ఆ లెక్కలేసుకుంటే... పళ్లు రాలిపోతాయ్‌
‘2017లో మా సంస్థ నుంచి ఆరు చిత్రాలొచ్చాయి. ఆరూ బాగా ఆడాయి. ప్రతీసారీ అలానే జరక్కపోవొచ్చు. ఈసారీ అన్నే సినిమాలు చేయాలి అని లెక్కలేసుకుని ప్రయాణం చేస్తే పళ్లురాలిపోయే ప్రమాదం ఉంద’’న్నారు దిల్‌రాజు. ఆయన సంస్థ నుంచి వచ్చిన ‘ఎఫ్‌ 2’ మంచి విజయాన్ని అందుకుంది. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు దిల్‌రాజు ‘‘ఈ సంక్రాంతికి విడుదలైన మా చిత్రానికి ప్రేక్షకులు మంచి విజయాన్ని అందించారు. ఇదే ఉత్సాహంతో ఈ యేడాది మరిన్ని చిత్రాల్ని అందిస్తాం. కనీసం 4 నుంచి 6 చిత్రాలు మా సంస్థ నుంచి విడుదలయ్యే అవకాశాలున్నాయి. ‘ఎఫ్‌ 2’ని మిగిలిన భాషల్లో రీమేక్‌ చేసే ఆలోచనలున్నాయి. బాలీవుడ్‌కి వెళ్లే అవకాశాలున్నాయి. అక్కడి నిర్మాణ సంస్థ భాగస్వామ్యంతో ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్‌ చేసే ఆలోచనలో ఉన్నాం. ‘ఎఫ్‌ 3’ గురించి చర్చలు జరుగుతున్నాయి. అనిల్‌ రావిపూడి తన ఆలోచన చెప్పాడు. అన్నీ కుదిరితే 2021 సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేస్తామ’’న్నారు. ‘96’ అనే తమిళ చిత్రాన్ని తెలుగులో రీమేక్‌ చేస్తున్నారు దిల్‌రాజు. ఈ సినిమా గురించి ఆయన మాట్లాడుతూ ‘‘మా సంస్థ నుంచి వస్తున్న తొలి రీమేక్‌ చిత్రమిదే. విడుదలకు ముందే చెన్నైలో ఈ చిత్రాన్ని చూశా. తెలుగులోనూ బాగా ఆడుతుందనిపించింది. అక్కడికక్కడే ఈ చిత్రాన్ని రీమేక్‌ చేయాలన్న నిర్ణయానికి వచ్చేశా. మహేష్‌బాబు నటిస్తున్న ‘మహర్షి’ ఏప్రిల్‌లో విడుదల అవుతోంది. నాగచైతన్యతో ఓ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాం. పూర్తి వివరాలు త్వరలో చెబుతా’’మన్నారు.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.