నన్ను ఆ పేరుతో పిలిస్తే చాలా కోపం!

హిందీ చిత్రాలైనా, తెలుగు చిత్రాలైనా, వెబ్‌ సీరీస్‌ అయినా సరే దర్శకుడు చెప్పినట్లు చేస్తూనే తన పాత్రను పండిస్తుంది. నటనను ప్రాణంగా భావిస్తుంది. పాత్రల్లో ఒదిగిపోయి మురిపిస్తుంది, అలరిస్తుంది. ఆ నటే కైరా అడ్వాణి. తెలుగులో ‘భరత్‌ అనే నేను’లో వసుమతి అనే మధ్య తరగతి అమ్మాయిగా నటించింది. ‘వినయ విధేయ రామ’లో అమ్మ మాటని హద్దుదాటని సీత పాత్రలో మెప్పించింది. ప్రస్తుతం అక్షయ్‌ కుమార్‌తో కలిసి ‘లక్ష్మీబాంబ్‌’లో స్నేహ కోస్లాగా నటిస్తుంది. ‘ఇందూ కి జవానీ’, ‘షేర్షా’, ‘భూల్‌ భులయ్యా2’లాంటి చిత్రాల్లోను చేస్తోంది. ఆ మధ్య ఓ ముఖాముఖి సమావేశంలో తన గురించి ఆసక్తికరమైన, మనసులోని మాటలు చెప్పింది. అవేంటో చూద్దామా?


* మీపై అధిక ప్రభావం చూపించేదెవరు?

నా తల్లితండ్రులు. వారు సంతోషంగా, సుఖంగా ఉండటమే నా లక్ష్యం. సినిమాల్లో కథలాగ్గే నాక్కూడా కొంచెం అనుబంధాలు ఆపాయ్యతలు ఎక్కువే. మీరు దాన్ని సెంటిమెంట్‌ అనుకోవచ్చు. నన్ను అమ్మకూచి అని కూడా అనవచ్చు.* సినిమా పరిశ్రమ నుంచి ఏమీ నేర్చుకున్నారు?

చాలామందిలో నేను గమనించిన విషయం సహనం, ఓపిక. మనం చేసే పని నిజాయతీగా చేసుకొంటూ పోతే ఏదో ఒకరోజు దాని ఫలితం వస్తుంది. అప్పటి వరకు మన ప్రయత్నం చేస్తూనే ఉండాలి.
* మీకు ఇష్టమైన నటులు, చిత్రాలు?

దీపికా పదుకొణె, అలియాభట్‌లు అంటే చాలా ఇష్టం. బాగా ఇష్టమైన చిత్రం ‘కభి ఖుషి కభీ ఘం’. ఎన్నిసార్లు చూశానో లెక్కే లేదు. ‘పద్మావత్‌’ చిత్ర దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వంలో నటించాలని ఉంది. అలాగే ‘గల్లీ బాయ్‌’ నటుడు రన్వీర్‌సింగ్‌తో కలిసి నటించాలనే ఆశ.* మిమ్మల్ని విమర్శించే వాళ్లకి ఏం సమాధానం చెప్తారు?

మనం చేసే పని చేస్తాం. వాళ్లు చేసేది వాళ్లు చేస్తారు. అసలు విమర్శ అనేది మనం ఏదో ఒకటి చేస్తేనే కదా, దాని గురించి వేరేవాళ్లు చర్చించుకొనేది. పొగిడినా, తిట్టినా పెద్దగా పట్టించుకోను.
* ఎదుటి వ్యక్తిలో ఎలాంటి అంశాలు నచ్చుతాయి?

ఎదుటి వారిని గౌరవించాలి. చేసే వృత్తిని చులకనగా చూడకూడదు. అందరితో ఇట్టే కలిసిపోయే వ్యక్తులు ఎవరైనాసరే నచ్చేస్తారు. ముఖ్యంగా ముఖస్తుతి లేకుండా, సొంత వ్యక్తిత్వం కలిగి ఉండాలి.


* ఇప్పటి వరకు ఎవరినైనా ముద్దు పెట్టుకున్నారా?

సినిమాల్లో అయితే చాలాసార్లు పెట్టుకున్నా. ముఖ్యంగా ‘కబీర్‌సింగ్‌’ షాహింద్‌ కపూర్‌తో చాలా రొమాన్స్‌ (సినిమాలోనే) చేశాను.
* మీరు దేన్ని నమ్ముతారు?

కష్టపడి పనిచేసే విధానాన్ని కచ్చితంగా నమ్ముతా. జ్యోతిష్యాలు అంటే పెద్దగా ఆసక్తి లేదు. కానీ దేవుడున్నాడని నమ్మకం ఉంది. మనందరిని ఆయనే బాగా చూస్తుంటాడు.* ఎలా పిలిస్తే మీకిష్టం?

నా అసలు పేరు అలియా అడ్వాణి. చిత్రసీమలోకి వచ్చాక కియారా అడ్వాణిగా పిలుస్తున్నారు. ‘కైరా’ అని పిలిస్తే మాత్రం వారికి చెమటలు పట్టాల్సిందే. నాకు విపరీతమైన కోపం వస్తుంది. కొందరు నాకు కోపం తెప్పించడానికి ‘కైరా’ అనే పిలుస్తుంటారు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.