ఒరిజినల్‌ తెలుగే..
‘‘నాకు నేనుగా.. అడవి శేష్‌ లేకుండా అయితే ‘గూఢచారి’ లాంటి సినిమా తీసేవాణ్నికాదు. నా తొలి సినిమాగా ఒక మంచి డ్రామానో, రొమాంటిక్‌ కామెడీ కథనో, ప్రేమకథనో తీసేవాణ్ని. యాక్షన్‌తో కూడిన ఈ కథని సొంతం చేసుకోవడానికి కొంచెం సమయం పట్టింది’’ అన్నారు శశికిరణ్‌ తిక్క. ఆయన దర్శకత్వం వహించిన చిత్రం ‘గూఢచారి’. అడవి శేష్‌, శోభిత దూలిపాళ జంటగా నటించారు. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా శశికిరణ్‌ సోమవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు. ఆ విషయాలివీ...‘‘మా సినిమాకి ఇంత గౌరవం దక్కుతుందని అనుకోలేదు. సాంకేతికత పరంగానే కాకుండా, భావోద్వేగాల రీత్యా కూడా అందరికీ చేరువైంది. హిట్టు కొట్టాలని కాకుండా, ఒక మంచి సినిమా తీయాలనుకొన్నాం. ‘గూఢచారి’పై ఆంగ్ల చిత్రాల ప్రభావం ఉందనే మాటని మేమూ విన్నాం. చిన్నప్పట్నుంచి ఆంగ్ల చిత్రాలు చూస్తున్నాను కాబట్టి ఎక్కడో ఆ ప్రభావం ఉంటుంది. కానీ సాంస్కృతికంగా నేను తెలుగువాణ్ని. భావోద్వేగాల పరంగా లోపల మొత్తం తెలుగు సినిమానే. పైపై మెరుగులు హాలీవుడ్‌ సినిమాల్ని గుర్తు చేస్తుంటాయంతే’’.

* ‘‘అప్పట్లో కృష్ణ కథానాయకుడిగా ఈ తరహా స్పై సినిమాలొచ్చాయి. ఈ మధ్య ఆ ప్రయత్నాలేవీ లేకపోవడం మాకు కలిసొచ్చింది. ప్రేక్షకులకు ఓ కొత్తదనం ఈ సినిమాలో కనిపించింది. శేష్‌, నేను, రాహుల్‌ కలిసి ఎనిమిది నెలలు కష్టపడి ఈ సినిమాకి స్క్రీన్‌ప్లే రాశాం. శేఖర్‌ కమ్ముల దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేశా. అప్పట్నుంచే నాకు అడవి శేష్‌తో పరిచయం ఉంది. మా ఇద్దరి ఆలోచనలు ‘గూఢచారి’ విషయంలో కుదిరాయి’’.

* ‘‘విజయవాడ లయోలా కాలేజీలో సాంస్కృతిక విభాగానికి లీడర్‌గా ఉంటూ నాటకాలు, హాస్య కదంబాలు రాసేవాణ్ని. అప్పుడప్పుడు నటించేవాణ్ని. ఒక వేడుకకి నాగార్జున విశ్వవిద్యాలయం ఉప కులపతి ముఖ్యఅతిథిగా వచ్చారు. ఆయన నా నటనని చూసి ‘చాలా బాగా చేశావు, చిత్ర పరిశ్రమలో నాకు తెలిసినవాళ్లు ఉన్నారు. వెళ్లి కలువు’ అన్నారు. అప్పుడు సినిమాలపై ఆసక్తి ఏర్పడింది. ఎంబీఏ చేశాక బ్యాంకింగ్‌ రంగంలో మంచి ఉద్యోగం వచ్చినా సినిమాలపై ఇష్టంతో న్యూయార్క్‌ ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌కు వెళ్లి చదువుకొన్నా. తదుపరి ఎలాంటి సినిమా చేయాలనేది ఇంకా ఆలోచించుకోలేదు’’.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.