మేజిక్‌ను సృష్టించే సినిమా ‘మహర్షి’
‘ఎంత మంచి సినిమా అయినా... వసూళ్లు ప్రధానంగా విడుదల తర్వాత నాలుగు రోజులే ఉంటాయి. మరోపక్క పైరసీ వల్ల సినిమాలకి నష్టం జరుగుతోంది. అలాంటప్పుడు పెద్ద సినిమాలు అనుకొన్న వసూళ్లు సాధించాలంటే టికెట్టు ధరలు పెంచక తప్పదు’’ అన్నారు ప్రముఖ నిర్మాత దిల్‌రాజు. ఆయన అశ్వనీదత్, పీవీపీతో కలిసి నిర్మించిన ‘మహర్షి’ గురువారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. మహేష్‌బాబు కథానాయకుడిగా నటించిన చిత్రమిది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. చిత్రం విడుదలని పురస్కరించుకొని దిల్‌రాజు బుధవారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఆ విషయాలివీ...


*
‘‘మహేష్‌బాబు కెరీర్‌లో ఓ మైలురాయిలాంటి సినిమా ‘మహర్షి’. ఈ సినిమాతో చేసిన ప్రయాణం వల్లే అభిమానుల్ని ‘ఈ సినిమా విజయం విషయంలో ఎంతైనా ఆశించండి’ అని చెప్పా. ఇందులో చాలా ప్రత్యేకతలున్నాయి. మహేష్‌ 25వ సినిమాని అశ్వనీదత్, పీవీపీలతో కలిసి నేను నిర్మించడం, మూడు పెద్ద సంస్థలు కలవడం ఓ గొప్ప అనుభూతినిచ్చింది. ఈ చిత్రంతో వంశీ పైడిపల్లి అగ్ర దర్శకుల్లో ఒకరవుతారు. సమష్టి కృషి వల్ల ఈ చిత్రం ఓ మేజిక్‌ని సృష్టించబోతోంది’’.


* ‘బాహుబలి’ తర్వాత ఇదే...
‘‘ఎక్కువ నిర్మాణ వ్యయంతో నిర్మించిన చిత్రమిది. అందుకే అత్యధిక థియేటర్లలో విడుదల చేస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 2 వేల థియేటర్లలో సినిమా విడుదలవుతున్నట్టు లెక్క తేలింది. ఆన్‌లైన్‌ బుకింగ్‌ పరంగా మంచి స్పందన లభిస్తోంది కాబట్టి ఎప్పటికప్పుడు థియేటర్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ‘బాహుబలి’ తర్వాత అత్యధిక థియేటర్లలో విడుదలవుతున్న సినిమా ఇదే. తెలంగాణ ప్రభుత్వాన్ని ఐదో ఆట కోసం అనుమతిని కోరగా, అంగీకారం తెలిపింది. ఆ జీవో వల్ల హైదరాబాద్‌లో 50 నుంచి 80 థియేటర్లలో, జిల్లా కేంద్రాల్లో 30 నుంచి 35 చోట్ల 8 గంటలకే సినిమా ప్రదర్శితమవుతుంది. తెలంగాణలో ఇది కొత్త ట్రెండ్‌’’.

* ప్రభుత్వం కాదు.. కోర్టు అనుమతితోనే
‘‘సినిమా టికెట్టు ధరల విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి అనుమతిని ఇవ్వలేదు. థియేటర్ల యాజమాన్యాలే న్యాయస్థానాల అనుమతితో ధరలు పెంచారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు, తెలంగాణలోనూ ఎవరికి వారు థియేటర్ల యాజమాన్యాలు న్యాయస్థానాల్ని ఆశ్రయించి అనుమతిని పొందారు. ఈ పెంపుదల వారం రోజుల పాటే ఉంటుంది. భారీ నిర్మాణ వ్యయంతో రూపొందిన చిత్రాలు విడుదలవుతున్నప్పుడు థియేటర్ల యాజమాన్యాలు ఇలాంటి అనుమతిని పొందడం సహజమే. ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతికి సినిమాలు విడుదలైనప్పుడు ధరలు పెరుగుతుంటాయి. అక్కడ రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, విశాఖపట్నం, కర్నూలు వంటి నగరాల్లో సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లలో కూడా ఒక టికెట్టు ధర రూ: 200. కానీ తెలంగాణలో రూ: 125 మాత్రమే. అందుకే ఈసారి తెలంగాణలోని థియేటర్ల యాజమాన్యాలు కోర్టుకి వెళ్లి అనుమతిని తీసుకొన్నాయి’’.

* ప్రయాణంలోనే తేలుతుంది
‘‘మేం ఎంత ఖర్చు పెట్టాం? ఎంత తిరిగొచ్చిందనేది నిర్మాతలుగా మాకు మాత్రమే తెలుస్తుంది. ‘మహర్షి’ 18 నెలల ప్రాజెక్టు. మామూలుగా పెద్ద సినిమాల్ని 7 లేక 8 నెలల్లో పూర్తి చేస్తాం. కానీ ఈ సినిమా మీద అదనంగా పది నెలల భారం ఉంది. ఆ కాలం మొత్తానికి సంబంధించిన జీతభత్యాలతోపాటు, వడ్డీలు కలుపుకోవాలి కదా. ఇవన్నీ అంకెల్లో కనిపిస్తాయి తప్ప సినిమాలో కనిపించవు. సినిమా ప్రయాణంలోనే తేలేవే తప్ప, ముందే లెక్కగట్టి చెప్పే వ్యయం కాదిది’’.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.