మహేష్‌బాబు అంటే చాలా ఇష్టం
రచయిత్రిగా, గాయనిగా, ధారావాహికల్లో నటిగా పేరు తెచ్చుకుంది దిగన్‌గన సూర్యవన్షి. ఆ తరవాత బాలీవుడ్‌ నుంచి పిలుపందుకుంది. ‘ఫ్రైడే’, ‘జలేబి’ ‘రంగీలా రాజా’ లాంటి హిందీ చిత్రాలు చేసింది. ఇప్పుడు తెలుగులో అడుగుపెట్టింది. కార్తికేయతో కలసి ‘హిప్పీ’లో నటిస్తోంది. ఈ సందర్భంగా సూర్యవన్షి శనివారం హైదరాబాద్‌లో విలేకర్లతో మాట్లాడింది. ‘‘ప్రేమకథలు చాలా వస్తుంటాయి. వాటిలో ‘హిప్పీ’ భిన్నమైందంటోంది. తను చెప్పిన కబుర్లు ఇవీ...


*
దక్షిణాది చిత్రాల్లో నటించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. దర్శకుడు కృష్ణ చెప్పిన ‘హిప్పీ’ కథ నాకు నచ్చింది. నా పాత్ర గ్లామరస్‌గా ఉంటుంది. నటనకూ ఆస్కారం ఉంది. ఒకానొక దశలో నా పాత్ర కథానాయకుడితో పోటీపడుతుంది. నా తొలి అడుగులోనే మంచి సినిమా దక్కినందుకు సంతోషంగా ఉంది. తెలుగులో అవకాశాలు వస్తున్నాయి. తెలుగు నేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాను. అందుకోసం కొన్ని సినిమాలూ చూస్తున్నా. చిరంజీవి, రజనీకాంత్‌, నాగార్జున, సూర్యలంటే అభిమానం, గౌరవం. యువ కథానాయకుల్లో మహేష్‌బాబు చాలా ఇష్టం. దర్శకులు రాజమౌళి, మణిరత్నం చిత్రాలు వదలకుండా చూస్తున్నా. ‘బాహుబలి’ చాలాసార్లు చూశా. నాక్కూడా అలాంటి జానపద చిత్రాల్లో నటించాలని ఉంది.

* కొత్త తరహా పాత్రలే నటీనటుల్ని తీర్చిదిద్దుతాయి. ఆ తరహా వైవిధ్యం కోసం ప్రయత్నిస్తూనే యాక్షన్‌ చిత్రాల్లో నటించాలనుంది. అందుకోసం ఎంత కష్టానికైనా సిద్ధం. పోరాటాలు నేర్చుకుంటాను. చిన్నప్పట్నుంచీ గుర్రపు స్వారీ ఇష్టం. పెద్దయ్యాక నేర్చేసుకున్నా. బైక్‌ రైడింగూ వచ్చు. రచయితగా గుర్తింపు తెచ్చుకోవాలని ఉంది. ఇప్పటికే ‘నిక్సీ ద మెర్మ్తెడ్‌ అండ్‌ పవర్‌ ఆఫ్‌ లవ్‌’ నవల రాశా. పియానో పైనా నాకు పట్టుంది. పాటలు పాడతాను. ఆంగ్ల, హిందీ, పంజాబీ భాషల్లో పాడుతూ కార్యక్రమాల్ని నిర్వహించాను. ఇండోనేషియాలో కొన్ని షోలు చేశా. ‘శారద మైకి మరోలియా’ పేరుతో మ్యూజిక్‌ ఆల్బమ్‌ను రూపొందించాను. ఇందులో అన్నీ భక్తి పాటలే. అవకాశం ఇస్తే తెలుగు సినిమాల్లోనూ పాటలు పాడాలనుంది.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.