చిరంజీవి చిత్రాలు బాగా చూసేవాడిని‘‘బ్యాగ్రౌండ్‌ లేకుండా చిత్ర పరిశ్రమలో నెగ్గుకు రావడం కష్టమని చాలా మంది భయపెట్టారు. తొలి సినిమా చిత్రంతోనే హీరోగా మంచి పేరు తెచ్చుకోవడంతో ఆ భయాలన్ని తొలగిపోయాయి. సుకుమార్, వి.వి.వినాయక్‌ వంటి దర్శకులు నా నటనను మెచ్చుకోవడం సంతోషాన్నిచ్చింది. నేను పుట్టి పెరిగిందంతా కడప జిల్లాలోని రాయచోటి. ఇంజినీరింగ్‌ పూర్తికాగానే బెంగళూరులోని సిస్కోలో కొన్నాళ్లు ఉద్యోగం చేశా. ఆ సమయంలోనే నా మిత్రుడి ప్రోత్సాహంతో ‘గచ్చిబౌలి’ అనే లఘు చిత్రంలో చేశా. దానికి మంచి పేరు రావడంతో ఇంకొన్ని షార్ట్‌ ఫిల్మ్స్‌లో చేశా. తర్వాత నటుడిగా నాపై నాకు నమ్మకం కలగడంతో సీరియస్‌గా సినిమాల వైపు దృష్టిపెట్టా. ఈ క్రమంలోనే తొలి అవకాశం అందుకున్నా. నటుడిగా నాలో పవన్‌ కల్యాణ్ శైలి బాగా కనిపిస్తుంటుంది. చదువుకునే రోజుల్లో ఆయనవి, చిరంజీవి సినిమాలు బాగా చూసే వాడిని’’. ‘‘ప్రస్తుతం నేను ‘ఎస్‌ఆర్‌ కళ్యాణమండపం’ అనే చిత్రం చేస్తున్నా. శ్రీధర్‌ గాదె అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్నారు. ప్రియాంక జవాల్కర్‌ కథానాయిక. రాయలసీమ ప్రాంతంలో 1975లో నిర్మించిన ఓ కళ్యాణ మండపం చుట్టూ జరిగే కథతో ఎంతో ఆసక్తికరంగా చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రంలో వినిపించబోయే రాయలసీమ మాండలికం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. దీనికి కథ, స్క్రీన్‌ప్లే, మాటలు నేనే అందించా. ఇప్పటికే 40శాతం చిత్రీకరణ జరిగింది. కడప పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుతున్నాం. ఈనెల 28 నుంచి తిరిగి సెట్స్‌పైకి వెళ్లాలి అనుకుంటున్నాం. త్వరలో ఓ కొత్త దర్శకుడితో ‘సెబాస్టియన్‌’ అనే చిత్రం చేయబోతున్నా. ఇందులో రాత్రిపూట కళ్లు కనిపించని కానిస్టేబుల్‌గా కనిపిస్తా. మరో మూడు చిత్రాలు చర్చల దశలో ఉన్నాయి. వెబ్‌సిరీస్‌ల వైపు వెళ్లే ఆలోచన లేదు. భవిష్యత్తులో మంచి పాత్రలొస్తే ప్రతినాయకుడిగా నటించేందుకైనా సిద్ధమే.’’Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.