అదే నా కల

‘‘గీత రచయితగా ప్రయాణం కాస్త సవాళ్లతో నిండినదే. కొత్త నీరు వస్తూనే ఉంటుంది. పాత వాళ్లు ఉంటూనే ఉంటారు. కాబట్టి ఉన్న సినిమాల్ని అందరితో పంచుకోవాల్సి వస్తుంటుంది. అందుకే మనల్ని మనం నిరూపించుకుంటూ ముందుకెళ్లాలంటే.. ఎప్పటికప్పుడు మన ప్రతిభను కొత్తగా చూపించాల్సిందే’’ అంటున్నారు గీత రచయిత కృష్ణకాంత్‌. ఇటీవల కాలంలో ‘పడి పడిలేచే మనసు’, ‘టాక్సీవాలా’, ‘జెర్సీ’ లాంటి చిత్రాల్లోని గీతాలతో సినీ సంగీత ప్రియుల్ని మురిపించిన ఆయన.. ఇప్పుడు తెలుగులో అనేక పెద్ద చిత్రాలకు పాటలందిస్తున్నారు. ఆదివారం ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా ‘ఈనాడు సినిమా’తో ప్రత్యేకంగా ముచ్చటించారు కృష్ణకాంత్‌.

‘‘చిత్రసీమలోకి వచ్చి అప్పుడే 8ఏళ్లు గడిచిపోయాయి. 2012లో ‘అందాల రాక్షసి’ చిత్రంతో తొలిసారి గీత రచయితగా తెరపైకి వచ్చా. ఆ సినిమాలో నా పాటలకు మంచి ఆదరణ దక్కింది. అయితే నా కెరీర్‌ వేగం పుంజుకుంది 2014 తర్వాత నుంచే. ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ చిత్రం తర్వాత నుంచి నేను మళ్లీ వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. పరిశ్రమలో మంచి స్నేహితులు దొరకడం, యువ దర్శకుల ప్రోత్సాహం వల్లే నా కెరీర్‌ను ఇంత సాఫీగా కొనసాగించగలుగుతున్నా. వాళ్ల సహకారంతోనే ఇప్పటికే 300ల పైచిలుకు చిత్రాల్లో 75 పాటలు రాయగలిగా’’.

‘‘గీత రచయితగా ఏరకమైన పాటనయినా మనసు పెట్టే రాస్తుంటా. కానీ, క్లారిటీ లేని దర్శకుల చిత్రాలకి పాటలు రాయడం కాస్త సవాల్‌గా ఉంటుంది. వాళ్లు సరిగా కథ సందర్భం వివరించరు.కానీ, ఒకటి రెండు రోజుల్లో పాట ఇచ్చేయ్యాలి అంటుంటారు. అలాంటి సందర్భాల్లో పాట రాయడం కఠినంగా అనిపిస్తుంటుంది. ‘జెర్సీ’, ‘పడిపడి లేచే మనసు’, ‘టాక్సీవాలా’, ‘హుషారు’ లాంటి చిత్రాల్లో ఎక్కువ శాతం పాటలు నేనే రాశా. అలాంటి సందర్భాల్లో కథ మొత్తం చెప్తారు. కాబట్టి మంచి సాహిత్యం అందించే వీలు కలుగుతుంది. కానీ, సింగిల్‌ కార్డ్‌ పాటలు రాయాల్సి వచ్చినప్పుడు ఇంత అవకాశం ఉండదు. కానీ, సినిమా ఫీల్‌ని ఎక్కడ మిస్‌ అవకుండా పాట రాయడం కత్తి మీద సామే. ఇటీవల వస్తున్న యువ దర్శకులు కథకు అవసరాన్ని బట్టే పాటలు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంచి ప్రయత్నం. ‘అ’, ‘ఏజెంట్‌ సాయిశ్రీనివాస ఆత్రేయ’ చిత్రాల్లో ఉన్నది ఒక్కటే పాటయినా.. కథలో భాగంగానే ఉంటాయి’’.

‘‘గతేడాది నా నుంచి ‘వి’, ‘ఒరేయ్‌ బుజ్జిగా’, ‘నిశ్శబ్దం’ లాంటి చిత్రాలొచ్చాయి. నాకు మంచి గుర్తింపు తెచ్చింది మాత్రం ‘ఎస్‌.ఆర్‌.కళ్యాణమండం’ చిత్రంలోని ‘‘చూశాలే కళ్లారా’’ గీతం. ఎప్పటికైనా మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకోవాలన్నది నా కల. అందుకే తీరిక దొరికినప్పుడల్లా కథలు రాసుకుంటుంటా. ‘అ!’, ‘ది లయన్‌ కింగ్‌’, ‘అల్లాదీన్‌’, ‘ఫ్రోజెన్‌ 2’ లాంటి చిత్రాలకు నేను సంభాషణలు రాశా. ప్రస్తుతం ‘రాధేశ్యాం’, ‘పాగల్‌’, ‘గమనం’, ‘హిట్‌2’, ‘శ్యామ్‌ సింగరాయ్‌’ ఇలా దాదాపు 25 చిత్రాలకి పాటలు రాస్తున్నా. ‘రాధేశ్యాం’ కోసం ఇప్పటికే నాలుగు పాటలు రాశా. వీటితో పాటు కీర్తి సురేష్‌ నటిస్తున్న ద్విభాషా చిత్రం ‘సానికాయుదం’కి తెలుగులో సంభాషణలు, పాటలు రాస్తున్నా’’.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.