ఆ విరామానికి కారణం.. ‘ఆటో ఇమ్సినో’ వ్యాధి!!
చూస్తుండగానే పదేళ్ల కెరీర్‌ పూర్తి చేసుకుని, యాభై చిత్రాల మైలు రాయిని అందేసుకుంది కాజల్‌. అటు సీనియర్‌ కథానాయకుతో నటిస్తూనే, ఇటు కొత్త కుర్రాళ్లతోనూ జోడీ కడుతోంది. బెల్లంకొండ శ్రీనివాస్‌తో వరుసగా రెండు సినిమాల్లో నటించింది. అందులో ఒకటి తేజ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం కాగా రెండోది ‘కవచం’. ఈ చిత్రం ఈవారంలోనే ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా కాజల్‌ మంగళవారం హైదరాబాద్‌లో విలేకరులతో ముచ్చటించింది.


* ఈ ఏడాది ఎలా గడిచింది?
- నేను ఆశించిన దానికంటే ఎక్కువ బాగుంది. నిజానికి 2018లో విరామం తీసుకుందామనుకున్నా. ఎందుకంటే ఆమధ్య నా ఆరోగ్యం సరిగా ఉండేది కాదు. అప్పటికీ మూడు నెలలు ఇంటిపట్టునే ఉండి పూర్తి స్థాయిలో విశ్రాంతి తీసుకున్నా. ఆరోగ్యంపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాల్సి వచ్చింది. చేతిలో ఉన్న సినిమాల్ని పూర్తి చేసి, మరో కొత్త సినిమా ఒప్పుకోకూడదనుకున్నా. కానీ కుదర్లేదు. మనం ఒకటి ఆలోచిస్తే విధి మరోలా ఆలోచిస్తుంది కదా? అందుకే వరుసగా సినిమాలొచ్చి పడ్డాయి. గతంలో ఎప్పుడూ లేనంత బిజీగా మారిపోయా. మరింత ఎక్కువ కష్టపడాల్సి వచ్చింది. అయితేనేం సంతోషంగానే పనిచేశా.

* మూడు నెలలు విశ్రాంతి తీసుకోవడానికి కారణం?
- ఆటో ఇమ్సినో అనే వ్యాధి వచ్చింది. అసలు అలాంటిది ఉందని నాక్కూడా తెలీదు. ప్రతి రాత్రి జ్వరం వచ్చేది. ఎందుకు వచ్చేదో అర్థమయ్యేది కాదు. శారీరకంగా, మానసికంగా అలసిపోయేదాన్ని. ఆరోగ్యానికి చాలా ప్రాధాన్యం ఇస్తా. నా జీవన విధానం ఓ క్రమపద్ధతిలో ఉంటుంది. యోగా, ధ్యానం ద్వారా అందులోంచి బయటపడగలిగా.

* ‘నేనే రాజు - నేనే మంత్రి’ మీ కెరీర్‌లో ఓ మలుపు అనుకోవచ్చా? అప్పటి నుంచే మీ జోరు మరింత పెరిగింది కదా?
- ఓరకంగా అది మలుపు అనుకోవచ్చు. అప్పటి వరకూ ‘డిఫరెంట్‌’ అనే పదానికి కొంచెం భయపడేదాన్ని. ఎక్కువగా కంఫర్ట్‌ జోన్‌లో ఉండడానికి ప్రయత్నించేదాన్ని. ఇప్పుడు అందులోంచి బయటపడడానికి ప్రయత్నిస్తున్నా. సవాళ్లు స్వీకరించడానికి, ప్రయోగాలు చేయడానికి ఇప్పుడిప్పుడే ఇష్టపడుతున్నా. ఇన్నేళ్ల ప్రయాణంలో ఎక్కడో ఓ చోట ఆలోచించడం మొదలెట్టాలి. ఇప్పుడు కూడా ఏమైపోతుందో అని భయపడితే ఎలా?


* ఫలితాలు ఎలా ఉన్నా ఫర్వాలేదు.. నా కెరీర్‌ ఏం కాదు అనే స్థితికి వచ్చేశారన్నమాట?

- అలా ఏం లేదు. ప్రతి శుక్రవారం ఓ భయం ఉంటుంది. నా సినిమా విడుదల అవుతుందంటే ఫలితం ఎలా ఉంటుందా? అని ఎదురుచూస్తుండేదాన్ని. ఇప్పుడు కాస్త మారాను. ప్రతి సినిమాకీ ‘ది బెస్ట్‌’ ఇవ్వడానికే ప్రయత్నించి ఆ తరవాత ఫలితాన్ని కాలానికి వదిలేస్తున్నా.

* ‘కవచం’లో మీ పాత్ర ఎలా ఉండబోతోంది?
- ప్రతిసారి కొత్త పాత్రే దొరకాలని లేదు. ఓ సినిమా ఒప్పుకున్నామంటే అందుకు చాలా కారణాలు ఉండొచ్చు. ‘కవచం’ విషయానికొస్తే నా పాత్ర కంటే, కథా నేపథ్యం కొత్తగా అనిపించింది. థ్రిల్లర్‌ కథల్ని నేనింత వరకూ చేయలేదు. దానికి తోడు నాకెప్పుడూ కొత్త దర్శకులతో పనిచేయాలని ఉంటుంది. ‘కచవం’ స్క్రీన్‌ప్లే బాగుంటుంది. సీటు అంచున కూర్చోబెట్టే సన్నివేశాలున్నాయి. విశ్రాంతి తరవాత వచ్చే మలుపులు ఆశ్చర్యపరుస్తాయి. ఇవన్నీ నచ్చే ఈ కథ ఒప్పుకున్నా.

* ఇందులో ఇద్దరు కథానాయికలున్నారు. కథానాయకుడు ఎవరిని ‘కవచం’లా రక్షిస్తాడు?

- అది తెలియాలంటే సినిమా చూడాలి. కథలో కీలకమైన అంశం అది. ఇప్పుడే చెప్పేస్తే కిక్‌ ఉండదు.

* అగ్ర కథానాయకులతో పనిచేసిన మీరు ఇప్పుడు యువ కథానాయకులతో జట్టు కడుతున్నారు. ప్రత్యేకమైన కారణాలున్నాయా?
- ఇదేదో ప్రణాళికలు వేసుకుని చేసింది కాదు. అలా జరిగిపోయింది. ఎవరితో కలసి నటిస్తున్నా అనేదానికంటే ఎలాంటి పాత్రలు ఎంచుకుంటున్నా? ఎలాంటి సినిమాల్లో కనిపిస్తున్నా అనేదే నాకు ముఖ్యం. కెరీర్‌లో సమతుల్యం పాటించడం అవసరం. కొన్ని సినిమాల్ని కమర్షియాలిటీ కోసం చేయాలి. ఇంకొన్ని నా కోసం చేయాలి. నా పాత్ర బలంగా ఉంటే తప్పకుండా ఎవరితో అయినా నటిస్తా. ‘కవచం’లో అన్ని పాత్రలూ బాగుంటాయి. ప్రతి పాత్రకూ సమప్రాధాన్యం ఉంది.


* ఇప్పటికీ నవతరం కథానాయికలకు పోటీ ఇస్తున్నారు. ఆ రహస్యం ఏంటి?
- రహస్యాలేం లేవు. మనం పడే కష్టమే పరిశ్రమలో మన స్థానాన్ని నిర్ణయిస్తుంది. ఎంత అభిరుచితో పనిచేస్తున్నాం? ఎంత అంకితభావంతో ఉంటున్నాం? అనేదే ముఖ్యం. సినిమాల్లోనే కాదు, అన్ని రంగాల్లోనూ ఇది వర్తిస్తుంది.

* బెల్లంకొండ శ్రీనివాస్‌తో వరుసగా రెండు సినిమాలు చేస్తున్నారు. తనలో గమనించిన విషయమేంటి?
- అతని ఉత్సాహం నన్ను కట్టిపడేస్తోంది. సెట్లో చాలా కష్టపడతాడు. తనని తాను నిరూపించుకోవాలన్న పట్టుదల ఉంటుంది. నాన్న పేరు వాడుకుని ఎదగాలని చూడడు. ఆ లక్షణాలు నాకు బాగా నచ్చాయి. ఓ విధంగా తను నాలా ఉంటాడు. నాలానే ఆలోచిస్తాడు.

* 2018లో చాలామంది కథానాయికలు పెళ్లిళ్లు చేసేసుకున్నారు. మరి మీ మాటేంటి?
- నా పెళ్లి గురించి మా ఇంట్లోవాళ్లకంటే మీడియాకే ఎక్కువ ఆసక్తి ఉన్నట్టు కనిపిస్తోంది (నవ్వుతూ). 2018 పెళ్లిళ్ల సీజన్‌ అయిపోయింది. ఓ దశలో నా మనసు కూడా పెళ్లివైపు మళ్లింది. కానీ దానికి ఇంకా సయమం ఉంది.

* ‘భారతీయుడు 2’లో నటిస్తున్నార్ట కదా?

- అవును. కమల్‌హాసన్‌తో నటించడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా గురించిన పూర్తి వివరాలు త్వరలో చెబుతా.


* నాలుగు భాషల్లోనూ నాతో తీయాలనుకున్నారు..

‘‘క్వీన్‌ రీమేక్‌ పనులు పూర్తయ్యాయి. ఎప్పుడో ఆ సినిమా చూసి ఐదేళ్లయ్యింది. ముందు నాలుగు భాషల్లోనూ నన్నే కథానాయికగా తీసుకుందామనుకున్నారు. ఆ తరవాత తెలుగు, తమిళ భాషల్లో నాతో రీమేక్‌ చేద్దామనుకున్నారు. చివరికి తమిళ రీమేక్‌లో తీసుకున్నారు. ఓ విధంగా నాక్కూడా అదే మంచిదనిపించింది. ఓ కథని నాలుగు భాషల్లో, నలుగురు కథానాయిలతో తెరకెక్కించడం ఇదే తొలిసారి. ‘క్వీన్‌’గా కంగనా చాలా సహజంగా నటించింది. అమాయకంగా అందంగా కనిపించింది. ఆ లక్షణాలు నా పాత్రలోనూ ప్రతిబింబించాలన్న తపనతో పనిచేశా. తమిళ వాతావరణానికి, అభిరుచులకు తగ్గట్టుగా కొన్ని మార్పులు చేశాం’’

* ఆ పిల్లల పిలుపుకు ఉద్వేగానికి లోనవుతుంటా!

‘‘తిరిగి ఇవ్వడంలో ఓ సంతృప్తి ఉంటుంది. అది ఏ రూపంలో అయినా కావొచ్చు. నేనైతే గిరిజన విద్యపై దృష్టి పెట్టాను. అరకులో ఓ పాఠశాలని నిర్వహిస్తున్నాను. అక్కడ పాఠాలు చెప్పే విధానం కొత్తగా ఉంటుంది. మధ్యాహ్న భోజనం అందిస్తున్నాం. మరుగుదొడ్ల నిర్మాణం కూడా జరిగింది. అరకు అంటే చాలా ఇష్టం. షూటింగ్‌ నిమిత్తం చాలాసార్లు వెళ్లా. కొంతమంది గిరిజనులతో మాట్లాడా. ఆ సమయంలోనే స్కూలు ఆలోచన వచ్చింది. అందుకోసం విరాళాలు కూడా సేకరించా. అలా వచ్చిన డబ్బు సవ్యంగా ఖర్చు పెడుతున్నారా లేదా? అనేది ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నా. అరకు వెళ్లి స్కూలు నిర్వహణ చూసుకునే తీరిక దొరకడం లేదు. కానీ మా టీమ్‌ ఎప్పటికప్పుడు వీడియోలు, ఫొటోలూ పంపుతుంటారు. ‘కాజల్‌ అక్కా.. కాజల్‌ అక్కా’ అని పిల్లలు పిలుస్తుంటే... చాలా సంతోషంగా, ఎంతో ఉద్వేగంగా ఉంటోంది’’


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.