క్రిష్‌ ఫైర్‌.. కంగనా సోదరి సెటైర్‌
చిత్రీకరణ సమయంలో సోనూసూద్‌ - కంగనాల వివాదం... సినిమా విడుదలైన తర్వాత క్రిష్‌ - కంగనా వార్‌ ఎపిసోడ్‌. ఏదేమైనా ‘మణికర్ణిక: ది క్వీన్‌ ఆఫ్‌ ఝాన్సీ’ చిత్రం అప్పుడూ ఇప్పుడూ జాతీయ మీడియాలో హాట్‌ టాపిక్‌గానే నిలుస్తోంది. ఈ వ్యవహారంపై ఇటీవల క్రిష్‌ మాట్లాడుతూ ‘‘కంగనా తనతో చాలా మూర్ఖంగా వ్యవహరించిందని, తనకు తెలికుండా సినిమాలో చాలా మార్పులు చేసిందని, ముఖ్యమైన పాత్రల పరిధి తగ్గించేసిందని’’ అన్నారు. దర్శకుడిగా తన క్రెడిట్‌ ఆమె తీసుకోని కంగనా ఎలా ప్రశాంతంగా నిద్రపోగలుగుతోందో అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే తాజాగా ఈ అంశంపై క్రిష్‌ మరికొన్ని ఆసక్తికర సంగతులు బయటపెట్టాడు.


* ‘‘మణికర్ణిక’కు కంగనాను తీసుకుందామనుకున్నప్పుడు నేనూ చాలా ఎగ్జైట్‌ అయ్యా. తను గొప్ప నటి. ఇంకా కచ్చితంగా చెప్పాలంటే ఆమె లక్ష్మీబాయి పాత్ర చేస్తానంది కాబట్టే ‘మణికర్ణిక’ దర్శకత్వం చేసేందుకు ఒప్పుకున్నా. ఈ సినిమా మంచిగా రావాలని నేను కొన్ని రోజులు ఝాన్సీ ప్రాంతంలో తిరిగా.. లక్ష్మీభాయి చదువుకున్న విద్యాసంస్థలో 40 మంది వరకు విద్యార్థులను ఇంటర్వ్యూ చేశా. ఇదంతా చరిత్రలోని నిజాలను చూపించడానికే చేశా. కానీ, కంగనా దర్శకత్వ బాధ్యతలు స్వీకరించాక ఆ చరిత్రను పక్కదోవ పట్టించాలని చూశారు’’.

* ‘‘ఈ సినిమాను గతేడాది జూన్‌లోనే పూర్తిచేసి తొలికాపీ అందిచేశా. కానీ, ఆ తర్వాత నాకు తెలియకుండా కంగనా దర్శకత్వంలో సినిమాలో చాలా మార్పులు చేశారు. ఇప్పుడంతా చూస్తున్న సినిమా అలా మార్పులకు గురైనదే. నేను తీసినది బంగారంలా ఉంటే.. ఆమె చేసింది వెండిలా ఉంది. నేనీ చిత్రం కోసం 400 రోజులు కేటాయించా. నేనింత కష్టపడిచేస్తే.. ఇది బాలేదు, అది బాలేదు అంటే బాధ అనిపించింది. పైగా ఇందులోని ముఖ్యమైన అనేక సన్నివేశాలు తొలగించేశారు. ఈ చిత్రంలో తాంతియా తోపే పాత్ర చాలా కీలకం. దాని గురించి ఎక్కడా చెప్పలేదు. అతుల్‌ కులకర్ణి చేసిన యుద్ధ సన్నివేశాలున్నాయి. వాటినీ తొలగించేశారు. కంగనా తానే డెబ్బై శాతం భాగానికి దర్శకత్వం వహించినట్లు చెప్పుకుంటోంది. అది పచ్చి అబద్ధం. నేను తెరకెక్కించిన సన్నివేశాలనే క్లోజప్‌ షాట్‌లో ఆమె చిత్రీకరించి చూపించింది. ఇలాంటి సీన్లు ఫస్ట్‌హాఫ్‌లో ఓ 10శాతం.. సెకండ్‌ హాఫ్‌లో 15శాతం ఉండొచ్చు. మొత్తంగా ఒక 25శాతం వరకు ఆమె దర్శకత్వం వహించిన సన్నివేశాలు ఉండొచ్చేమో. ఆ మాత్రం దానికే ఆమె దర్శకురాలు అయిపోతుందా??’’ అని క్రిష్‌ అన్నారు.


*
క్రిష్‌ వ్యాఖ్యలపై కంగనా సోదరి సెటైర్‌..
‘మణికర్ణిక’ చిత్ర విషయంలో కంగనా రనౌత్‌పై క్రిష్‌ చేస్తున్న వ్యాఖ్యలపై ఆమె సోదరి రంగోలి స్పందించారు. ‘‘డైరెక్టర్‌ క్రిష్‌.. మొత్తం చిత్రాన్ని మీరే తెరకెక్కించారని మేం నమ్ముతున్నాం. దయచేసి ఇంతటితో ఆపేయండి. ఎందుకంటే ‘మణికర్ణిక’లో ప్రధాన పాత్ర పోషించింది కంగనానే. కాబట్టి ఈ విజయాన్ని, ప్రశంసల్ని తనను ఆస్వాదించనీయండి’’ అంటూ వ్యంగ్యంగా ట్వీట్‌ చేసింది. చివర్లో రెండు చేతులు జోడించినట్లుగా ఓ ఎమోజీని జత చేసింది. ‘ఈ సినిమాను పూర్తిగా తానే తెరకెక్కించింది నిజమైతే. క్రిష్‌ దాన్ని నిరూపించాలని’ రంగోలి మరో ట్వీట్‌ కూడా చేసింది.
సంబంధిత వ్యాసాలు


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.