దాని కోసం చాలా కష్టపడ్డా!

‘‘మహానటి’ చిత్రం నటిగా నాపై మరింత బాధ్యతను పెంచింది. దాన్ని అలా జాగ్రత్తగా కాపాడుకుంటూ ముందుకెళ్లడం సవాల్‌తో కూడుకున్న పనే’’ అంటోంది కీర్తి సురేష్‌. ఆమె ప్రధాన పాత్రలో రాబోతున్న కొత్త చిత్రం ‘మిస్‌ ఇండియా’. నరేంద్రనాథ్‌ దర్శకత్వంలో మహేష్‌ ఎస్‌.కోనేరు నిర్మించారు. ఈ నెల 4న ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో సోమవారం ఆన్‌లైన్‌ ద్వారా మీడియాతో ముచ్చటించింది కీర్తి. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే..

మహానటి’ తర్వాత ఒప్పుకున్న తొలి కథ

‘‘మహానటి’ తర్వాత నేను ఒప్పుకున్న తొలి చిత్రమిది. నేనిందులో సంయుక్త అనే పాత్రలో కనిపిస్తా. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి.. ఓ గొప్ప వ్యాపారవేత్తగా ఎదగాలనుకుంటుంది. ఈ క్రమంలోనే కాఫీకి ఆదరణ ఎక్కువ ఉండే అమెరికాలో ‘టీ’ని ఓ బ్రాండ్‌గా నిలబెట్టే ప్రయత్నం చేస్తుంది. ఈ ప్రయాణంలో ఆమెకు ఎదురైన సవాళ్లేంటి? అన్నది మిగతా కథ. ఇందులో నా పాత్ర కొత్తగా ఉంటుంది. దర్శకుడు నరేంద్ర కొత్తవాడైనా సినిమాను చక్కగా తెరకెక్కించారు’’.


ఈ పాత్ర కోసమే సన్నబడ్డా

‘‘‘మిస్‌ ఇండియా’లోని పాత్ర కోసమే నేను సన్నబడాల్సి వచ్చింది. దీనికోసం బాగా కష్టపడ్డా. మొదట చిత్ర టైటిల్, నేను కనిపించిన విధానం చూసి దీంట్లో మేం అందం గురించి చర్చించబోతున్నాం అనుకున్నారు. కానీ, టీజర్‌ చూశాక అందరికీ ఓ స్పష్టత వచ్చింది’’.

బాధ.. సంతోషం

ప్రస్తుత పరిస్థితుల వల్ల థియేటర్‌ ఫీల్‌ మిస్‌ అవుతున్నామన్న బాధ ఉంది. కానీ, ఇప్పుడు ఓటీటీల వల్ల సినిమా విస్తృతి పెరిగింది. థియేటర్‌ విడదలైనా.. ఓటీటీ రిలీజైనా ఒత్తిడి ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. సరిగా నిద్ర పట్టదు. ప్రేక్షకులు సినిమాను ఎలా స్వీకరిస్తారనే ఆందోళన ఎప్పుడూ అలాగే ఉంటుంది.

తపన పెరిగింది

‘మహానటి’ తర్వాత నటిగా నా బాధ్యత పెరిగింది. ముఖ్యంగా నాయికా ప్రాధాన్య చిత్రాలు వచ్చినప్పుడు మరింత పర్‌ఫెక్షన్‌తో సినిమా చెయ్యాలన్న తపన ఎక్కువైంది. మంచి కథలు దొరికితే వెబ్‌సిరీస్‌లకూ నేను సిద్ధమే.

ఆ సినిమా చెయ్యట్లేదు..

మహేష్‌తో ‘సర్కారు వారి పాట’ చిత్రం చేస్తున్నా. రజనీకాంత్‌ సర్‌తో ‘అణ్నాత్తే’ చేస్తున్నా. మలయాళంలో మోహన్‌లాల్‌ గారి సినిమా చేస్తున్నా. రెండు తెలుగు చిత్రాలు చర్చల దశలో ఉన్నాయి. హిందీలో ‘మైదాన్‌’ చిత్రంలో నటిస్తున్నా అనేది వాస్తవం కాదు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.