మహేష్‌ చాలా బాగా నటించావన్నారు..
‘‘నటిగా ఇకపై కొత్త అవకాశాలు వస్తాయి. కాకపోతే మంచి కథలు రావాలి, వాటిని ఆసక్తిగా తీయాలి. ఇవి జరుగుతాయనే నమ్మకం కలిగినప్పుడు ఆ సినిమాలు ఒప్పుకొంటా’’ అన్నారు సుప్రియ యార్లగడ్డ. అక్కినేని నాగేశ్వరరావు మనవరాలైన ఈమె ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’తో కథానాయికగా పరిచయమయ్యారు. ఆ తర్వాత తెర వెనకే ఉంటూ సినిమా నిర్మాణ వ్యవహారాల్లో పాలు పంచుకొన్నారు. ఇరవయ్యేళ్ల తర్వాత ‘గూఢచారి’తో కెమెరా ముందుకొచ్చారు. ఆ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా సుప్రియ శనివారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు. ఆ విషయాలివీ...


* కథ విషయంలో చాలా తర్జనభర్జనలు పడ్డారు..
‘‘అడవి శేష్‌, శశికిరణ్‌ ఈ కథని చెప్పారు. నాకు నచ్చిందని చెప్పగానే ఇందులోని నాదియా పాత్రని నువ్వు చేయాలని అడిగారు. ‘నేను నటించి ఇరవై ఏళ్లయింది. ఇప్పుడు చేయగలనా?’ అనుకొన్నా. నేనెక్కువగా వ్యతిరేక ఛాయలతో కూడిన పాత్రల్ని ఇష్టపడతా. కానీ ఈ పాత్రలో పూర్తి వ్యతిరేక ఛాయలుండవు.. మంచి, చెడు భావనలు మీ నటనలో ప్రేక్షకులకి కనిపించాలని చెప్పారు. మనకు ‘గూఢచారి’ సినిమా అంటే కృష్ణ నటించిన ‘గూఢచారి 116’నే గుర్తుకొస్తుంది. అప్పుడు పరిస్థితులు వేరు. అందుకని కథ, కథనం విషయంలో చాలా తర్జనభర్జనలు చేశారు దర్శకనిర్మాతలు. అందువల్లే ‘గూఢచారి’ ఇంతగా ప్రేక్షకాదరణను దక్కించుకుంటోంది’’.* ఇంత రహస్యంగా ఎప్పుడు నటించావన్నారు..
‘‘మా అన్నపూర్ణ స్టూడియోలో సినిమా చిత్రీకరణలో ఉండటంతో కథానాయకుడు మహేష్‌ని కలిశా. ‘గూఢచారి’లో చాలా బాగా నటించావ్‌ అన్నారు. ఇంత రహస్యంగా ఎప్పుడు నటించావు?’ అంటూ నన్ను మెచ్చుకున్నారు. ఇకపై కూడా నటిస్తానా అంటే కచ్చితంగా నటించాలనే ఆలోచనైతే లేదు. కథల్నిబట్టి నమ్మకం కలిగితే అప్పుడు ఆలోచిస్తా. ‘అక్కడ అమ్మాయి..ఇక్కడ అబ్బాయి’ సినిమా తర్వాత స్టుడియో నిర్వహణ, చిత్ర నిర్మాణ పనుల్లో మునిగిపోయాను. స్వతహాగా కథలు రాయడం ఇష్టమైనందుకు చినమామయ్య నాగార్జునని అడిగి స్టుడియో నుంచి రూపొందుతున్న సినిమాల బాధ్యతల్ని స్వీకరించాను. తెలుగు పరిశ్రమ ఇప్పుడు ఒక మంచి దశలో ఉంది. స్టీరియో సినిమాలు రావడం లేదు. మన సినిమాలపై పొరుగు పరిశ్రమలు కూడా ఇష్టం పెంచుకొనేంతగా కొత్త తరహా సినిమాలు వస్తున్నాయి’’.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.