జక్కన్నతో చర్చలు.. త్వరలోనే చెప్తా: మహేష్‌
‘‘ఒకే గెటప్‌తో సినిమాలు చేస్తున్నానని నాపై విమర్శలు వస్తున్నాయి. కానీ, ఏం చేద్దాం అలాంటి పాత్రలే నా దగ్గరకు వస్తున్నాయి’’ అంటున్నారు అగ్ర కథానాయకుడు మహేష్‌బాబు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఆయన హీరోగా నటించిన 25వ చిత్రం ‘మహర్షి’. పూజాహెగ్డే కథానాయిక. అల్లరి నరేష్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, వైజయంతీ మూవీస్‌, పీవీపీ సినిమా బ్యానర్లపై దిల్‌రాజు, అశ్వనీదత్‌, ప్రసాత్‌ వి.పొట్లూరి నిర్మిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మహేష్‌బాబు ‘మహర్షి’ చిత్రంతో పాటు, అనేక విషయాలను విలేకరులతో పంచుకున్నారు.


* 25 సినిమా చేద్దామనే ‘మహర్షి’ కథ ఆపా!
‘‘వంశీ పైడిపల్లి 40 నిమిషాల పాటు నాకు ‘మహర్షి’ కథ చెప్పారు. కథ విన్న విన్నంత సేపూ భలే అనిపించింది. అయితే, అప్పటికే నా చేతిలో సినిమాలు ఉన్నాయి. ‘నా 25వ సినిమాను ఈ కథతో చేద్దాం. నాకోసం కొంతకాలం ఆగుతావా?’ అని వంశీని అడిగాను. అందుకే మా ఇద్దరి కలయికలో సినిమా చేయడానికి ఇంతకాలం పట్టింది!’’

* అలాంటి పాత్రలే వస్తున్నాయి ఏం చేద్దాం!
‘‘ఒకే గెటప్‌తో సినిమాలు చేస్తున్నానని నాపై విమర్శలు వస్తున్నాయి. కానీ, ఏం చేద్దాం అలాంటి పాత్రలే నా దగ్గరకు వస్తున్నాయి. ‘మహర్షి’లో నేను మూడు విభిన్ప పాత్రలు పోషించా. విద్యార్థిగా, ఒక కంపెనీకి సీఈవోగా, రైతుగా ఇందులో కనిపిస్తా. ఒకే తరహా పాత్రలు చేస్తున్నానని ఫీలవుతున్న అభిమానులకు ఈ సినిమా ఒక ట్రీట్‌లా ఉంటుంది’’.

* ఆ పాత్ర నాకు ఛాలెంజ్‌ అనిపించింది!
‘‘మహర్షి’లో నేను చేసిన మూడు పాత్రలో స్టూడెంట్‌ పాత్ర, పాత్రలో వచ్చిన సన్నివేశాలు నాకు ఛాలెంజింగ్‌ అనిపించాయి. ఈ విషయంలో దర్శకుడు వంశీను అభినందించాలి. నాలో నమ్మకాన్ని పెంచారు. దీంతో ఆ పాత్రను చాలా సులువుగా చేసేశా’’.

* వాళ్ల పేర్లు చెప్పడం మర్చిపోయా!
‘‘మహర్షి’ ప్రీరిలీజ్‌ వేడుక సందర్భంగా ఒకేసారి అభిమానులు వేదికపై రావడంతో దర్శకులు పూరి జగన్నాథ్‌, సుకుమార్‌ల పేర్లు వారితో చేసిన సినిమాలను గుర్తు చేసుకునే అవకాశం నాకు రాలేదు. ‘వన్‌: నేనొక్కడినే’ ఒక కల్ట్‌ క్లాసిక్‌ చిత్రమే కాదు, నా సినిమాల్లో ఉత్తమ చిత్రం. ఈ విషయంలో సుకుమార్‌ను అభినందించక తప్పదు’’.

* నా సినిమాలన్నీ ‘మే’లోనే రిలీజ్‌ చేయమంటారు!
‘‘మే 9న ‘మహర్షి’తో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కొట్టబోతున్నాం. ఈ సినిమా విడుదలయ్యాక ఇక నుంచి నా సినిమాలన్నీ మేలోనే రిలీజ్‌ చేయాలని ఫ్యాన్స్‌ పట్టుబట్టే అవకాశం ఉంది(నవ్వుతూ) ‘మహర్షి’ని నాన్నగారు కూడా చూసి, చాలా సంతోషించారు’’.


* అందుకే సుకుమార్‌ సినిమా చేయడం లేదు!
‘‘సుకుమార్‌ నాకు ఒక బలమైన ఇతివృత్తం కలిగిన కథను చెప్పారు. నేనేమో ఎంటర్‌టైన్‌మెంట్‌తో సాగే కథ చేయాలని భావించా. అందుకే సుకుమార్‌ కథను పక్కన పెట్టి, అనిల్‌రావిపూడి చెప్పిన కథకు తొలుత ఓటేశా. నా నిర్ణయంతో సుకుమార్‌ ఏకీభవించారు. భవిష్యత్‌లో మేమిద్దరం తప్పకుండా సినిమా చేస్తాం.’’

* వారితో సినిమాలు చేయడం లేదన్నది అవాస్తవం
‘‘యువ దర్శకులతో పని చేయాలని నాకూ ఉంది. కానీ, నా బాడీ లాంగ్వేజ్‌కు సరిపోయే కథను ఒక్క యువ దర్శకుడు కూడా నాకు ఇప్పటివరకూ వినిపించలేదు. కథ నచ్చితే యువ దర్శకులతో పనిచేయడానికి నాకు ఎలాంటి ఇబ్బంది లేదు’’

* ఆ సినిమాలు చేయలంటే నాకు భయం
‘‘చారిత్రక నేపథ్యం ఉన్న కథల్లో నటించాలంటే నాకు కాస్త భయం. ఒక వేళ నాకు సరిపోయే కథతో, ప్రేక్షకులను మెప్పించగలిగిన దర్శకుడు దొరికితే తప్పకుండా ఆ జానర్‌లో సినిమా చేయడం గురించి ఆలోచిస్తా’’.

* చిన్న చిత్రాలు నిర్మిస్తా!
‘‘మా సొంత బ్యానర్‌లో వెబ్‌ సిరీస్‌లు, చక్కని కథ, కథనాలతో సాగే చిన్న సినిమాలు తీయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. భవిష్యత్‌లో దీన్ని కొనసాగిస్తాం’’.

* నాకే ఆ సినిమా టికెట్లు దొరకలేదు!
‘‘అందరూ అవెంజర్స్‌: ఎండ్‌గేమ్‌ బాగుందని అంటున్నారు. ఆ సినిమా చూద్దామని ఏఎంబీ సినిమాస్‌లో టికెట్లు అడిగితే, ఏడు షోల వరకూ ఖాళీనే లేదని చెప్పారు(నవ్వులు) నేడో.. రేపో ఈ సినిమా చూస్తా’’.


* ఆ సమయంలో సితార సంతోషం వెలకట్టలేనిది!

‘‘నా మైనపు విగ్రహాన్ని చూసి అందరూ చాలా సంతోషించారు. ఇక ఆ సమయంలో నా కూతురులో కనిపించిన ఆనందం వెలకట్టలేనిది.’’

* శ్రీమణి నిజంగా వజ్రమే!
‘‘మహర్షి’ కోసం పాటల రచయిత శ్రీమణి అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు. ఈ సినిమాకు ఆయన పాటలే పెద్ద ఆస్తి.’’

* ఆ తర్వాత మల్టీస్టారర్‌ స్క్రిప్ట్‌ రాలేదు!
‘‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రంలో వెంకటేష్‌తో కలిసి నేను నటించా. అయితే, ఇప్పటివరకూ మరో మల్టీస్టారర్‌ స్క్రిప్ట్‌ నా దగ్గరకు రాలేదు. మల్టీస్టారర్‌ సినిమాలు చేయడం ఆషామాషీ విషయం కాదు. మంచి కథ దొరికితే తారక్‌(ఎన్టీఆర్‌), రామ్‌చరణ్‌లతో సంతోషంగా పనిచేస్తా.’’


* రాజమౌళితో సినిమా గురించి...
‘‘రాజమౌళిగారితో ఎప్పుడో సినిమా చేయాలి. కానీ, కుదరలేదు. ఇంకా చర్చలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన వివరాలను త్వరలోనే మీకు చెబుతా. సందీప్‌రెడ్డి, త్రివిక్రమ్‌లు కథ చెబుతామన్నారు కానీ, ఇంకా అవి చర్చల దశలోనే ఉన్నాయి.’’


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.