలా బాగుంటుంది. నిర్మాత మహేష్‌ ఎస్‌.కోనేరు మంచి పాఠకుడు. దాంతో ఆయనకు ఈ కథని చెప్పినప్పుడు మరింత బాగా అర్థం చేసుకున్నారు’’.

* ‘‘ఛాయాగ్రాహణం కష్టమా? లేక దర్శకత్వం కష్టమా అని ఇప్పుడడిగితే దర్శకత్వమే అని చెబుతా. రోజూ సెట్‌లో వందల మంది అడిగే ప్రశ్నలకి సృజనాత్మకంగా సమాధానాలు ఇస్తూ నడపాల్సిన బాధ్యత దర్శకుడిది. దర్శకుడిగాపనిచేస్తున్నప్పుడు 80 శాతం మెదడుని వాడుతున్నట్లు అనిపించింది. ఈ సినిమాకి ఛాయా గ్రాహకుడిని కూడా నేనే కాబట్టి, దర్శకుడి సమస్యలు మరింత బాగా అర్థమయ్యాయి. ఈ సినిమాని ఇతర భాషల్లో రీమేక్‌ చేయడానికి సిద్ధమే. చేసిన పనే చేసినట్టు అనిపించినా సరే ప్రతిసారీ మరింత ఉత్తమంగా తీయొచ్చు కదా అనిపిస్తుంది. తెలుగులో దర్శకుడిగానే కొనసాగాలనుకొంటున్నా. కొన్ని కొత్త కథాలోచనలపై దృష్టిపెట్టా. తమిళంలో మా తమ్ముడు శరణ్‌ తెరకెక్కిస్తున్న చిత్రానికి ఛాయాగ్రాహకుడిగా పనిచేస్తున్నా’’.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.